Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితం, కెరీర్.. ఈ రెండూ తమకు రెండు కండ్లలాంటివి అంటున్నారు ఈతరం మహిళలు. అందుకే వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు దూసుకెళ్తున్నారు. అయితే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల ఒక్కో దశలో ఈ రెండింటినీ బ్యాలన్స్ చేయడం కుదరకపోవచ్చు.. అయినా అయిష్టంగానే ముందుకు సాగడం వల్ల దాని ప్రభావం ఇటు వ్యక్తిగత జీవితంపై, అటు కెరీర్‌పై.. రెండింటి పైనా పడుతుంది.. దాంతో దేన్నీ పూర్తిగా ఆస్వాదించలేం. అదిగో అలాంటప్పుడే కెరీర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ విరామమే మనలో కొత్త ఉత్సాహాన్ని నింపి.. తిరిగి ఉద్యోగానికి మనల్ని సంసిద్ధం చేస్తుందని చెబుతున్నారు. మరి ఇంతకీ ఎలాంటి సమయంలో కెరీర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవడం అవసరమో తెలుసుకుందాం...
కెరీర్ అనేది జీవితంలో ఒక చిన్న భాగం.. అంతేకానీ అదే మన జీవితం అనుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. అయితే కొంతమంది మాత్రం రోజంతా ఆఫీస్‌లోనే గడిపి, ఇంటికొచ్చినా అదే పనిలో నిమగమవుతుంటారు. ఏంటని అడిగితే.. వర్క్ బిజీ, అదనపు బాధ్యతలు అని చెబుతుంటారు. దానివల్ల వ్యక్తిగత జీవితానికి దూరం కావడం, కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.. ఇలా మానసిక ప్రశాంతతే కరువవుతుంది. దీని ప్రభావం కెరీర్ పైనా పడుతుంది.. ఉత్పాదకత లోపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఎన్ని గంటలు పనిచేసినా వృథానే! కాబట్టి ఇలా అటు కెరీర్‌ను, ఇటు ఇంటిని బ్యాలన్స్ చేయలేకపోతే మాత్రం కొన్నాళ్లు కెరీర్ నుంచి బ్రేక్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
వ్యక్తిగత జీవితం కూడా
ఇన్నాళ్లూ పని పని అంటూ ఏం కోల్పోయారో, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంతలా మిస్సయ్యారో.. అనే అంశాలపై దృష్టి సారించాలి. వాళ్లతో మరింత సమయం గడిపే ప్రయత్నం చేయాలి. వీలైతే విహార యాత్రలకూ ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మీకు కావాల్సినంత సమయం మీ వ్యక్తిగత జీవితానికి కేటాయిస్తే మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. శరీరం పునరుత్తేజితమవుతుంది. ఇదే ఊపుతో తిరిగి అదే ఉద్యోగంలోనైనా చేరచ్చు.. వీల్లేకపోతే కొత్త ఉద్యోగాన్నైనా వెతుక్కోవచ్చు.. ఏది చేసినా విజయమే కానీ అపజయం ఉండదు..
ఆరోగ్యానికే ప్రధాన్యం
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఉత్సాహంగా పనిచేయగలం. కానీ ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్ పనులతో ప్రస్తుతం చాలామంది మహిళలు విపరీతమైన అలసటకు గురవుతున్నారు. కొంతమందైతే సమయం లేదనో, బయటి ఆహారం తీసుకోవడం వల్లనో లేనిపోని అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. మధుమేహం, స్థూలకాయం, పీసీఓఎస్.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలూ మరికొంతమందిని వేధిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కెరీర్ కంటే ఆరోగ్యానికే తొలి ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అందుకే ముందు ఆరోగ్యంపై దృష్టి పెట్టడంలో భాగంగా కొన్నాళ్లు కెరీర్‌కి ఫుల్స్టాప్ పెట్టమంటున్నారు. మీ ఆరోగ్య సమస్యను బట్టి నిపుణుల్ని సంప్రదించి చక్కటి జీవన విధానం అలవర్చుకోవడం, పోషకాలున్న ఆహారం తీసుకోవడం.. వంటివి చేస్తే త్వరలోనే కోలుకోవచ్చు.. లేదంటే సమస్యనైనా అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇక ఆపై రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఉద్యోగంలో కొనసాగచ్చు. అయితే ఆ తర్వాత కూడా ఈ ఆరోగ్య నియమాలు పాటించడం మాత్రం తప్పనిసరి అన్న విషయం గుర్తుపెట్టుకోండి.
కొనసాగినా వృథానే
కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాలు, ఒత్తిళ్ల రీత్యా కొన్నిసార్లు నచ్చకపోయినా అదే ఉద్యోగంలో కొనసాగాల్సి రావచ్చు. దీనివల్ల పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. మరోవైపు అంతిమ లక్ష్యం వైపు అడుగులేద్దామంటే అంత సమయం ఉండకపోవచ్చు. మీరూ ఇలాంటి సమస్యతోనే బాధపడుతుంటే తప్పకపోయినా, కాస్త కష్టమైనా కొన్నాళ్లు కెరీర్‌కు బ్రేక్ ఇవ్వడం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీ అంతిమ లక్ష్యం అది కానప్పుడు ఎన్నాళ్లు అందులో కొనసాగినా వృథానే! పైగా కెరీర్లోనూ అభివృద్ధి సాధించలేరు. కాబట్టి మరీ కుదరని పక్షంలో పార్ట్‌టైమ్ ఉద్యోగమైనా చేస్తూ.. మీరు అనుకున్న కెరీర్‌పై దృష్టి సారించడం, లేదంటే పూర్తిగా మీ లక్ష్యంపై ఏకాగ్రత పెట్టడం.. వంటివి చేస్తే తప్పకుండా సక్సెసవుతారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతారు.
తోడ్పాటునందించాల్సిందే
మహిళలు ఇంటా, బయటా రాణించాలన్నా, వర్క్-లైఫ్ బ్యాలన్స్ చేసుకోవాలన్నా.. ఇటు కుటుంబం, అటు సంస్థలు తమ తోడ్పాటునందించాలి. అయితే చాలా కుటుంబాలు ఈ విషయంలో వెనకబడిపోతున్నాయనే చెప్పాలి. అందుకు మహిళలు ఎంచుకున్న కెరీర్, సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లు, కుటుంబ కట్టుబాట్లు.. ఇలాంటి కారణాలు వారి కెరీర్ అభివృద్ధికి అడ్డుపడుతున్నాయి. నిజానికి వారి చుట్టూ ఉన్న ఇలాంటి నిరుత్సాహకరమైన వాతావరణమే వారిని వెనక్కి లాగుతుందని చెప్పాలి. అయితే వీటిని అధిగమిస్తూ విజయవంతంగా ముందుకు సాగితే సరేసరి.. లేదంటే మాత్రం కొన్నాళ్ల పాటు కెరీర్ నుంచి విరామం తీసుకొని ఆయా అంశాలపై దృష్టి పెట్టడం మంచిది. ఒకవేళ కుటుంబ సభ్యులే మీ అభివృద్ధికి అడ్డుపడుతుంటే.. ఈ బ్రేక్ టైమ్‌లో వారికి నచ్చజెప్పి ఒప్పించే ప్రయత్నం చేయచ్చు.. మీరు కూడా ఉద్యోగం చేయడం కుటుంబానికి ఎంత ప్రయోజనకరమో వారికి వివరించండి. ఇలా మీ మాటలు వారిలో తప్పకుండా మార్పు తీసుకొస్తాయి. దాంతో ఏ ప్రోత్సాహమైతే మీరు కరువైందనుకున్నారో.. అది అంది మీరు రెట్టింపు ఉత్సాహంతో మీరు అనుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్లగలుగుతారు. అయితే ఇలా చుట్టూ ఉన్న వాళ్ల ప్రోత్సాహమే కాదు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగడం కూడా ఇక్కడ ముఖ్యమే.