Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధుమేహ వ్యాధి గ్రస్తులు దొండకాయ తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించడంలో దొండకాయ బాగా పని చేస్తుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్న దొండకాయల్ని తింటే ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. అలాగే జీర్ణ సమస్యలను, బలబద్ధకాన్ని నయం చేసి రోగనిరోధక శక్తిని పెంచే వీటితో చేసే కొన్ని వంటకాల గురించి ఈరోజు తెలుసుకుందాం...
దొండకాయ ఉల్లికారం
కావాల్సిన పదార్ధాలు: దొండకాయలు - పావుకిలో, ఉల్లిగడ్డలు పెద్దవి - మూడు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, నూనె - సరిపడా.
తయారు చేయు విధానం: ఉల్లిగడ్డలు తరిగి మిక్సీలో వేసి కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. ఒక మందపాటి బాండీలో నూనె పోసి (కొంచం నూనె ఎక్కువ వేయాలి)దాంట్లో కొంచం జీలకర్ర వేసి అది వేగాక, దొండకాయలు గాట్లు పెట్టి వేయాలి. దొండకాయలు మగ్గిన తర్వాత రుబ్బి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టు వేయాలి. అవి కొంచం గోధుమరంగులోకి వచ్చాక తగినంత ఉప్పు, కారం, పసుపు వేయాలి. అన్ని ఒకసారి బాగా కలిపి దించేయాలి. ఇది అన్నంలోకి చాలా బావుంటుంది.
దొండకాయ పప్పు
కావాల్సిన పదార్ధాలు: కంది పప్పు - పావుకిలో, దొండకాయలు - పది, చింతపండు రసం, పసుపు, కారం, ఉప్పు, మెంతిపిండి, కరివేపాకు, పోపుదినుసులు, నూనె, ఇంగువ - సరిపడా.
తయారు చేయు విధానం: కందిపప్పు, దొండకాయలు విడి విడిగా కుక్కర్లో పెట్టి ఉడికించాలి. అవి చల్లారాక కండిపప్పుని మెత్తగా చేసుకుని దాంట్లో దొండకాయలు, చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు, మెంతి పిండి వేసి బాగా కలిపి కొద్దీ సేపు పొయ్యి మీద సన్నని మంట మీద ఉంచాలి. మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. అన్నం, చపాటిలోకి బావుంటుంది.
దొండకాయ పప్పు పులుసు
కావాల్సిన పదార్ధాలు: దొండకాయలు - పది, కందిపప్పు - గ్లాసు, చింతపండు రసం - కొద్దిగా, పచ్చి మిర్చి - రెండు, ఉల్లిగడ్డ - ఒకటి, ఉప్పు, కారం, పసుపు, పోపుదినుసులు, ఇంగువ, కొత్తిమీర.
తయారు చేయు విధానం: ముందుగా కందిపప్పుని కుక్కర్లో ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు ఓ మందపాటి గిన్నెలో దొండకాయలు (కొంచం గాట్లు పెట్టాలి), ఉల్లిగడ్డ సన్నగ తరిగి వేయాలి. పచ్చిమిర్చి పొడవుగా చీల్చి వేసి, ఒక గ్లాస్ నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. దొండకాయలు మెత్తగా అయ్యాక దాంట్లో చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు వేయాలి. ఇవి కొంచం మరిగాక ఉడికించుకున్న పప్పుని మెత్తగా చేసి వేయాలి. అన్నింటినీ ఒకసారి బాగా కలిపి ఉడకనివ్వాలి. పొయ్యి మీదనుంచి దించి ఇంగువతో పాటు పోపుదినుసులు వేసి అవి గోధుమరంగులోకి వచ్చాక పులుసులో వేయాలి. పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి. ఇష్టమున్నవారు కొంచం బెల్లం వేసుకోవచ్చు. దొండకాయలు అలాగే పచ్చివి తింటుంటే బావుంటుంది.
దొండకాయ ముక్కల పచ్చడి
కావాల్సిన పదార్ధాలు: దొండకాయలు - 15, చింతపండు గుజ్జు - కొంచం, ఉప్పు, పసుపు, పోపుదినుసులు, నూనె - తగినంత.
తయారు చేయు విధానం: ముందుగా దొండకాయల్ని సన్నగా, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక బాండీలో నూనె పోసి వేడెక్కాక అందులో పోపుదినుసులు వేసి వేయించాలి. ఎండు మిర్చితో సహా, అవి చల్లారాక రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు, చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి ఒక సారి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది అన్నంలోకి బావుంటుంది
- పాలపర్తి సంధ్యారాణి