Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు రాజ్యమేలుతున్నాయి. కోవిడ్ టీకా తీసుకోనివారు, వైరస్‌కు గురికాని వారూ ఎక్కువగా ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. చాలామందికి జలుబు, ముక్కు కారడం, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్నా ఎవరూ కరోనా టెస్ట్ చేయించుకోవడం లేదు. సాధారణ వైరల్ బాధిత లక్షణాల్లాగే ఉన్నాయని భావించి ఊరుకోవడం వల్ల కోవిడ్ చివరి దశకు చేరుకుంటున్నది. కోవిడ్ ఉధృతి తగ్గగానే పూర్తిగా దానిని మరిచిపోతున్నారు. జ్వరం వచ్చిన వాళ్ళు కూకషడా డెంగ్యూ టెస్ట్ చేయించుకుంటున్నారు గానీ కరోనా టెస్ట్ చేయించుకోవడం లేదు. ఫలితంగా పరిస్థితి చెయ్యి దాటిన తర్వాత బాధపడాల్సి వస్తున్నది. ఇంటికొకరిద్దరు జ్వరాలతో బాధపడుతుండగా ఆస్పత్రులన్నీ జనంతో నిండిపోతున్నాయి. 90-95 శాతం వైరల్ జ్వరాలు ఉండటంతో ఇది మామూలు జ్వరమేలే అని ఊరుకుంటున్నారు. కరోనా తగ్గిందని పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకు జనాలను భారీగా ఆహ్వానిస్తున్నారు. చాలా రోజులకు కలిశామన్న ఆనందంలో మాస్కులు, శానిటైజర్లు జనం మర్చిపోతున్నారు. ప్రస్తుతానికి రెండు కోట్ల వ్యాక్సిన్లు పూర్తయి మూడో కోటి మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ రెండవ డోస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇంజక్షన్ మూతలు, పత్తితో...
బాబా! బ్లాక్ షీప్ అంటూ నర్సరీ క్లాసులో రైమ్స్ చదువుకున్నాం కదా! గొర్రెలకు తెలివి ఉండదనీ, తలవంచుకుని ఎటుపోతున్నాయో తెలియకుండా ముందు దాన్ని చూసుకుంటూ పోతాయని గొర్రెల గురించి పెద్దవాళ్ళు చెపుతుంటారు. తెలివిలేని వాటికి, ఎవరు ఏమి చెప్పినా నమ్మే వాటికి ప్రతీకలుగా గొర్రెలను చెపుతారు. పంచతంత్ర కథల్లో ఎన్నో గొర్రెల కథలు చదువుకున్నాం. అలాంటి గొర్రెను ఈ రోజు తయారు చేసుకుంటున్నాం. గొర్రెల్ని ఎక్కువగా ఉన్ని కోసం, మాంసం కోసం పెంచుకుంటారు. ఇంజక్షన్ సీసాల మీద ఉండే మూతలతో నేను గొర్రెను చేశాను గానీ మీరు మంచినీళ్ళ సీసాల మూతల్ని వాడవచ్చు. నేను కూడా బులుగు రంగు మూతల్నే వాడాను. మంచినీళ్ళ సీసాల మూతలు దాదాపుగా నిండు బులుగు రంగులోనే ఉంటాయి. ప్రస్తుతం మా గొర్రెకు బాగా వూలు పెరిగి ఉన్నది. ఊలు పెరిగి ఉన్నట్టుగా కనిపించడం కోసం పత్తిని పెట్టాను. మా హాస్పిటల్లో కట్టుకట్టే దూది తెచ్చి నింపాను. చక్కని గొర్రె తయారయింది. గొర్రెలు తమ పిల్లల్ని పాలిచ్చి పెంచుతాయి. అంటే వీటిని క్షీరదాలు అంటారన్నమాట. ఈ గొర్రెలు 'బోవిడే' కుటుంబానికి, 'కాప్రినే' ఉపకుటుంబానికి చెందినటువంటి జీవులు. మగ గొర్రెల్ని పొట్టేలు అంటారు. ఈ మగ గొర్రెలకు కొమ్ములుంటాయి. ఆడ గొర్రెలకు కొమ్ములు ఉండవు. కొన్ని కులాల వారు వీటిని పెంచుకుంటూ జీవనం సాగిస్తారు. పెంపుడు జంతువుగా మనుష్యులతో సావాసం చేస్తుందని సినిమాలు కూడా తీశారు. 'పొట్టేలు పున్నమ్మ' సినిమా బాగుంటుంది.
వెంటిలేటర్ వేస్టుతో...
వెంటిలేటర్ల మీద ఉండే పేషెంట్లకు నోట్లో, ముక్కులో అన్నీ పైపులే ఉంటాయి. ఆ పైపులకు అక్కడక్కడ ప్లాస్టిక్ మూతలుంటాయి. ఆ ప్లాస్టిక్ మూతల్ని సేకరించి నేను ఎన్నో బొమ్మలు చేస్తున్నాను. ఈరోజు కూడా గొర్రెను తయారు చేస్తున్నాను. ఈ గొర్రెకు ఊలు ఎక్కువగా రాలేదు. బాగా లావుగా తయారయింది. దీని శరీరమంతా పాపడాలు పరిచాను. ఈ గొర్రెకు ఆకలి వేసినప్పుడు గడ్డి దొరకకపోతే తన దగ్గరున్న పాపడాలు తినేస్తుంది. బాగుందా ఈ ఆలోచన. ఈ గొర్రెలకు శాస్త్రీయంగా ఒక పేరు ఎప్పుడో పెట్టేశారు. ఆ పేరు తెలుసుకుందామా ''ఓవిస్ ఏరీస్'' అని దీని శాస్త్రీయనామము. ఇది ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో తెలుసా? పది నుంచి పన్నెండు సంవత్సరాల జీవితం జీవిస్తుంది. గొర్రెల గర్భధారణ కాలం 152 రోజులు. అంటే ఐదు నెలల కాలంలోనే పిల్లల్ని పెడుతుంది. వీటిని మాంసం కోసమే ఎక్కువగా పెంచబడతాయి. లేత పొట్టేలు మాంసానికి ఎక్కువ గిరాకీ ఉంటుంది. గొర్రెలను ఎక్కువగా మాంసం కోసమే పెంచుతారు కాబట్టి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. వీటికి గాలికుంటు వ్యాధి ఎక్కువగా సోకుతుంది. గొర్రెల మీద సామెతలు, జాతీయాలు ఎన్నో ఉన్నాయి. గొర్రె కసాయివాడినే నమ్ముతుంది అంటారు. ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళతోనే స్నేహంగా ఉండే మనుషులను ఉద్దేశించి ఈ సామెతను వాడతారు. మందబుద్ధి కలిగిన వాళ్ళనూ, తెలివి తక్కువ వాళ్ళనూ గొర్రెలతో పోలుస్తారు. గొర్రెల్లాంటి ప్రజలు అని రాజకీయ నాయకుల మాటల్లో వినిపిస్తాయి.
కాలీఫ్లవర్‌తో...
నేను కాలీఫ్లవర్‌తో కూడా గొర్రెను చేశాను. కాలీఫ్లవర్ పూలు ఎత్తుపల్లాలుగా ఉండటం వల్ల గొర్రెల ఆకారానికి సరిగ్గా సరిపోతుంది. కాలీఫ్లవర్‌ను గొర్రె ఆకారంలో కత్తిరించుకుని దానికి కాళ్ళుగా కాలీఫ్లవర్ కాండాన్ని అమర్చాలి. కన్ను కోసం నల్లని మిరియం గింజను అమర్చాలి. ఆకు కూరలు కింద పరిచి దానిపై ఈ గొర్రెను నిలబెట్టాను. గడ్డి తింటున్న గొర్రె తయారయింది. 'డాలీ' అనే గొర్రె పిల్లను క్లోనింగ్ ద్వారా 1996లో సృష్టించారు. క్లోనింగ్‌లో మొదటి ఆవిష్కరణ ఇదే. గొర్రెల కోసం ఎన్నో పిల్లల పాటలే కాకుండా ప్రముఖ రచయితల నవలల్లో కూడా ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాయి. థామస్ హార్టీ, జార్జి ఆర్వెల్, నీల్ ఆగ్లే రాసిన నవలల్లో గొర్రె ప్రధాన పాత్ర పోషించి అందరి మన్నలను అందుకుంది. కాలీ ఫ్లవర్లలో కొవ్వు తక్కువగా ఉండి, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. కాలీఫ్లవర్‌ను ఎక్కువగా తీసుకోవటం వలన హైపోకెలీమియా, హైపో నెట్రీమియా అనే వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. కాలీఫ్లవర్లు ఆరెంజ్, గ్రీన్, పర్పుల్ రంగులలో కూడా లభిస్తాయి.
శంకుపూలతో...
శంకు పూలతో గొర్రెను తయారు చేశాను. ఈ పూలను సంస్కృతంలో 'గిరికర్ణిక' అని పిలుస్తారు. వినాయక పూలలో వాడే విష్ణుక్రాంత పత్రికి సంబంధించిన మొక్క. ఈ మొక్కలు ప్రపంచమంతా విస్తరించి ఉంటాయి. తీగజాతి మొక్క. ఈ చెట్లను భూసారం పెంచడానికి ఎక్కువగా పెంచుతారు. ఆయుర్వేద వైద్యంలో శతాబ్ధాల కాలం నుంచి శంకు చెట్టు ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆసియాలో ఈ పుష్పాలను ఆహారపదార్థాల వర్ణకంగా వాడతారు. దీని శాస్త్రీయనామం ''క్లిటోరియా టెర్నేషియా''. ఈ చెట్టు గుబురుగా పెరుగుతుంది. మా ఇంటి కుండీలలో అన్నింటా ఈ శంకుపూల ఆధిపత్యమే ఎక్కువగా ఉన్నది. గొర్రెల పెంపకాన్ని ఒక పరిశ్రమగా కూడా నడుపుతారు. చైనా, ఆస్ట్రేలియా, భారత్, సూడాన్, ఇరాన్ దేశాలు గొర్రెలను ఎక్కువగా పెంచుతున్నాయి.
ఉప్పుడు బియ్యంతో...
గొర్రెలు శాకాహార జీవులు. నేను అలచందల్లో ఒక రకమైన లోబియా గింజలతో ఈ గొర్రెను తయారు చేశాను. గొర్రె శరీరమంతా ఉప్పుడు బియ్యాన్ని నింపాను. అలచందల్ని 'బ్లాక్ ఐడీపీ' అని పిలుస్తారు. సాధారణ అలచందల గింజల మధ్యలో నలుపురంగు మచ్చలుంటాయి. కానీ నేను వాడిన అలచందలు నిండు కాఫీ రంగులో ఉంటాయి. పైగా మెరుస్తూ ఉంటాయి. వీటిలో ఫైబర్ స్టార్చెస్, మినరల్స్ విపరీతంగా వాడుతున్నారు. వీటిలో అతి తక్కువ కొలెస్టరాల్ ఉండటంతో ఎక్కువగా వాడుతున్నారు. కన్ను, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి. గొర్రెలు సమశీతోష్ణ మండలాలలోనూ, భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న ఉష్ణ మండలాలలోనూ పెరుగుతాయి. గొర్రెల కాపర్లు వందల సంఖ్యలో గొర్రెల్ని పెంచుతూ, అనారోగ్యం పాలవకుండా మందలు వాడుతూ జాగ్రత్తగా చూసుకుంటారు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్