Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక ఒంటరితనం మహిళల్లో హై బీపీ, రక్తపోటు(హైపర్ టెన్షన్) ప్రమాదాన్ని పెంచుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఈ పరిశోధన చేశారు. హైపర్ టెన్షన్ జర్నల్‌లో దీన్ని ప్రచురించారు. సోషల్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండే మధ్య వయసు, వృద్ధ మహిళలు హైపర్‌టెన్షన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. గతంలో ఏజింగ్‌పై కెనడియన్ లాంగిట్యూడినల్ చేసిన అధ్యయనం డేటాను పరిశోధకులు ఉపయోగించారు. వారు 45 నుంచి 85 ఏండ్ల మధ్య వయసు ఉన్న 28,238 మంది సామాజిక బంధాలను (సోషల్ బాండింగ్) విశ్లేషించారు. ఒంటరిగా ఉంటూ, ఒక నెలలో మూడు కంటే తక్కువ సామాజిక కార్యకలాపాలలో నిమగమైన మహిళలు, కాంటాక్ట్స్ లిస్ట్‌లో 85 కంటే తక్కువ మంది ఉన్నవారు హైపర్‌టెన్షన్ బారిన పడ్డారని పరిశోధకులు గుర్తించారు.
వితంతువులకు ప్రమాదం ఎక్కువ: వితంతువులు, ఒంటరి మహిళలు, సామాజిక చురుకుతనం తక్కువగా ఉన్న మహిళలలో సిస్టోలిక్ బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. వివాహితలతో పోలిస్తే వితంతువుల్లో బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నట్టు కనుగొన్నారు. వితంతువులు ఎక్కువగా హైపర్‌టెన్షన్ బారిన పడుతున్నారని గుర్తించారు. పురుషుల విషయంలో ఇది వ్యతిరేకంగా నమోదైంది. సోషల్ నెట్వర్క్ ఎక్కువగా ఉండి, ఎక్కువ మంది వ్యక్తులతో కలిసి నివసించే మగవాళ్లలో బీపీ ఎక్కువగా ఉంటోంది. తక్కువ నెట్వర్క్ కలిగి, ఒంటరిగా నివసించే వారికి తక్కువ రక్తపోటు ఉన్నట్టు గుర్తించారు.
జాగ్రత్తలు తీసుకోవాలి: పరిశోధనకు వేర్వేరు వ్యక్తుల సోషల్ ఇంటరాక్షన్ ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా జీవించే వ్యక్తులు సమతులాహారం తీసుకుంటూ వ్యాయామం చేయడం, సామాజిక కార్యకలాపాల్లో క్రమం తప్పకుండా పాల్గొనడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒంటరిగా జీవించే మహిళలు సాధారణంగా సోడియం ఎక్కువగా తీసుకుంటారని యూబీసీ సంస్థలో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అన్నాలిజ్న్ కాంక్లిన్ చెబుతున్నారు. దీంతో వారు ఊబకాయం బారిన పడే అవకాశాలున్నాయి.
ప్రత్యేక శ్రద్ధ అవసరం: ఒంటరితనం.. పురుషులు, మహిళలపై భిన్నమైన ప్రభావాలను చూపుతుందని అధ్యయనం తేల్చింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తక్కువ సోషల్ ఇంటరాక్షన్ ఉండే వృద్ధ, వితంతువులను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు పరిశోధకులు సూచిస్తున్నారు. వారికి అందించే ఆహారం, సోషల్ ఇంటరాక్షన్‌పై శ్రద్ధ వహించడం వలన బీపీ, హైపర్‌టెన్షన్, గుండెపోటు, స్ట్రోక్‌ల నుంచి వారిని రక్షించవచ్చు.