Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవరాత్రులు ప్రారంభం అయ్యాయంటే ఆ సందడే వేరు. రోజుకోరకం వంటకం చేసుకుంటూ రుచిచూస్తారు. పండుగ అంటే నాలుకకు తీపి తగలాల్సిందే. సాధారణంగా దసరా రోజు కొన్ని రకాల స్వీట్లు చేసుకుంటాము. ఈసారి కాస్త వెరైటీ స్వీట్లు తయారు చేసుకుందాం. అవేంటో చూద్దాం.
కేసరి బాత్
కావాల్సిన పదార్ధాలు: అన్నం - కప్పు, పంచదార - కప్పు, జీడిపప్పు, కిస్మిస్ - పది చొప్పున, నెయ్యి - టేబుల్ స్పూను, ఏలకులు పొడి - చిన్న స్పూను, కేసరి రంగు - చిటికెడు.
తయారు చేసే విధానం: ముందుగా ఒక మందపాటి గిన్నెలో పంచదార పోసి అది మునిగే లాగా నీళ్లు పోయాలి. అందులోనే చిటికెడు కేసరి రంగు వేయాలి. సన్నని సెగ మీద పంచదారను కరిగే వరకు కలుపుతూ ఉండాలి. సన్న తీగపాకం రాగానే దాంట్లో అన్నం వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మూత పెట్టాలి. తర్వాత ఏలకుల పొడి వేయాలి. ఇంకో చిన్న బాండీలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి దాంట్లో వేసి స్టవ్ ఆపేయాలి.
సేమ్యా కేసరి
కావల్సిన పదార్థాలు: సేమ్యా - కప్పు, పంచదార - కప్పు, ఏలకుల పొడి - ఒక స్పూను, జీడిపప్పు, కిస్మిస్ - ఎనిమిది. నెయ్యి - టేబుల్ స్పూను. కేసరి రంగు - చిటికెడు.
తయారు చేసే విధానం: ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని దాంట్లో కొంచం నెయ్యి వేసి సేమ్యాని గోధుమరంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగాక కొంచం నీళ్లు పోయాలి. అందులోనే చిటికెడు కేసరి రంగు వేయాలి. సేమ్యా మెత్తపడ్డాక పంచదార వేయాలి. పంచదార బాగా కరిగాక ఏలకులు పొడి వేయాలి. ఇంకో బాండీలో నెయ్యి వేసి జీడీ పప్పు, కిస్మిస్ వేయించుకుని సేమ్యాలో వేయాలి. అంతే చాలా తొందరగా ఎంతో తేలికగా అయ్యే స్వీట్ సేమ్యా కేసరి.
పెసరపప్పు పాయసం
కావలసిన పదార్ధాలు: పెసరపప్పు - కప్పు, పాలు - రెండు కప్పులు, బెల్లం తురుము - కప్పు, జీడిపప్పు, కిష్మిష్, ఎండుకొబ్బరి ముక్కలు - పది చొప్పున, ఏలకులు పొడి - అరస్పూను, నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు.
తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మందపాటి గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఉడికిన పెసర పప్పుని పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఆ తర్వాత రెండు కప్పులు కాచిన పాలు పోసి సన్నని సెగమిద ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం మొత్తం కరిగిపోయాక వేరే బాండీలో మిగిలిన నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిష్మిష్, ఎండుకొబ్బరి ముక్కలు వేసి గోధుమ రంగులోకి వచ్చాక పాయసంలో వేయాలి. ఏలకులు పొడి వేసుకొని ఒక సారి బాగా కలియాబెట్టాలి. ఇది వేడిగా తిన్నా, చల్లారిన తర్వాత తిన్నా చాలా బావుంటుంది. బెల్లం స్టవ్ ఆపేసిన తర్వాతనే వేయాలి. లేకుంటే పాలు విరిగిపోతాయి.
సొరకాయ హల్వా
కావలసిన పదార్ధాలు: సొరకాయ తురుము - కప్పు, పాలు - కప్పు, పంచదార - కప్పు, నెయ్యి - చిన్న కప్పు, జీడిపప్పు, కిస్మిస్ - పది చొప్పున, ఏలకులు పొడి - ఆర స్పూను.
తయారు చేసే విధానం: ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని దానిలో మూడు చెంచాలు నెయ్యి పోసి అది వేడి ఎక్కాక సొరకాయతురుము నీళ్లు పిండేసే వేయాలి. సన్నని సెగమిద వేయించాలి. మూడు నిమిషాల వేయించాక పాలు పోసి ఉడికించాలి. బాగా మెత్తపడ్డాక పంచదార వేసి అది కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. మొత్తం కరిగిన తర్వాత వేరే బాండీలో మిగిలిన నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి వాటిని హల్వాలో వేయాలి. దించేముందు ఏలకులు పొడి వేసి ఒక సారి కలియ బెట్టి దింపేయాలి. వేడి వేడిగా ఈ హాల్వా చాలా బావుంటుంది.
- పాలపర్తి సంధ్యారాణి