Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కండ్లు కూడా ఒకటి. కండ్లు లేనిదే ప్రపంచాన్ని చూడలేం. అయితే ఈ కాలంలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, టీవీలు చూడడంతో కంటి చూపు తగ్గుతుంది. వాతావరణ కాలుష్యం వల్ల కూడా కండ్లు దెబ్బతింటున్నాయి. మరి కండ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహార పదార్థాలు ఏవో తెలుసా? కంటి ఆరోగ్యానికి కొన్ని ఆహార పదార్థాలు చాలా మంచివి. వాటిని రెగ్యులర్గా తీసుకోవడం వలన కంటి సమస్యలు తగ్గి.. కంటి చూపు మెరుగుపడుతుంది. అవేంటో తెలుసుకుందాం...
చేపలు ఎక్కువగా తింటే కంటి చూపు మెరుగవుతుందని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను నివారించడంలో దోహదపడతాయి. ట్యూనా, సాల్మన్ వంటి చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.
పాలకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్, విటమిన్ సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కంటి చూపు మెరుగుపడాలంటే ఆకు కూరలు ఎక్కువగా తినాలి.
గుడ్లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు , ప్రొటీన్స్ ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, జింక్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
పాలు, పెరుగులో విటమిన్ ఏ, జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. విటమిన్ ఏ కార్నియాను రక్షించడంలో దోహదపడుతుంది. జింక్ కారణంగా కంటిశుక్లాలు తగ్గుతాయి.
బాదంలో విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి కంటికి ఎంతో మేలు చేస్తాయి. బాదంతో పాటు వాల్నట్స్, చియా గింజలు, నువ్వు గింజలు, పల్లీలను తింటే కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
పప్పుల్లో ప్రోటీన్లు బాగా ఉంటాయి. కిడ్నీ బీన్స్, బఠానీల్లో బయోఫ్లేవనాయిడ్స్, జింక్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే కంటి చూపు పెరుగుతుంది. ఇతర కంటి సమస్యలు తగ్గుతాయి.