Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొబ్బరితో ఏది చేసినా ఆ రుచే వేరు. కొబ్బరిని కూరల్లో వేసుకోవచ్చు. దీంతో ఎన్నో రకాల పచ్చళ్లు, స్వీట్స్ చేసుకోవచ్చు. కొబ్బరి పిల్లలకు పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. కాకపోతే ఏదైనా మితం గానే తినాలి. సరే కొబ్బరితో చేసే కొన్ని వెరైటీ వంటకాల గురించి తెలుసుకుందాం...
కొబ్బరి, మామిడి కాయ పచ్చడి
కావలసిన పదార్ధాలు: చిన్న కొబ్బరి చిప్ప -ఒకటి లేదా ఒక చిన్న గిన్నెడు తురిమిన కొబ్బరి, మామిడికాయ ముక్కలు - ఆరు, ఉప్పు, పసుపు, కారం -తగినంత, వెల్లుల్లి రెబ్బలు - రెండు, పోపు దినుసులు, నూనె, ఇంగువ, కరివేపాకు.
తయారు చేయు విధానం: కొబ్బరి తురుము, మామిడి కాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి రోట్లో మెత్తగా దంచుకోవాలి. తర్వాత దాంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి మరొకసారి బాగా దంచుకుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులోకి పోపు వేయాలి. కరివేపాకు ఇంగువ తప్పని సరిగా వేయాలి. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బావుంటుంది. మామిడికాయ ముక్కలు కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని ఉండవు. అందుకని పులువు చూసి వేసుకుంటే మంచిది.
కొబ్బరి అన్నం
కావాల్సిన పదార్ధాలు: అన్నం - మీడియం సైజ్ గిన్నెడు, కొబ్బరి తురుము - ఒక చిన్న గిన్నెడు. పచ్చిమిర్చి - నాలుగు, పల్లీలు - గుప్పెడు, నిమ్మరసం - స్పూను, కరివేపాకు, ఇంగువ, నూనె, పోపు దినుసులు, కొత్తిమీర, ఉప్పు.
తయారు చేయు విధానం: ముందుగా ఒక బాండీలో కొంచం నూనె పోసి కొబ్బరిని కొంచం వేయించాలి(రంగు మారకూడదు). తర్వాత ఒక బేసినలోకి అన్నం తీసుకుని అందులో వేయించిన కొబ్బరి, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ఇంకో బాండీలో నూనె పోసి అందులో పోపు దినుసులు, పల్లిలు వేసి గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేయాలి. ఇంగువ, కరివేపాకు కూడా వేసి కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేయాలి. ఒక సారి గరిటతో బాగా కలిపి కొంచం చల్లారిన తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసుకుని మరొక్క సారి బాగా కలియ పెట్టి వడ్డించుకోవడమే. ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఉదయం అల్పాహారంగా కానీ, సాయంత్రం స్నాక్ లాగా కానీ తినవచ్చు.
కొబ్బరి, పచ్చి టొమాటో పచ్చడి
కావలసిన పదార్ధాలు: పచ్చి టొమాటోలు - నాలుగు, కొబ్బరి కోరు - ఒక చిన్న కప్పు, పచ్చి మిర్చి - ఆరు, పుదీనా - గుప్పెడు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, ఉప్పు, పసుపు, నూనె, పోపుదినుసులు, ఇంగువ.
తయారు చేయు విధానం: ముందుగా ఒక బాండీలో నాలుగు స్పూన్ల నూనె పోసి అది వేడెక్కక అందులో టొమాటో ముక్కలుగా తరిగి వేయాలి. వాటితో పాటు పచ్చిమిచ్చి, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మగ్గనివ్వాలి. చల్లారాక మిక్సీలో ఇవన్నీ వేసి వీటితో పాటు కొబ్బరి, పసుపు, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు ఇంగువ వేసి పెట్టాలి. అన్నంలోకి, చపాతీలోకి చాలా బావుంటుంది.
కొబ్బరి, బియ్యపు రవ్వ పులిహౌర
కావలసిన పదార్ధాలు: బియ్యపు రవ్వ - కప్పు, కొబ్బరి తురుము - ముప్పావు కప్పు, నిమ్మకాయ రసం - తగినంత, పచ్చిమిర్చి - నాలుగు, ఉప్పు, పసుపు, నూనె, పోపుదినుసులు, పల్లీలు, కరివేపాకు.
తయారు చేయువిధానం: ముందుగా ఒక గ్లాసు రవ్వకు రెండు గ్లాసుల నీళ్ల కొలతతో ఉప్మాలగా చేసుకోవాలి. తర్వాత ఒక బేసినలోకి వేసి చల్లార నివ్వాలి. కొబ్బరిని కొంచం నూనె వేసి రంగు మారకుండా వేయించాలి. ఇది కూడా రవ్వ ఉప్మాలో వేసి కలిపి చల్లారనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. బాండీలో కొంచం ఎక్కువగా వేసి పల్లిలు, పోపు దినుసులు వేయించాలి. ఇంగువ పచ్చి మిర్చి, కరివేపాకు వేయాలి.ఈ పోపు చల్లారే లోపు రుచికి తగినంత నిమ్మకాయ రసం పిండుకోవాలి. పోపుచల్లారక ఈ మిశ్రమంలో వేసి బాగా కలియబెట్టాలి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది.