Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత కాలంగా ఒక జీవన విధానానికి అలవాటు పడిన మనకు అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోమంటే.. ఎంతోకొంత ఒత్తిడికి లోనవడం సహజం. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితీ ఇలాగే ఉంది. ఏడాదిన్నర కాలంగా ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడి తిరిగి స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లాలంటే తెలియని ఆందోళనకు గురవుతున్నారు. ఇందుకు కరోనా భయం ఓ కారణమైతే.. 'అబ్బా మళ్లీ స్కూలా' అన్న అసహనం మరికొందరిలో ఉంది. ఏదేమైనా పిల్లల మనసులో ఉన్న ఈ ఆలోచనల్ని తొలగిస్తేనే వారు తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతారని చెబుతున్నారు నిపుణులు. మరి ఇందుకోసం తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసుకుందాం...
ఇంట్లో ఉండి బోర్‌గా ఫీలయ్యే పిల్లలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడానికే ఆసక్తి చూపుతుంటారు. అయినా కూడా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని కారణాలు పిల్లల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తల్లిదండ్రులు వాటిని గుర్తించి చిన్నారులకు అండగా నిలవాలంటున్నారు నిపుణులు.
ఒత్తిడికి కారణాలు
స్కూలుకెళ్లాలన్న ఆసక్తి ఉన్నా, తమ ఫ్రెండ్స్‌ని కలుసుకోవచ్చని ఆరాటపడుతున్నా.. ప్రస్తుత కరోనా పరిస్థితులు వారి భయానికి ఓ కారణం కావచ్చు. తాము సరైన జాగ్రత్తలు పాటిస్తామో, లేదో.. స్కూల్ వాతావరణం పరిశుభ్రంగా ఉంటుందో, లేదో.. తోటి విద్యార్థులు సరైన జాగ్రత్తలు పాటిస్తారో, లేదో.. ఇలా వారి భయాందోళనలకు కారణాలు చాలానే ఉండొచ్చు. కరోనా పరిస్థితుల రీత్యా చాలామంది తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. పిల్లల్ని కూడా అక్కడి పాఠశాలలో చేర్పించడానికి సిద్ధమయ్యారు. దీంతో పిల్లలకు స్కూల్ వాతావరణం, ఫ్రెండ్స్ అంతా కొత్తే! దీనికి అలవాటు పడే వరకు చిన్నారులు ఒత్తిడికి లోనవుతుంటారు. స్కూలుకెళ్లినా, కాలేజీకెళ్లినా, ఆఫీస్‌కెళ్లినా.. మొదటి రోజు ఎవరికైనా కాస్త నెర్వస్నెస్ ఉండడం సహజం. 'ఇంట్లో ఉండి లావయ్యావే!', 'ముఖంపై ఈ మొటిమలేంటి?'.. అంటూ తోటి పిల్లలు ఆటపట్టిస్తారేమోనని భయం. స్కూల్లో కరోనా బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా ఉండచ్చు. వాళ్ల అనుభవాలు తోటి పిల్లలతో పంచుకున్నప్పుడు భయాందోళనలకు గురవుతుంటారు. తమకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అన్న ఊహే వారిని తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తుంటుంది. తరగతి గదిలో పిల్లల మధ్య పదే పదే కరోనా విషయాలే చర్చకు రావడం, ఆ వార్తలో నిజమెంతో తెలుసుకోకుండా భయపడిపోవడం.. వంటివీ పిల్లల్లో అనవసరమైన ఒత్తిడికి కారణాలవుతున్నాయి.
ఇలా గుర్తించండి
మనసులోని ఆవేదనను తల్లిదండ్రులతో పంచుకోవడానికి చాలామంది చిన్నారులు ఆసక్తి చూపరు. ఎందుకంటే ఇలా చెప్తే పేరెంట్స్ కోపగించుకుంటారేమోనని వారి భయం. అయితే ఇలాంటప్పుడు వారి ప్రవర్తనను బట్టి ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించ వచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందెన్నడూ లేనంతగా మీతో దగ్గరగా ఉండాలనుకోవడం వంటి వారి ప్రవర్తనలో భయం, ఆందోళన గమనించచ్చు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ కనిపించడం. కడుపునొప్పి లాంటి ఇతర సాకులు చెప్పి స్కూలు మానేయడం.చిన్న విషయాలకే కోపగించుకోవడం. కడుపు నిండా తినకపోవడం, కంటి నిండా నిద్రపోక పోవడం. ప్రతి విషయాన్నీ నెగెటివ్‌గా ఆలోచించడం. గతంలో మాదిరిగా చదువుపై శ్రద్ధ పెట్టకపోవడం. చిన్న మాటలకే ఏడ్చేయడం. ఈ లక్షణాలు పిల్లల్లో గమనిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి.
ఇలా చేయండి
స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేటపుడు వైరస్ గురించి భయపెట్టకుండా.. అక్కడ ఎలా జాగ్రత్తగా ఉండాలో పిల్లలకు నేర్పించాలి. తోటి విద్యార్థులకు దూరంగా కూర్చోవడం, భోజనం పంచుకోకపోవడం, నిరంతరం మాస్క్ పెట్టుకొనే ఉండడం, చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం, పుస్తకాలు, ఇతర వస్తువులు పిల్లలతో పంచుకోకపోవడం, స్కూల్ వ్యాన్‌లో తోటి పిల్లలకు దూరంగా కూర్చోవడం.. ఇవన్నీ కరోనా జాగ్రత్తలే. వీటిని కచ్చితంగా పాటిస్తే వైరస్ ముప్పు చాలా వరకు తప్పుతుందని పిల్లలకు చెప్పి పంపించాలి. పిల్లలకు కొన్ని వ్యాపకాలు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. తిరిగి స్కూలుకెళ్తున్నారు కాబట్టి వారిని వాటిలో చేర్పించే ప్రయత్నం చేయండి. అయితే తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాలి. నిజానికి ఇలా ఇష్టపడి చేసే పని వారిలోని ప్రతికూలతల్ని తొలగించి సానుకూల దృక్పథాన్ని నింపుతుంది.
వారి మనసును పసిగట్టి
తల్లిదండ్రులు వారి పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. సాయంత్రాలు కొంత సమయం కేటాయించడం మంచిది. ఆ రోజు స్కూల్లో జరిగిన విషయాలు, చెప్పిన పాఠాల గురించి చర్చించాలి. ఇలా కూడా వారి మనసులోని మాటల్ని పసిగట్టి.. వారు ఆందోళనల నుంచి బయటపడేందుకు సహకరించచ్చు. ఇలా కుటుంబంతో గడపడం వల్ల వారూ ఒత్తిడి, ఆందోళనల్ని దూరం చేసుకొని.. ప్రశాంతతను, సంతోషాన్ని పొందుతారు.
మరికొన్ని మార్పులు
ఇప్పటిదాకా నాలుగ్గోడలకే పరిమితమై ఒంటరితనంతో ఉక్కిరి బిక్కిరైన చిన్నారులకు తిరిగి స్కూలుకెళ్లడం ఊరటనిచ్చే అంశం. అయితే దీంతో పాటు పేరెంట్స్‌తో ప్లే డేట్స్, వారాంతాల్లో కాసేపు అలా నచ్చిన ప్రదేశాలకు వెళ్లడం.. వంటివి కూడా వారిలోని ఒత్తిడిని దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. పిల్లలకు అందించే ఆహారం కూడా వారి ఒత్తిడిని దూరం చేస్తుంది. కాబట్టి వారి ఆహారంలో కోడిగుడ్లు, చేపలు, అవిసె గింజలు, పెరుగు.. వంటివి భాగం చేయాలి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగేలా వారిని ప్రోత్సహించాలి. మళ్లీ స్కూలుకెళ్తున్నారు కదా అని పదే పదే చదవమంటూ వారి వెంట పడడం మానుకొని.. పెయింటింగ్, డ్రాయింగ్, క్రాఫ్టింగ్.. ఇలా వారికి నచ్చిన అంశాలపై దృష్టి పెట్టమనండి. ఈ బిజీలో పడిపోయి ఎలాంటి ఒత్తిడీ వారి దరిచేరదు.