Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా తరువాత చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. మన జీవన విధానంలో ఇది చాలా మార్పులను తీసుకొచ్చింది. కొందరు బెడ్‌పై కూర్చొని పనిచేసేస్తున్నారు. తమ ల్యాప్‌టాప్‌లను ఒళ్లో పెట్టుకొని సోఫాలు లేదా మంచంపై కూర్చొని పని చేస్తారు. అయితే సరైన పద్ధతిలో కూర్చోకపోతే శారీరక, మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. అవేంటో తెలుసుకుందాం...
మూడ్ స్వింగ్స్: ఇతర గదులతో పోలిస్తే బెడ్రూమ్లలో వెలుతురు సరిగా ఉండదు. కొంతమంది పనిచేసేటప్పుడు ఎలాంటి అంతరాయం కలగకూడదని కిటికీలను సైతం మూసి ఉంచుతారు. దీంతో మనకు సహజంగా శక్తినిచ్చే సూర్యరశ్మి లేకపోవడం వల్ల గదిలో లైటింగ్ మసకగా ఉంటుంది. ఈ డిమ్ లైటింగ్ మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. ఫలితంగా మనసును ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ మూడ్ స్వింగ్స్‌కి కారణం కావచ్చు.
ఒత్తిడి, ఆందోళన: బెడ్రూమ్లో ఉండే కొద్దిపాటి వెలుతురు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఇది తీవ్ర ఆందోళన లేదా ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు కండ్లు తొందరగా అలసిపోతాయి. ఫలితంగా తెలియని అనాసక్తి వేధిస్తుంది.
ఊబకాయం: మంచం మీద నుండి పని చేయడం వల్ల విరామ సమయాల్లో అలాగే బెడ్‌పై పడుకుంటారు. ఇలా ఏమాత్రం కదలకుండా ఉండటం వల్ల శారీరక కదలికలు తగ్గుతాయి. ఇది అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుంది.
శరీర భంగిమపై ప్రభావం: సాధారణంగా కుర్చీలో కూర్చొని పని చేస్తున్నప్పుడు శరీరం సరైన భంగిమలో ఉంటుంది. కానీ బెడ్‌పై కూర్చొని వర్క్ చేయడం వల్ల శరీరం వంగిపోతుంది. దీంతోపాటు మెడ, చేతి, మణికట్టు నొప్పులు సైతం ఎదురవ్వచ్చు.
నిద్ర సమస్యలు: సాధారణంగా మనం బెడ్‌ను పడుకోవడానికి ఉపయోగిస్తాం. కానీ రోజంతా బెడ్‌పై కూర్చోని పనిచేయడం వల్ల.. రాత్రివేళ నిద్ర సరిగా పట్టకపోవచ్చు. ఎక్కువ సమయం మెలకువగా ఉంటే నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. ఇది అన్ని సమస్యలకు మూల కారణమవుతుంది. బెడ్‌పై కూర్చొని పనిచేయడం వల్ల పరధ్యానంలోకి వెళ్లవచ్చు. కొన్నిసార్లు మగతగా, నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. ఫలితంగా పనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేరు.
ఎసిడిటీ: ఎక్కువ సమయం కదలకుండా మంచం మీద ఒకే చోట కూర్చోవడం వల్ల ఎసిడిటీ, ఛాతిలో మంట వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు సైతం ఎదురవ్వచ్చు.
బయటపడటం ఎలా: ఆఫీస్‌లో మాదిరిగా ఇంట్లో వర్కింగ్ డెస్క్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. మీ ల్యాప్‌టాప్ ఛార్జర్ వైర్లు, ఇతర పని సంబంధిత వస్తువులను డెస్క్‌పై ఉంచుకోండి. బెడ్‌కు బదులుగా టేబుల్, కుర్చీ ఉపయోగిస్తూ వర్క్ చేసుకోవచ్చు. ఇలా రోజంతా పని చేసేటప్పుడు శరీర భంగిమను సరిగ్గా ఉంచుకోవచ్చు. దీంతో వర్క్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చు.