Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిరుచితోనైనా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికైనా.. ఇలా కారణమేదైనా ఎవరైనా ఉద్యోగం చేసేది అంతిమంగా నెల జీతం కోసమే. అయితే మనకు అప్పగించిన బాధ్యతలు, వాటిని మనం సమర్థంగా నిర్వర్తించే విధానాన్ని బట్టే మన కెరీర్ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకొనే ఉద్యోగి పదోన్నతులు, జీతం పెంచడం.. వంటివి ఆయా సంస్థలు నిర్ణయిస్తుంటాయి. అయితే కొని సందర్భాల్లో జీతం అడగడానికి మొహమాట పడుతుంటారు కొందరు ఉద్యోగులు. కానీ అలాంటి మొహమాటం, భయం అవసరం లేదంటున్నారు నిపుణులు. నిజంగా మీ పనితనంతో మీరు సంతృప్తి పడితే.. ఆ విషయాన్ని పైఅధికారుల దృష్టి తీసుకెళ్లి.. పనికి తగ్గ ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదంటున్నారు. మరి అదెలాగో మనమూ తెలుసుకుందాం...
సంస్థలు ప్రతి ఉద్యోగిపై కొన్ని అంచనాలు పెట్టుకుంటాయి. వారి నైపుణ్యాలు, పనితనం, అనుభవాన్ని బట్టి వారికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తుంటాయి. ప్రతి ఉద్యోగి ఆయా బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తూ పైఅధికారుల అంచనాల్ని అందుకునే ప్రయత్నం చేయాలి. అయితే కొంతమంది ఉద్యోగులు తమ శక్తి మేర కష్టపడినప్పటికీ పనిలో ప్రాధాన్యతలపై దృష్టి పెట్టకుండా, పైఅధికారులను సంప్రదించకుండా తమకు నచ్చిన పని చేసుకుంటూ పోతుంటారు. ఇది కూడా ఒకరకంగా సంస్థ అంచనాల్ని అందుకోకపోవడమే అంటున్నారు నిపుణులు. ఫలితంగా మీరు ఎంత కష్టపడినా, పనిలో మెరుగైన ఫలితాలు సాధించినా ఆ సమయంలో అవి వారికి వృథాగా కనిపించచ్చు. ఇలాంటప్పుడు 'మేము కష్టపడ్డాం.. అందుకు తగ్గ ప్రతిఫలం కావాలి' అని అడగడం కూడా సరికాదు. కాబట్టి ముందుగా కంపెనీ మీపై పెట్టుకున్న అంచనాల్ని, మీకు అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా, నిర్దేశించిన సమయంలో పూర్తి చేసి చూడండి.. ఆ తర్వాత జీతం పెంచమని, పదోన్నతి కల్పించమని వారికో ప్రపోజల్ పెట్టినా దాన్ని వారు పరిగణనలోకి తీసుకునే అవకాశాలుంటాయి.
తొందరపాటు పనికి రాదు
సహోద్యోగులకు పదోన్నతులు రావడం, జీతం పెరగడం కొంతమంది ఉద్యోగులు జీర్ణించుకోలేరు. 'మేమూ వాళ్లతో సమానంగా పనిచేశాం.. అలాంటప్పుడు ఎందుకింత పక్షపాతం' అన్న ధోరణి వాళ్లలో ఉంటుంది. అయితే వాళ్లలా మీకు జీతం పెరగకపోవడానికి, పదోన్నతి రాకపోవడానికి మీరు చేసే పనిలో, మీ ప్రవర్తనలో ఎక్కడో ఏదో ఒక లోపం ఉండి ఉండచ్చన్న విషయం అర్థం చేసుకో మంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నారు. తద్వారా అది పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంటుంది. అలాగే ఈ విషయంలో తొందర పడకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకునే దిశగా ముందుకు సాగాలి. ఇందుకోసం ఓ ఏడాది సమయాన్ని నిర్దేశించుకోవాలి. అలాగే మీ పనికి సంబంధించిన కొన్ని లక్ష్యాల్ని పెట్టుకొని వాటిని సమర్థంగా నిర్వర్తించగలగాలి. అవసరమైతే మీ సీనియర్స్ సహకారం కూడా తీసుకోవచ్చు. ఎలాగూ దాదాపు అన్ని కంపెనీలు కనీసం ఏడాదికోసారైనా ఎంతో కొంత శాతం జీతం పెంచుతాయి కాబట్టి.. ఇలా మీరు చేసే పనిని, దానికి సంబంధించిన రిపోర్ట్‌ను పైఅధికారులకు సమర్పించి మీకు శాలరీ హైక్ ఇవ్వాల్సిందిగా కోరచ్చు.
ఓపిక అవసరం
నిజంగా మీరు చేస్తోన్న పని, సంస్థ అభివృద్ధి విషయంలో నిర్వర్తిస్తోన్న బాధ్యతలు మీకు సంతృప్తినిస్తే మీకు జీతం పెంపు కావాలని, పదోన్నతి కల్పించాలని అడగడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. అయితే అందుకూ ఓ పద్ధతుందంటున్నారు. ఇతరులకు జీతం పెంచారు.. మాకు పెంచలేదన్న కోపాన్ని ప్రదర్శించడం, పైఅధికారులతో కస్సుబస్సులాడడం.. అస్సలు సరికాదు. పైగా ఇలాంటి మీ ప్రవర్తన వల్ల మీ కెరీర్‌కే మచ్చ రావచ్చు. అందుకే కాస్త ఓపిక వహించి మీరు చేసిన పనికి సంబంధించి ఎప్పటికప్పుడు పొందుపరిచిన రిపోర్టులు, ఉత్పాదకతకు సంబంధించిన రుజువుల్ని మీ పైఅధికారులకు సమర్పించండి. మీ ప్రొఫెషనలిజాన్ని, మీ ప్రవర్తనను, మీ పనితనాన్ని బట్టి తప్పకుండా మీకు శాలరీ హైక్ లేదా ప్రమోషన్.. వంటివి అందించే అవకాశాలుంటాయి.
వ్యక్తిగత సమస్యలు వద్దు
కొంతమంది తమ కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించడానికి, ఆర్థిక అవసరాలకు వచ్చే జీతం సరిపోకపోవచ్చు. ఇలాంటప్పుడు జీతం పెంచమని అడిగేటపుడు ఈ విషయాలను అధికారుల వద్ద ప్రస్తావించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల వారికి మీపై నెగెటివ్ అభిప్రాయం ఏర్పడచ్చు. అంతేకాదు.. మీరున్నది సమస్యల్లోనే అయినా.. వీటినే ఎరగా వేసి పదోన్నతి కొట్టేయాలని, జీతం పెంచుకోవాలని మీరు చూస్తున్నట్లుగా వాళ్లు భావించే అవకాశమూ లేకపోలేదు. దీని ప్రభావం అంతింగా పడేది మీ కెరీర్‌పైనే. కాబట్టి వృత్తిపరమైన జీవితంలోకి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను లాగక పోవడమే మంచిదంటున్నారు నిపుణులు.
నిరాశ పడకుండా...
జీతం పెంపు, పదోన్నతుల గురించి అర్జీ పెట్టుకునే ముందు సంస్థ నియమనిబంధనల్ని కూడా పరిగణనలోకి తీసుకోవా లంటున్నారు నిపుణులు. అంటే.. మీరు పనిచేసే సంస్థలో ఎన్నేళ్లకోసారి శాలరీ హైక్, పదోన్నతులు కల్పిస్తున్నారు వంటివి తెలుసుకోవడం ముఖ్యం. ఒక్కోసారి మీ పనితనం బాగున్నా, మీరు పైఅధికారుల అంచనాల్ని అందుకున్నా.. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అలాంటప్పుడు నిరాశ పడకుండా మీ పనిలో నాణ్యతను తగ్గించుకుండా ముందుకు సాగితే మరోసారి తప్పకుండా ఇంతకంటే విలువైన ఫలితం పొంద గలుగుతారు.