Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ రోజుల్లో నిత్యావసర వస్తువులను సైతం ఆన్లైన్లోనే కొనేస్తున్నారు. అయితే ఇలా ఆన్లైన్లో కొనేటప్పుడు కూడా కొంచెం తెలివిగా ఆలోచిస్తే డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆఫర్లు ప్రకటిస్తారో అప్పుడే నెలకు సరిపడా గ్రాసరీని కొనుగోలు చేయడం వల్ల ఖర్చులను తగ్గించుకోవచ్చు. అలాగే పేమెంట్ వ్యాలెట్ల ద్వారా లావాదేవీలు చేసినప్పుడు కొన్ని రకాల కూపన్లు వస్తుంటాయి. వాటిని షాపింగ్ చేసేటప్పుడు ఉపయోగించడం వల్ల కొద్దిమొత్తంలో మీ నెలవారీ బిల్లు ఆదా అవుతుంది.
ఒకే ప్లాన్: హ్యాండ్‌బ్యాగ్‌లో ఫోను, ఇంట్లో టీవీ అనేది ఇప్పుడు తప్పనిసరి. కానీ వాటి బిల్లులు నెలా నెలా తడిసి మోపెడవుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఖర్చులను కూడా కొంతమేర తగ్గించుకోవచ్చు. కొన్ని కంపెనీలు ఇంటర్నెట్, ఫోన్, డీటీహెచ్ సర్వీసులను ఒకే ప్లాన్‌లో ఇస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తుంటాయి. విడివిడిగా కాకుండా ఇలా ప్యాకేజీగా తీసుకుంటే వీటిపై ఉండే ఖర్చులను తగ్గించుకోవచ్చు.
ఆన్లైన్ షాపింగ్: ఇంట్లో నుండి కాలు బయటపెట్టకుండా అన్ని వస్తువులు ఇప్పుడు ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఇందులో కూడా ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో ఉండే ధరలు నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి మీకు కావాల్సిన వస్తువులను లిస్ట్‌లో పెట్టుకుని ఒకటి లేదా రెండు వారాలు చూడండి. ఎప్పుడు తక్కువ ధర ఉంటే అప్పుడు వాటిని కొనుగోలు చేయండి. ఫలితంగా కొద్దిమొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు కొన్ని రకాల పండగలు, సందర్భాల్లో ఫ్లాష్ సేల్స్ ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో తక్కువ ధరకే మనకు కావాల్సిన వస్తువులు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది.
ఎలక్ట్రిక్ వస్తువులు: మన నెలవారీ బిల్లుల్లో కరెంటు బిల్లు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బిల్లు తడిసి మోపెడవడానికి కారణం ఎలక్ట్రిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించడమని అందరికీ తెలుసు. అయితే ఏసీ, ఫ్రిజ్‌లు ఎక్కువ స్టార్లు ఉన్నవి తీసుకోవడం, ఎల్ఈడీ బల్బులు, ఫ్యాన్లను ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లులను కొంతమేర తగ్గించుకోవచ్చు.
వినియోగం తగ్గించండి: చాలామంది క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడుతుంటారు. తీరా, బిల్లు కట్టే సరికి జీతమంతా క్రెడిట్ కార్డు బిల్లుకే సరిపోతుంది. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నవారైతే వీలైనంత వరకు క్రెడిట్ కార్డు వినియోగం తగ్గించండి. లేకపోతే క్రెడిట్ కార్డులను తీసేసి కేవలం డెబిట్ కార్డు వరకు మాత్రమే పరిమితమవ్వండి.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్: సొంత వాహనాలు ఉపయోగించడం వల్ల ఎక్కువ ఖర్చవ్వడమే కాకుండా పర్యావరణానికి హానికరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కార్ పూలింగ్, క్యాబ్ సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా కొంతమేర ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం కూడా తగ్గుతుంది. అయితే కరోనా వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మరవద్దు.