Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జయలక్ష్మి రంజిత్... కేరళకు చెందిన ఈ వ్యాపారవేత్త మహిళలకు అనుకూలమైన దుస్తులను డిజైన్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ ప్రపంచంలో విభిన్నమైన మార్పులు తీసుకొస్తుంది. మహిళలకు వీలుగా వుండేలా పాకెట్స్ ఏర్పాటు చేసి మార్కెట్లోకి తీసుకు వస్తుంది. అసలు ఈ ఆలోచన ఆమెకు ఎలా వచ్చిందో తెలుసుకుందాం...
శతాబ్దాలుగా మగవారి దుస్తులు ఫంక్షనల్‌గా రూపొందించబడ్డాయి. వారు ధరించే దుస్తులకు ప్రత్యేకంగా పాకెట్స్ ఉంటాయి. కానీ మహిళల దుస్తుల విషయానికి వస్తే డిజైనింగ్‌లో తేడాలు ఉంటాయి. పాకెట్స్ చరిత్ర 17వ శతాబ్దానికి చెందినది. అండర్గార్మెంట్లలో వాటిని ''టై-ఆన్''గా చేర్చారు. 20వ శతాబ్దంలో పని చేసే మహిళలు ప్యాంట్లను వాడడం ప్రారంభించడంతో ఫ్యాషన్ ప్రపంచంలో సన్నగా ఉన్న మహిళల కోసమే కొన్ని దుస్తులు తయారుచేయబడ్డాయి. అయితే కేరళలోని త్రిచూర్‌కు చెందిన జయలక్ష్మి రంజిత్ తన ఆలోచనతో మహిళలు ధరించే ప్యాంట్లకు పాకెట్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
లాక్డౌన్ సమయంలో
వ్యవసాయ ఇంజనీర్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్ అయినటువంటి జయలక్ష్మి 2020 ఫిబ్రవరిలో విశ్రాంతి తీసుకోవడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. అప్పుడు కోవిడ్ -19 వ్యాప్తి, లాక్డౌన్ కారణంతో పాకెట్స్ 13ను ప్రారంభించడానికి ఆమెకు అవకాశం దొరికింది. మహిళలకు అనుకూలంగా ఉండే దుస్తులను రూపొందించడంలో ప్రత్యేకత కలిగిన ఇన్స్టాగ్రామ్ ఆధారంగా ''ఫంక్షనల్ పాకెట్స్'' అనే చిన్న వ్యాపారం ప్రారంభించారు. ఇక్కడ ఆమె 'ఫంక్షనల్' అనే పదాన్ని నొక్కిచెప్తూ ''మహిళలు ధరించే దుస్తులకు పెట్టే పాకెట్స్ చాలా కాలం నుండి సనాతన ధర్మాలకు కట్టుబడి ఉన్నాయి'' అంటున్నారు ఆమె.
అలవాటు లేక...
మహిళల కోసం రూపొందించిన జీన్స్, ప్యాంట్లను జయలక్ష్మి స్వయంగా రూపొందిస్తున్నారు. ''నేను మగవారు ధరించే జీన్స్‌నే ఒకటి నాకు సరిపోయే దాన్ని కొనుగోలు చేశాను. దానిని ధరించి నా ఫోన్‌ను వెనుక జేబులో పెట్టుకుంటే అది పూర్తిగా జారిపోయింది. ఎందుకంటే అలా వెనక జేబులో ఫోన్ పెట్టుకోవడం నాకు అలవాటు లేదు. మహిళల దుస్తులకు ఫంక్షనల్ పాకెట్స్ ఉండకూడదు అని ఎక్కడ రాసి లేదు. అప్పటి వరకు ఉన్న ఫాక్స్ పాకెట్స్ నాణేలను ఉంచడానికి మాత్రమే సరిపోతాయి. ఇలాంటివి మహిళలకు సరిపోవు'' అని ఆమె అంటున్నారు.
అమ్మను చాలా బాధించేది
జయలక్ష్మి ఎప్పుడూ తన బట్టలలో తనకు ఏమి అవసరమో దాని గురించే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తన తల్లి చిరాకు పడినప్పటికీ దర్జీకి ప్రతిదీ వివరంగా చెప్పేలా చూసుకుంటుంది. ''నాకు ఆరేడు సంవత్సరాల వయసు నుండి నేను ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉండే బట్టలనే అడిగేదాన్ని. దానికి చాలా సమయం పట్టేది. అది మా అమ్మను చాలా బాధించేది. కొంతకాలంగా నా టైలర్ ఆంటీతో సాన్నిహిత్యం పెంచుకున్నాను. నేను అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడల్లా ఆమెకు ఎన్నో విషయాలు చర్చించేదాన్ని. నాకు కోసం ఆమె అదనపు సమయాన్ని కేటాయిస్తున్నట్టు ఆమె చెప్పేది'' అంటున్నారు జయలక్ష్మి.
పాకెట్స్పైనే దృష్టి
జయలక్ష్మి ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం కోసం నగరాలను వెళ్ళారు. అలా వెళ్ళినపుడు ఇతర టైలర్లకు ఎన్నో సూచనలు ఇచ్చేది. అయితే పాకెట్స్‌పై దష్టి పెట్టి ఆమె సొంతంగా బట్టలు డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమె స్నేహితులు, సహౌద్యోగులు దీన్ని గమనించి వారి కోసం కూడా ఇలాంటి దుస్తులను డిజైన్ చేయమని అడిగేవారు. మహమ్మారి ప్రారంభ రోజుల్లో ఆమెకు తగినంత సమయం ఉండటంతో జూన్ 13, 2020న పాకెట్స్13ని కొన్ని మూలాధారమైన ఫ్యాబ్రిక్‌లతో ప్రారంభించింది.
అన్ని పరిమాణాలు ప్రామాణికమైనవే
ఆమె ఇప్పటివరకు చేసిన పొదుపు డబ్బులతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. తాను రూపొందించే బ్రాండ్ ముఖ్య దష్టి మహిళల సౌకర్యం, ఎంపిక. జేబులో ఉన్న దుస్తులు కూడా చిన్న, మధ్యస్థ లేదా పెద్ద వంటి ప్రామాణిక పరిమాణ లేబుల్లు లేకుండా తయారు చేసేవారు. ఇలా ప్రతిదీ మహిళలకు అనుకూలంగా ఉండేలా చూసేవారు. ''కొన్ని డిజైన్లు అందంగా కనిపిస్తున్నాయని. అయితే ఎక్స్ఎల్ లేదా ఎక్స్ఎస్ వంటి డిజైన్లు దొరకడం లేదని స్నేహితులు, సహచరులు చెప్పడం నేను స్వయంగా విన్నాను. ఓ మహిళగా ఇది నన్ను చాలా బాధ పెట్టింది. నిర్దిష్ట డిజైన్లలో సౌకర్యంగా ఉంటున్నప్పుడు ఈ పురుషాధిక్య ఫ్యాషన్ ప్రపంచం మహిళలకు ఆ ఎంపిక ఎందుకు ఇవ్వబడలేదు'' అంటుంది ఆమె.
మనకు కావల్సిన విధంగా...
మేము స్థానిక టైలర్‌తో పని చేయడం ద్వారా కస్టమర్లు డిజైన్ టెంప్లేట్ల నుండి ఎంచుకోవచ్చు. వారికి అవసరమైన, అనుకూలమైన డిజైన్లు అడగవచ్చు. బస్ట్, హిప్, పొడవు వంటి ప్రాథమిక కొలతను పంపవచ్చు. వీలైతే నమూనా చిత్రాన్ని పంపవచ్చు. దర్జీ పనిని ప్రారంభించి ఆర్డర్‌ను రెండు మూడు వారాల్లో డెలివరీ చేస్తాడు. ''వారు ఏ పరిమాణంలో ధరిస్తారు అని మేము వారిని అడగము. నాకు ఒక టైలర్ ఉన్నాడు. అతను నా దుస్తులలో నాకు కావలసిన విధంగా తయారు చేసి ఇస్తాడు'' అంటుంది జయలక్ష్మి. ఆమె బ్రాండ్ కాటన్ ఫాబ్రిక్ను మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ ప్యాకేజింగ్ పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.
ముందుకు వెళ్లే మార్గం
కేవలం ప్రారంభించిన ఒక్క సంవత్సరంలోనే జయలక్ష్మి తన కన్సల్టెన్సీ పనితో పాటు వెంచర్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. స్టాటిస్టా ప్రకారం 2018లో మహిళల ఫ్యాషన్ నుండి దేశీయ మార్కెట్ విక్రయాలు రూ. 1,313 బిలియన్లకు పైగా ఉన్న ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద మహిళల దుస్తుల మార్కెట్ భారతదేశం. పాకెట్స్ 13 వివిధ ప్రపంచ, దేశీయ వాణిజ్య బ్రాండ్లకు ప్రత్యామ్నాయంగా మార్కెట్‌ను రంగంలోకి దింపుతోంది. మహిళల జేబుల విషయానికి వస్తే ఫ్యాషన్ పరిశ్రమ నియమావళికి అనుగుణంగా కొనసాగుతుంది. మహిళలు ఫంక్షనల్ పాకెట్స్‌ను రూపొందించే కమ్యూనిటీని నిర్మించడంలో కూడా ఇది సహాయపడింది. సోషల్ మీడియా మార్కెటర్, అకౌంటెంట్, డిజైన్లపై పని చేసే ఏకైక మహిళా సైన్యం వలె ఇది పని చేస్తుంది. అయితే దీనికి లాజిస్టిక్స్ పరిమితులు ఒక సవాలుగా ఉన్నాయి. వినియోగదారులతో మాట్లాడేటపుడు పారదర్శకత కీలకమని ఆమె చెబుతున్నారు.
''మీరు ఈరోజు బయటికి వెళ్లాలంటే మీకు కావలసిందల్లా ఫోన్. అలాగే కార్డ్. వీటిని పెట్టుకోవడానికి మీకు పాకెట్స్ ఉంటే హ్యాండ్స్-ఫ్రీగా వెళ్లే అవకాశం ఉంటుంది. మా లక్ష్యం కూడా ఇదే'' అంటున్నారు జయలక్ష్మి. తన వ్యాపారం ముందుకు సాగుతున్న కొద్ది మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేలా ఆమె ప్రయత్నిస్తున్నారు.