Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత మందికి కాల్షియం సరిపడా ఉండదు. ఫలితంగా రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో బ్యాక్ పెయిన్ ఒకటి. 25 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లే వెన్నుపూసపై ఎక్కువ భారం పెడతారు. కాల్షియం లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. వీరిలో ఎక్కువమంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఊరుకుంటారు. చాలా సందర్భాల్లో ఈ నొప్పి దానికదే తగ్గిపోతుంది. కానీ వెన్నుపాములో సమస్య ఉంటే మాత్రం అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంది. కండరాలకు సంబంధించిన సాధారణ సమస్య నుంచి మూత్ర పిండాలలో రాళ్ల దాకా నడుము నొప్పికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే వెన్నుపాములో సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పి సర్వసాధారణం. ఎక్కువ మందిలో కనిపించేదీ అలక్ష్యం చేస్తే ప్రమాదకరమైనదీ అయిన నొప్పి మాత్రం డిస్కు సమస్యల వల్ల వచ్చే నడుము నొప్పే.
ఇంటి చిట్కాలతో: కొన్ని ఇంటి చిట్కాలతో నడుం నొప్పిని దూరం చేసుకోవచ్చు. కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకొని అందులో కాస్త కర్పూరాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు మరిగించిన తర్వాత చల్లారాక ఒక బాటిల్లో తీసుకుని రోజు పడుకునే ముందు నొప్పి ఉన్నచోట మర్దన చేయాలి. వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల నడుము నొప్పి మటుమాయం అవుతుంది అని చెబుతున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో నడుం నొప్పి ఉన్నప్పటికీ దానికి వెన్నుపాముతో ఎటువంటి సంబంధం ఉండదు. అలాగని అశ్రద్ధ చేయడం పనికిరాదు. ఇలాంటప్పుడు ఇతరత్రా సమస్యలేవైనా ఉండవచ్చు. అయితే నొప్పి లక్షణాన్ని బట్టి అది ఏ అవయవానికి సంబంధించిన సమస్యో కొంతవరకు నిర్థారించవచ్చు.