Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా తీవ్ర రూపం తగ్గిందని అందరూ పండుగలు, ఫంక్షన్లు చేసుకుంటున్నారు. ఈ మధ్య వచ్చిన బతుకమ్మ, దసరా పండుగలకు ఊరంతా ఒకే చోట జమయ్యారు. అంటే వేల మంది ప్రజలు చాలా కాలం తర్వాత ఒకచోట కలిశారు. అయితే ఈ పండుగల తర్వాత కరోనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు. ప్రమాద స్థాయి కరోనా నుంచి బయటపడినా దానికి వేరే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కండ్ల మంటలు, చూపు మందగించటం, కాంతిని తట్టుకోలేకపోవడం వంటి కంటి సమస్యలు, చెవుల్లో హౌరుమనేమోత, స్పష్టంగా వినపడకపోవడం వంటి చెవి సమస్యలు, ఒళ్ళంతా సూదులు పొడిచినట్టు, తిమ్మిర్లు వంటి చర్మ సమస్యలూ వెంటాడుతున్నాయి. రుచి, వాసనా వంటివి కరోనా జ్వర లక్షణాలే అయినప్పటికీ కోవిడ్ తగ్గినా రుచి, వాసనా కొంతమందికి తిరిగి రావటం లేదు. వాసనలు పసిగట్టేనాడులు పూర్తిగా దెబ్బతినటం వల్ల ఇలా సంభవిస్తున్నది. ఘ్రాణశక్తిని కోల్పోవటం వల్ల ముఖ్యంగా మహిళలకు వంటింట్లో గ్యాస్ లీకేజీ వంటి ప్రమాదాలను గుర్తించలేరు. ఫలితంగా మరింత పెద్ద ప్రమాదాలకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా కరోనా పూర్తిగా వదిలిపోయే దాకా మనం మన జాగ్రత్తలలో ఉంటే మంచిది. ఇంట్లో ఉండి సృజనకు మెరుగుపెడదాం.
శంకు కాయలతో...
మా ఇంట్లో శంకు చెట్ల వనం తయారయిందని చెప్పాను కదా! ఈ చెట్లకు కాయలు విపరీతంగా కాస్తాయి. చెట్ల నిండుగా కాయలే కనిపిస్తాయి. పచ్చిగా ఉన్నప్పుడు చెట్ల ఆకుల్లో కలసిపోయి కనిపి స్తాయి. ఎండిపోయాక నున్నటి ఉపరితలంతో లేత పసుపురంగుతో చక్కగా ఉంటాయి. ఈ సమయంలో బొమ్మలు చేసుకోవచ్చు. ఆ తర్వాత కాయలు పగిలిపోయి విత్తనాలు బయటకు వచ్చేసి, కాయ మీద తొక్కలు వంకర తిరిగిపోతాయి. ఈ తొక్కలను, విత్తులను కూడా బొమ్మల్లో ఉపయోగించవచ్చు. కానీ కాయ పగలక ముందే నేను బొమ్మలో ఉపయోగించాను. నేనీ రోజు తూనీగల్ని చెయ్యాలనుకున్నాను. చాలామంది పిల్లలు తూనిగ రెక్కలకు దారాలు కట్టి ఆడుకుంటుంటారు. తూనీగ చాలా వేగంగా పరిగెడుతుంది. పిల్లలు అటూఇటూ పరిగెడుతుంటే తూనిగల్లా పరిగెడుతున్నారు అంటారు. పిల్లలు అంటే తూనీగలే. తూనీగా తూనీగా అనే సినిమా పాట బాగా ఫేమసై ప్రజల నోళ్ళలో నానింది. పెద్ద రెక్కలు, పొడుగైన తోక కలిగిన కీటకం తూనిగలు ఎక్కడ ఉంటే అక్కడ జీవావరణ సమతుల్యత సరిగా ఉంటుంది. ఆడ తూనీగ నీటిలో కానీ, నీళ్ళకు దగ్గర్లో కానీ గుడ్లు పెడుతుది. గుడ్లు పెరిగి లార్వాలుగా మారి బయటకు వస్తాయి. నీటిలో మునిగి తూనీగ గుడ్లు పెట్టినపుడు వాటి లార్వాలు నీటిలో ఈదుకుంటూ బయటికి వస్తాయి. తూనీగ ఆర్ధ్రోపొడ కుటుంబానికి, కీటకాల విభాగానికి చెందినది. తూనీగల్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు. పల్లె జనుల సంస్కృతి తూనీగలతో ముడిపడి ఉంటుంది. ఎరుపు రంగులో ఉండే నిప్పురెక్కల తూనీగ అనే అరుదైన తూనీగ ఉంటుంది.
కుక్క ఆహార పదార్థాలతో...
రాయల్ కెనైన్ అనబడే కుక్కల ఆహారంతో నేనీరోజు తూనీగను సృష్టించాను. ఈ ఆహార పదార్థాలు కుక్కలను ఆకర్షించడానికి రకరకాల ఆకారాల్లో దొరుకుతాయి. పిల్లలు తినే చాక్లెట్లను రకరకాల ఆకారాలు, రంగుల కాగితాలు చుట్టి తయారు చేసినట్టుగా కుక్కపిల్లల ఆహారం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇప్పుడు నేను తయారు చేసింది త్రికోణాకృతిలో ఉండే గింజలతో. ఈ గింజల్లో చికెన్, వెజిటబుల్స్‌తో కలిపి ఉంటాయి. కుక్కపిల్లలకు ఇది బాగా పౌష్టిక ఆహారం. మాకు మొన్నటి దాకా 'రాట్‌వీలర్' జాతి కుక్క కూడా ఉండేది. అది కూడా ఈ ఆహారాన్ని బాగా తినేది. ఇప్పుడు 'టారు పూడిల్' జాతి కుక్క కూడా ఉన్నది. ఈ ఆహారం చిన్న చిన్న గింజలుగా ఉండటం వలన బొమ్మలకు బాగా అనువుగా ఉంటుంది. వీటితో చక్కని నల్ల తూనీగ తయారయింది. తెలంగాణలో వీటిని బూగలు, గూగలు, దువ్వెన్లు అనీ పిలుస్తారు. కార్బానిఫెరస్ యుగంలో తూనీగలు చాలా పెద్ద ఆకారంలో ఉండేవని అప్పటి శిలాజాల వలన తెలుస్తున్నది. 325 మిలియన్ సంవత్సరాల పూర్వం ఉన్న తూనీగల రెక్కల పొడవు 750 మి.మీలు ఉండేదట. ప్రస్తుతం 3000 జాతులు తూనీగల్లో నివసిస్తున్నాయి. ఇవి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. చాలా వరకు ట్రాపికల్ రిజియన్లో బతుకుతాయి. కొన్ని మాత్రమే ఉష్ణమండల ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి.
పొన్నెగంటి కూరతో...
ఆకు కూరల్లో పొన్నగంటి కూరకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఇది 'అమరాంధేని' కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయనామం ''ఆల్టర్నాంధెరా సెసిలిస్''. దీనిలో 'ఏ విటమిన్ ఎక్కువగా ఉండటం వలన కండ్లకు మంచిదని చెప్తారు. పొన్నగంటి కూరకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కంటి చూపు పోయిన వ్యక్తికి ఈ కూర వాడి చూపు తెప్పించడంతో పొన్నగంటి కూరగా నిలబడిపోయింది. ఈ కూరను కన్నడంలో ''వోనుగొనె సొప్పు'' అంటారు. అలాగే సంస్కృతంలో దీన్ని మత్యాక్షి పత్తూర్ అనీ, తమిళంలో 'పొన్నన్కన్నిక్కిరై' అనీ, మలయాళంలో 'పొన్నన్నాని' అనీ పిలుస్తారు. ఇది పాకే మొక్క. ఔషధ విలువలు కలిగినది. ఆకులు కోసుగా ఉండటం వల్ల తూనీగ ఆకారానికి సరిపోతాయని భావించి తయారు చేశాను. ఇది కాండంతో పెరిగే మొక్కనే. కానీ విత్తనాలు ఉండవు. దీని పువ్వులు చిన్నవిగా, తెల్లగా, ముద్దుగా ఉంటాయి. ఈ కూర భారతదేశం, శ్రీలంకల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు ఆసియా అంతటా వ్యాపించింది. ఇలాంటి పొన్నగంటి కూరతో తూనీగ తయారయింది.
బ్రౌన్‌రైస్‌తో..
ఈ మధ్య చాలా ఇళ్ళలో డైటింగ్ చేస్తున్నారు. దాని కోసం పాలిష్ చెయ్యని ముడి బియ్యం తింటున్నారు. బియ్యాన్ని పాలిష్ పట్టి తెల్లగా మెరిసేలా చేసి తింటే కానీ మనకు రుచించదు. కానీ బియ్యం మీద ఉండే బ్రౌన్ కలర్ పొరలో 'బి' విటమిన్ ఉంటుంది. మనం తెల్లని బియ్యం తినటం వల్ల ఆ పొరలన్నీ పోతాయి. దాంతో అందులోని 'బి' విటమిన్ పోతుంది. మా ఇంట్లో కూడా బ్రౌన్ రైస్ తింటున్నాం. నాకు బలం రావటమేమోగానీ బొమ్మలు మాత్రం వస్తున్నాయి. ఈ బ్రౌన్‌రైస్‌తో చాలా బొమ్మలు చేస్తున్నాను. ఈ తూనీగను లోబియా అనే అలచందల గింజలతో తయారు చేశాను. లోబియా గింజల దేహంతో, పొట్టనిండా బ్రౌన్ బియ్యంతో నింపేసి తూనీగ తయారు చేశాను. తూనీగలు బాగా వేగంగా ఎగరగలుగుతాయి. ఇవి సముద్రాలు దాటి కూడా వలసలకు వెళ్ళిపోతాయి. వీటి లార్వాలను 'నయాడ్స్' అంటారు.
ముగ్గుతో...
నాకు ముగ్గులంటే చాలా ఇష్టమని తెలుసుకదా! ఎన్నో సామాజిక సమస్యల మీద, ఆరోగ్య సమస్యలనూ ముగ్గులుగా రూపొందించాను. అలాగే ఈరోజు తూనీగల ముగ్గు రూపొందించాను. తూనీగల బొమ్మలు చేస్తున్నానని తెలియగానే, మా గార్డెన్లో మొక్కల మీద ఎగిరే తూనీగలు ''ముగ్గు తయారు చేయవా'' అని అడిగాయి. వెంటనే తూనీగల ముగ్గు తయారు చేసి ఇంటి ముందు వేశాను. కుండీల్లోని మొక్కల మీద తిరుగుతున్న తూనీగలు వచ్చి నా ముగ్గు చుట్టూ ప్రదక్షిణాలు చేశాయి. తూనీగలు మానవ సంస్కృతిని ప్రతిబింబింప చేస్తాయి. రాళ్ళ మీద పెయింటింగులు, కుండల మీద చిత్రాలు, విగ్రహాల్లోనూ తూనీగలు కనిపిస్తాయి. జపాన్, చైనాల్లోని సంప్రదాయ వైద్యంలో తూనీగల్ని వాడుతారు. 'లార్ట్టెన్నీసన్' అనే కవి తూనీగల రంగులు, ఎగురటంలోనూ కవితలు అల్లారు. హెచ్.ఇ బేట్స్ అనే రచయిత తన కథల్లో తూనీగల ప్రస్తావన చేశాడు. నేనూ తూనీగల పాటలు రాశాను. బాలసాహిత్యం రాసేవాళ్ళందరూ తూనీగ గురించి రాసే ఉంటారు.
- డాక్టర్ కందేపి రాణీప్రసాద్