Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా మందికి గర్భధారణ సమయంలో జుట్టు విపరీతంగా రాలిపోతూ ఉంటుంది. హర్మోన్ల స్థాయిలో తీవ్రంగా ఒడిదొడుకుల కారణంగా ఇలా జరుగుతుంది. గర్భిణుల్లో ప్రోజెస్టిరాన్ హార్మోన్ అధికస్థాయిలో ఉంటుంది. ఈస్ట్రోజెన్ స్థాయి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా జుట్టు విపరీతంగా రాలుతుంది. శిశువు జననం తర్వాత జుట్టు రాలడం తగ్గి కొత్త జుట్టు రావడం ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా ప్రసవం తర్వాత మూడు నుంచి ఆరు నెలల తర్వాత జరుగుతుంది. అనంతరం జుట్టు మళ్లీ మూమూలుగా మారిపోతుంది. కొంత మంది గర్భిణుల్లో మచ్చలు, పిగ్మేంటేషన్, స్ట్రెచ్ మార్క్స్, కండ్లు ఉబ్బడం, కండ్ల కింద నల్లమచ్చల వంటివి ఏర్పడతాయి. హర్మోన్ మార్పుల కారణంగా జుట్టు పొడి బారుతుంది, చిక్కులు ఏర్పడతాయి. సాధారణంతో పోల్చితే గర్భధారణలో జుట్టు రాలడం రెట్టింపు ఉంటుంది. జుట్టు కుదుళ్లు బలంగా లేకపోతే కండిషనర్ వాడకాన్ని బాగా తగ్గించాలి. పైన జల్లే స్ప్రేలను కూడా దూరం పెట్టాలి. కండిషనర్ పెట్టిన తర్వాత జుట్టును చల్లని నీటితో కడగాలి.
- జుట్టు బాగా లాగి ముడివేయకండి. అలా చేయడం వల్ల తలపై, జుట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. అలా గట్టిగా లాగడం వలన వెంట్రుకలు సులభంగా ఊడివస్తాయి.
- మీ ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు సమద్ధిగా ఉండేలా చూసుకోవాలి. స్ట్రాబెర్రీ, యాపిల్స్, రాజ్మా, వంటివి తీసుకోవాలి. జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు.
ప్రసవానంతరం తిరిగి మీ శరీరం శక్తి నింపుకునేందుకు కొన్ని సప్లిమెంట్లు అవసరం. మీ శిరోజా సౌందర్యం కోసం విటమిన్ బి, విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకోవాలి.
- జుట్టుకు కలరింగ్, స్ట్రెయిటెనింగ్, పెర్మింగ్ వంటివి చేయకూడదు. వీటి వలన జుట్టు రాలవచ్చు. అంతే కాదు ఈ ట్రీట్మెంట్కు మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఏదైనా ప్రత్యేక సందర్భానికి ఎప్పుడైనా ఒకసారి బాగుంటుంది కానీ, సాధారణ పరిస్థితుల్లో వీటిని దూరం పెట్టడం ఉత్తమం.