Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుష్క... మహిళల కోసం పనిచేసేందుకు 'నారి'ని ప్రారంభించింది. రుతుస్రావ సమయంలో చాలామంది మహిళలు నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఆర్థిక సమస్య, అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆమె గుర్తించింది. అందుకే ఈ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గొంతు విప్పింది. అంతేకాదు స్వయంగా లైంగిక వేధింపులకు గురయిన ఈమె సమాజంలో అన్ని రకాల వివక్ష, మహిళలపై వేధింపులను అంతం చేసేందుకే పని చేస్తున్నా అంటున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు...
డెహ్రాడూన్‌లోని యుపిఇఎస్ స్కూల్ ఆఫ్ లాలో లా విద్యార్థినిగా ఉన్న అనుష్క సెలవుల్లో ఉన్నప్పుడు జననేంద్రియ ప్రాంతంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా తన ఇంటిలో పని చేసే మహిళ చనిపోయిందనే విషయం తెలిసింది. చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాక ఆమె మరణం గురించి పరిశోధన ప్రారంభించింది. రుతుస్రావం సమయంలో ఒకే వస్త్రాన్ని పదేపదే ఉపయోగించడమే ఆమె మరణించడానికి ముఖ్య కారణమని తన అధ్యయనంలో తెలుసుకుంది. ఆమె మాత్రమే కాదు ఆ గ్రామంలో చాలామంది మహిళలు ఇలాగే చేయడం గుర్తించింది. ''భారతదేశం మహిళలకు ఇటువంటి ప్రాథమిక అవసరాన్ని ఎందుకు అందించలేకపోయింది'' అని అనుష్క ఆశ్చర్యపోయింది. ఈ ఆలోచన ఆమెను జంషెడ్పూర్ గ్రామీణ మహిళలతో సంభాషించడానికి ప్రేరేపించింది.
రెడ్ బ్యాడ్జ్‌గా...
చివరికి అనుష్క వారిలో అవగాహన కల్పించేందుకు 'నారి' అనే ఎన్జీఓని ప్రారంభించింది. ఇప్పుడు మహమ్మారి సమయంలో ఆగస్టు 2020లో ఇది రెడ్ బ్యాడ్జ్‌గా నమోదు చేయబడింది. ఇప్పుడు ఇంటింటికీ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడం ప్రారంభించింది. అనుష్క 'యంగ్ రీసెర్చర్ స్కాలర్షిప్ అవార్డు' అందుకుంది. 'భారతదేశంలో వివాహ అత్యాచార నేరాలు: ఓ సుదూర కల' అనే అంశంపై ఒక పుస్తకం రాసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 16 భాషలలో ప్రచురించబడింది.
కింది స్థాయి వరకు
'ప్రారంభంలో కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే నన్ను అర్థం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పటికీ మన సమాజంలో రుతుస్రావం చుట్టూ ఎన్నో నిషేధాలు ఉన్నాయని అప్పుడే నేను అర్థం చేసుకున్నాను'' అని అనుష్క చెప్పింది. శానిటరీ ప్యాడ్స్ పంపిణీ ప్రయత్నాలను స్వయంగా నడిపించడం గురించి అనుష్క కచ్చితంగా ఉంది. తద్వారా కింది స్థాయి వరకు వెళ్ళి మహిళల సమస్యల గురించి, తమకు చేరిన శానిటరీ ప్యాడ్లను ఉపయోగిస్తున్నారో లేదో తెలుసుకోవడంపై ప్రధాన దృష్టి పెట్టింది.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా
ఆమె చేస్తున్న ఈ కార్యక్రమానికి కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. యువత, పట్టణ సమాజం నుండి విమర్శలను ఎదుర్కొంది. తన బంధువులతో సహా చాలా మంది మహిళలు రుతుస్రావం బహిరంగంగా చర్చించాల్సిన విషయం కాదని వాదించారు. అయితే ఇవేవి అనుష్కను అడ్డుకోలేదు. పట్టుదలతో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మహిళల రుతు ఉత్పత్తులు, భారతదేశంలో పీరియడ్ పేదరికం అనే సమస్యను ఎదుర్కొనేందుకు ఆర్థిక అసమర్థతపై సంభాషించడం మొదలుపెట్టింది. వెనుకబడిన నిరుపేద మహిళలకు శానిటరీ న్యాప్కిన్లను అందించడం, వారి సమస్యలపై స్పందించడం వేగవంతం చేసింది. ఇది పట్టణ భారతదేశంలో ఓ ఆందోళనగా మారిపోయింది.
స్వయంగా వస్తున్నారు
ఈ రోజు 25 మంది స్వచ్ఛంద సేవకుల బృందంతో పని చేస్తున్న అనుష్క మహిళలలో వస్తున్న మార్పును చూసి సంతోషంగా ఉంది. ''ఇప్పుడు ప్రతి నెలా న్యాప్కిన్లు సేకరించడానికి మహిళలు జంషెడ్‌పూర్‌లోని నా కార్యాలయానికి స్వచ్ఛందంగా వస్తున్నారు'' అని ఆమె చెబుతుంది.
వ్యక్తిగత పోరాటాలు
నారిని ప్రారంభించడానికి ముందు రుతుస్రావ సమస్యలపై పని చేయడం అనుష్కకు అంత సులభం కాలేదు. జీవితాన్ని మార్చే క్షణంలో మార్పు ఆవశ్యకత ఏర్పడింది. ''నా కోసం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న అమ్మాయిలు, మహిళలందరి కోసం నిలబడవలసి వచ్చింది. నేను ఓ వ్యక్తితో సంబంధం కలిగివున్నాను. ఈ వ్యక్తి నన్ను విచ్ఛిన్నం అంచుకు నెట్టాడు. దాంతో కొన్నాళ్లుగా డిప్రెషన్, తీవ్రమైన ఆందోళన కోసం మందులు వాడవలసి వచ్చింది'' అంటూ ఆమె గుర్తుచేసుకుంది.
లైంగిక వేధింపులపై
తండ్రి సహకారంతో తనను తాను మార్పు చేసుకుని బహిరంగ వేదికలలో మాట్లాడటం మొదలుపెట్టింది. రుతుస్రావ సమస్యలతో పాటు శారీరక వేధింపులను ఎదుర్కొనేందుకు మహిళలకు అవగాహన కల్పిస్తుంది. ''ఒక లా స్టూడెంట్గ్ నేను ఈ వేధింపులకు భయపడి వెనక్కు తగ్గితే ఇతరుల కోసం నేను నా స్వరాన్ని ఎలా పెంచుతాను'' అంటూ ఆ రోజుల్లో ఆమె తన ఆలోచనలను గుర్తుచేసుకుంది.
చెప్పుకోవడానికి ఎవరూ లేరు
అనుష్క తన విద్య, న్యాయవాద నైపుణ్యాలను ఉపయోగించి సమాజంలో చర్చలలో పాల్గొనడం, మహిళలకు సహాయం చేయడం, వారి కేంద్రీకృత సమస్యలపై అవగాహన కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఆమె సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీకి వెళ్లి తన పేపర్‌ను అందించింది. అయితే ఇలా వేధింపులకు గురయ్యింది తను మాత్రమే కాదని ఆమె త్వరలోనే గ్రహించింది. ''భారతదేశం, ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది మహిళలు నా వద్దకు రావడం, వారు ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పటి వరకు వారి బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని అర్థం చేసుకున్నాను'' అని ఆమె చెప్పింది.
నిశ్శబ్దాన్ని విచిన్నం చేయడానికి
ఆమె వ్యక్తిగత పోరాటాలు, కథలు మహిళల్లోని నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రేరేపించాయి. అదే సమయంలో అనుష్క స్త్రీ-కేంద్రీకృత సమస్యలపై పుస్తకాలు, పరిశోధనా పత్రాలను రాయడం కొనసాగించింది. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకుగాను న్యూజిలాండ్ ప్రధాని నుండి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల మండలి అధ్యక్షురాలిగా పనిచేస్తున్నది. ''అన్ని రకాల వివక్ష, మహిళలపై వేధింపులను అంతం చేయడానికి నేను పని చేయాలనుకుంటున్నాను'' అని అనుష్క చెబుతుంది.
వారికి ఆహారం ముఖ్యం
మొదట్లో వారు ఈ విషయం గురించి నాతో మాట్లాడటానికి చాలా అయిష్టంగా ఉండేవారు. ఎంతో సంకోచించేవారు. రుతుస్రావం అనే పదం గురించి మాట్లాడటం వారికి చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ కొనుకోలు చేయడం కంటే రోజువారి కడుపునింపుకునేందుకు ఆహారం కోసం డబ్బు సంపాదించడం వారికి ప్రధాన అంశం. రుతుస్రావం, దాని చుట్టూ ఉన్న ప్రతీ విషయం గురించి మాట్లాడటానికి, అర్థం చేయించడానికి ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత వారికి చాలా నమ్మకం కలిగింది.
- అనుష్క
- సలీమ