Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనాతో జీవితాలు తారుమారయ్యాయి. చాలామందికి ఉద్యోగాలు ఊడిపోయాయి. ఒత్తిడి ఎక్కవ అయిపోయింది. వేళాపాలే లేని పని సమయం. బస్సులు, వాహనాల మీద ఆఫీసులకు వెళ్లే వారికి, రోజంతా బయట తిరిగి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు మరో బాధను తెచ్చిపెడుతాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా ఇంటి బాధ్యతలు నిల్చోనివ్వవు, కూర్చోనివ్వవు. శారీరక శ్రమ అధికమవుతోంది. శరీరంలో నొప్పులు తెచ్చిపెడుతోంది. అటువంటి పరిస్థితిలో చాలా సార్లు పెయిన్ కిల్లర్స్ తీసుకుని పనిని పూర్తి చేస్తుంటారు. కానీ పదేపదే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. అందుకే ఈ ఒంటి నొప్పులు తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..
ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ఉప్పు అధికంగా తీసుకుంటే కీళ్ల మధ్యలో ఉత్పత్తి అయ్యే జిగురు లాంటి పదార్థాన్ని ఇది అడ్డుకుంటుంది. తద్వారా కీళ్ల సమస్యలు ఏర్పడతాయి. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు నువ్వులనూనెలో నిమ్మరసాన్ని కలిపి కీళ్లపై మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది. చెమట వచ్చేలా కొన్ని రకాల ఎక్సర్సైజ్లు చేస్తే స్వేదం ద్వారా లవణాలు బయటకు వెళ్లి కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఒకవేళ మీ శరీరంలో వాపు ఉన్నట్టయితే ఆవ నూనెను వాడాలి. ఒక కప్పు ఆవనూనెలో నాలుగు లవంగాలు, వెల్లుల్లి వేసి బాగా వేడి చేయాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పి ఎక్కువ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. సల్ఫర్, మెగ్నీషియం ఉప్పులో తగినంత పరిమాణంలో ఉంటాయి. ఉప్పును వేడి చేసి ఒక వస్త్రంలో ఉంచి నొప్పి వస్తున్న ప్రదేశంలో అప్లై చేయండి. శరీర నొప్పి నుంచి వెంటనే ఉపశమనం ఇస్తుంది.