Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధాల్లో బయట కి కన బడకుండా, ఒక్కోసారి అనుభవిస్తున్న వ్యక్తికి కూడా తెలియకుండా కొంత హింస జరుగుతూ ఉంటుంది. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా జరిగే ఈ హింసని తట్టుకోవడం చాలా కష్టం. ఇలా నిరంతరంగా జరుగుతూ ఉంటే దానికి గురవుతున్న వ్యక్తి మానసికంగా బలహీనులవుతారు. వారి జీవితం మీద వారికి అధికారం ఉండదు. మరొకరి చేతిలో వీరి జీవితం గురించిన నిర్ణయాలు ఉంటాయి. వారి వద్ద వీరు బానిసలుగా బతుకుతూ ఉండవలసిన పరిస్థితి. అలాంటి హింసను గుర్తించడం ఎలా..?
మీ రక్షణ గురించి మీ భాగస్వామి ఆలోచించడం మంచి విషయమే. కానీ అది హద్దు దాటకుండా ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది. రోజంతా మీరేం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని పట్టించుకుంటూ మీ అంతట మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అడ్డం పడడం వంటివి సరైనవి కావు. వారు చెప్పే కారణం ఏమిటంటే మిమ్మల్ని చెడ్డ నిర్ణయాల నుండీ, చెడ్డ వ్యక్తుల నుండీ రక్షిస్తున్నామూ అని. మీరంటే ప్రేమ ఉంది కాబట్టే ఇదంతా చేస్తున్నాము అని. వారు ఏం చెప్పినా సరే ఇలా మీ వెనక వెనకాలే ఉంటే మాత్రం దాన్ని కూడా ఓ రకమైన హింస అనే అంటారు.
పెద్దగా ఎవరితోనూ కలవడానికి ఇష్టపడకుండా ఉండడం, అసలెలాంటి సోషల్ సర్కిల్ లేకుండా ఉండడం రెండూ వేరు వేరు. మీ భాగస్వామి ఎవరితోనూ కలవ కుండా ఉంటూ, మిమ్మల్ని కూడా అలాగే ఉండ మంటే బహుశా వారు రెండవ వర్గానికి చెందిన వారై ఉంటారు. మీరు ఎవరితోనూ సమయం గడపకుండా కేవలం వారికి మాత్రమే పరిమితమైపోయి ఉండాలని కోరుకోవడం కూడా ఓ రకమైన హింసే.
మీ స్నేహితులతో కలవనీయకపోవడం, మీ ఫోన్ వారి వద్ద పెట్టుకోవడం, మీ సోషల్ మీడియా పాస్వర్డ్స్ని మార్చేస్తూ ఉండడం వంటివి చేస్తూ ఉంటే మీ భాగస్వామికి మీ మీద నమ్మకం లేదని అర్ధం. మీ జీవితాన్ని వారి కంట్రోల్లో ఉంచు కోవడానికి చూస్తున్నారని అర్ధం. ఈ హింస ప్రేమ పేరిట జరుగుతూ ఉంటుంది, ఇలాంటి భావోద్వేగపరమైన హింసని గుర్తించడం చాలా కష్టం.
శారీరకంగా హింసకి గురి చేయడం, శిక్షలు విధించడం, మిమ్మల్ని బెదిరించడం వంటివి చేస్తూ ఉంటే మీ భాగస్వామి అబ్యూజర్ అన్న విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోనక్కరలేదు. కోపంలో మిమ్మల్ని బాధకి గురి చేస్తుంటే మాత్రం మీరు వెంటనే మీ సేఫ్టీ గురించి ఆలోచించుకోవాలి.
ఇలాంటి పనులన్నీ చేసిన తర్వాత మీ భాగస్వామి మీతో మామూలుగా ఉంటే మీరు ఆ బంధంలో ఉండాలా వద్దా అన్నది పునరాలోచించుకోవాలి. పైగా ఎలాంటి క్షమాపణలూ కోరకుండా మీ మీద ప్రేమ ఇంకా ఎక్కువైన విషయం కూడా మీరు గమనించవచ్చు. ఏదేమైనా, ఇలాంటి బంధాల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం.