Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలపర్తి సంధ్యారాణి... ఓ రచయితగా కనుమరుగునున్న వికలాంగుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఎంతోమంది మహిళా వ్యాపార వేత్తల జీవితాలను సమాజానికి పరిచయం చేశారు. తల్లిదండ్రుల సేవాభావాలను అందిపుచ్చుకుని 'శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్' ఆధ్వరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప సామాజిక సేవకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే...
మా సొంత ఊరు బాపట్ల. మానాన్న కీ.శే.పాలపర్తి వేణుగోపాల్, అమ్మ వసుంధర. నాన్న గారి ఉద్యోగ రీత్యా నేను ఉత్తర భారతదేశంలో పెరిగాను. అక్కడే డిగ్రీ వరకు పూర్తి చేశాను. బాల్యం కొంత బాపట్లలో గడిచింది.
నలుగురినీ కలుపుకుంటే
'శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్'ని 2018.1.18 మా నాన్న జన్మదినం రోజు ప్రారంభించాను. సమాజం కొరకు మా కుటుంబం అంత సేవ చేస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి వాళ్ళను చూస్తూ పెరగటం వల్ల అవసరం అయిన వారికి సహాయం చేస్తూ ఉండేదాన్ని. దాదాపు 40 సంవత్సరాలుగా సేవ చేస్తూ ఉన్నాను. నా సేవ కార్యక్రమాలు చూసి ఓ సంస్థ ఉంటే బావుంటుందనిపించింది. నేను ఒక్క దాన్నే చేయడం కంటే నలుగురినీ కలుపుకుంటే మరిన్ని కార్యక్రమాలు చేయవచ్చనే కొందరు మిత్రులు సూచించారు. అయితే నేను సంస్థను నడపగలనా లేదా అనే అనుమానం కాస్త భయపెట్టింది. మా నాన్నగారు రిటైర్ అయ్యాక తన సొంతూరు అయిన బాపట్లలో అనేక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు చేయాలని అనుకునే వారు. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. సంస్థ ద్వారా నాన్న ఆకాంక్షను తీర్చే అవకాశం వచ్చిందని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మిత్రులు, ఇంట్లో వారి సహకారంతో సంస్థ ఏర్పటు చేశాను. అప్పటి నుండి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను.
లాక్డౌన్ సమయంలో
2020 మార్చ్‌లో లక్డౌన్ విధించినప్పుడు ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు, వలస కార్మికుల సమస్యలు కన్నీళ్లు తెప్పించాయి. అప్పుడు కరోన చాలా తీవ్రస్థాయిలో ఉంది. పైగా వైరస్ పట్ట సరైన అవగాహన ఎవరికి లేదు. చాలా మంది వారిస్తున్నా వినకుండా బస్తీలు, గల్లీలు తిరిగాను. ఇంటింటికి వెళ్లి వాళ్ళ పరిస్థితులు తెలుసుకున్నాను. ఆకలితో అలమటించి ఏడుస్తున్న పిల్లల్ని చూసాను. మనసు ఎంతో కలత చెందింది. ఇంటికి వచ్చి ఒక పట్టిక తయారు చేసాను. అందులో ముందు ప్రాధాన్యం వృద్దుల్ని, పిల్లల్ని పెట్టుకున్న. ముందుగా 20 కుటుంబాలకు సరుకులు, పిల్లలకు కావాల్సిన తినుబండారాలు అందచేసాను. 10 రోజుల విరామం తర్వాత 35 కుటుంబాలకు సరుకులు ఇచ్చాను. ఇలా చేస్తుండగా ఓ రోజు ఒక బ్రాహ్మడు అడుక్కోవడం కనిపించింది. నా దగ్గరకు కూడా వచ్చి అడిగాడు. నేను డబ్బులు ఇవ్వను సరుకులు ఇస్తాను వచ్చి తీసుకెళ్లండి అని చెప్పాను. అప్పుడు మరో ఆలోచన వచ్చింది. కరోనా వల్ల గుళ్ళు మూసేసారు మరి పౌరోహిత్యం, పూజలు వీటిపై ఆధారపడి బతుకుతున్న వారి పరిస్థితి ఏమిటి అనిపించింది. ఇక పూజారుల వివరాలు సేకరించడం మొదలు పెట్ట. వాళ్లకు విడతాలవారిగా సరుకులు ఇచ్చాను. కొందరు మందులు కొనుక్కోలేక అవస్థలు పడుతున్న వారికి మందులు కొని పంపించాను. ఇప్పటి వరకు దాదాపు 500 మందికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాను. అలాగే కరోనా వారియర్స్ వైరస్‌ను, ఎండలను లెక్క చేయక డ్యూటీ చేస్తున్న పోలీసులకు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీర్లు, మాస్క్స్, సానిటీజర్స్ అందించా.
మహిళలకు గుర్తింపు లేదు
మహిళలు ఎంత చదువుకున్నా ఉద్యోగ, వ్యాపార రంగాలలో వారికి రావాల్సినంత గుర్తింపు రావడం లేదు. కావాల్సినంత ప్రోత్సహం దొరకడం లేదు. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళలను ఎదగనివ్వరు. అందుకే మహిళల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను గుర్తించి సత్కారాలు చేస్తున్నారు.
హింస పెరిగింది
కరోన కాలంలో మహిళలపై హింస బాగా పెరిగింది. పనులు లేక మగవాళ్ళు ఇళ్లల్లోనే ఉన్నారు. ఒకవైపు ఆర్థిక సమస్యలు. మరో వైపు కరోనా వైరస్ భయం. దాంతో మానసికంగా నలిగిపోయి విపరీత పోకడలతో ఇంట్లో ఆడవాళ్ళను కరకాలుగా బాధించిన కేసులు ఎన్నో విన్నాను, చూసాను. అలాంటి వారికి నా వంతు సహకారం అందించాను. అయితే మరో విధంగా చూస్తే కొంత మేర కరోన మంచే చేసింది. ఎందుకంటే నగరంలో అందరివీ ఉరుకుల పరుగుల జీవితాలు. ఇంట్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం ఉండదు. కరోనా వచ్చి అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది. దాంతో ఓ సెక్షన్ ప్రజలకు కుటుంబ సభ్యులతో గడిపే సమయం దొరికింది.
మన పిల్లలకు అవగాహన
నేను చేస్తున్న ప్రతి సేవ కార్యక్రమంలో నా కుటుంబ సహకారం చాలా ఉంది. అసలు వారి సహకారం లేకపోతే నేను ఇన్ని వందల కార్యక్రమాలు చేయగలిగేదాన్ని కాదు. మా అమ్మాయి గీతిక సలహాలు తీసుకుంటూ ఉంటా. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బావుంటుందో తను తన ఆలోచనలు నాతో పంచుకుంటుంది. నేను చేసే ప్రతి కార్యక్రమంలో తనని భాగస్వామిని చేస్తాను. ఎందుకంటే పిల్లలకు కూడా సమాజం పట్ల అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నాను. భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలతో పాటుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు వృత్తి విద్యా తరగతులు, వికలాంగులకు వాళ్ళు చేయగలిగిన వాటిలో శిక్షణ, బాగా చదువుకుంటున్న పిల్లలకు వారి అవసరాన్ని బట్టి సహాయ సహకారాలు అందించాలని అనుకుంటున్నాము.
- సలీమ