Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికాలో కరోనా మూడవ డోస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. భారత్‌లో రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేయడానికి ఇంటింటికీ తిరిగి సర్వే చేసి మరీ వ్యాక్సిన్ వేస్తున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోక పోతే బియ్యం, రేషన్ వంటివి ఇవ్వము అని ప్రభుత్వం చెబుతుండడంతో అందరూ వ్యాక్సిన్ల వైపు పరుగులు తీస్తున్నారు. మా చిన్నప్పుడు కాలేజీలో సీటు కోసం అప్లికేషన్ పెట్టుకుంటే వ్యాక్సిన్ వేయించుకుని వస్తే గానీ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వము అనేవాళ్ళు. మేము కాలేజీలో చేరడానికి వ్యాక్సిన్ వేయించుకునేవాళ్ళం. అదే విధంగా టెన్త్ క్లాసులో ఉన్నపుడు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాకే మార్కులిస్ట్ ఇస్తామని పేచీ పెట్టారు. అప్పట్లో అలాగే వ్యాక్సిన్లు వేయించుకున్నాం. ఇప్పటికీ కరోనా ముప్పు తొలగిపోయినట్టు కాదనీ, నివురుగప్పిన నిప్పులా కాచుకుని కూర్చుందనీ నిపుణులు చెబుతూనే ఉన్నారు. సాధారణ ప్రజలేమో రెండేళ్ళకు దొరికిన అవకాశమని జైల్లోంచి బయటపడ్డ ఖైదీల్లా, స్వేచ్ఛగా ఎగిరే పావురాల్లా బయట తిరుగుతున్నారు. మనం జాగ్రత్తలు తీసుకోవటం మరిచిపోవద్దు. మాస్క్‌ను ధరించటం అతి ముఖ్యం. ఖాళీ సమయాన్ని కళాత్మకంగా గడుపుదాం.
చిక్కుడు గింజలతో...
ఎండిపోయిన చిక్కుడు గింజలతో నేనీమధ్య బొమ్మలు చేస్తున్నాను. తెల్లని కుందేలును నేను ఎండిన చిక్కుళ్ళతో చేశాను. నల్లటి కుందేలు తయారయింది. మేము కొన్ని రోజులు కుందేళ్ళను తెచ్చి పెంచుకున్నాము. మాకున్న ఖాళీ స్థలంలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు తోట పెట్టడంతో ఐదారు కుందేళ్ళను తెచ్చి పెంచుకున్నాం. ఆ తోటలో కుందేళ్ళను వదిలి పెట్టి మా పిల్లలు వాటి వెనక తిరిగేవాళ్ళు. కుందేళ్ళు ఎప్పటికీ దొరికేవి కావు. వాటి వెనక పరిగెత్తి పిల్లలు అలసిపోవడం తప్ప. ఈ కుందేళ్ళ కోసం ఒక కేజ్ లాగా చేయించాం. చెక్క పెట్టి లాంటిది తయారు చేసి దానికి గాలి ఆడేలా గ్రిల్స్ పెట్టించాము. రోజూ ఆకుకూరలు, క్యారెట్లు తెగ తినేవి. ఆ తర్వాత ఆ కుందేళ్ళు పిల్లల్ని కనలేక చనిపోయాయి. అప్పుడు కుందేళ్ళు చనిపోయాయని బాధపడ్డాం. ఇప్పుడు అలాంటి బాధ పడకూడదని చిక్కుడు గింజలతో, ఆకుకూరలతో, కూరగాయలతో, పిస్తాపొట్టుతో అలచందలతో, ఇంజక్షన్ మూతలతో కుందేళ్ళను తయారు చేస్తున్నాను. ఇవి ఇప్పుడూ మన కండ్ల ముందే ఉంటాయి. ప్రాణాలు పోతాయనే భయం లేదు. అందుకే చక్కని కుందేళ్ళను తయారు చేసుకుంటున్నాం. ఈ కుందేళ్ళన్నీ గోడల మీదికెక్కి అతిధులందరికీ కనువిందు చేస్తున్నాయి. వీటిని చిక్కుడు గింజలతో చేయడం ఎంతో అందంగా వచ్చింది. ఈ కుందేలు క్యారెట్టు కూడా తింటున్నది. చిక్కుడు కాయల్లో గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, సోయా చిక్కుడు, నిలబడి కాసే చిక్కుడు రకరకాలున్నాయి. వీటి పువ్వులు మల్లె పువ్వులంత తెల్లగా, చిలక ముక్కు పువ్వుల్లా వంపు తిరిగి ఉంటాయి. చిక్కుళ్ళు ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్కలు.
అలచందల విత్తనాలతో...
అలచందల్ని బొబ్బర్లు, అలసందలు అని కూడా అంటారు. ఇవి కూడా చిక్కుళ్ళ వలె తీగ మాదిరి గానూ, చెట్టు వలె నిలబడి కాసేదిగానూ ఉంటుంది. ఇది కూడా చిక్కుడు వలె ఫ్యాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ''విగ్నా అంగిక్యులేటా'' అంటారు. పచ్చిరొట్ట ఎరువు కోసం అలచందల్ని ఎక్కువగా పండిస్తారు. రోజువారీ వంటకాలలో గుగ్గిళ్ళు, వడలు తయారు చేసుకుంటారు. ఈ గింజల్లో మాంసకృత్తులు అధికంగా ఉండటం వలన డైటింగ్ చేయాలనుకున్నవాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకోవచ్చు. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవనాలు వీటిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చెట్టు అలచందను ఎక్కువడా పండిస్తున్నారు. పూర్వపు రోజుల్లో తీగ అలచందల్ని ఎక్కువగా పండించేవారు. ఒక్కొక్కకాయ జాన పొడవు ఉండి పది నుంచి ఇరవై గింజల దాకా ఉంటాయి. నేను మామూలు ఎర్రరంగులో ఉండే అలచందలతో కాకుండా నల్లగా నిగనిగ మెరిసే 'లోబియా' అనే అలచందలతో ఈ కుందేలు చేశాను. కుందేళ్ళు పాలిచ్చి పెంచే జీవులు. ఈ కుందేళ్ళు 'లెపోరిడే' కుటుంబానికి చెందిన జీవులు. మన జానపద కథల్లో ఉపాయంతో ప్రమాదాలు తప్పించుకునే జీవులుగా అభివర్ణించారు. సింహం కుందేలు కథలో సింహాన్ని బావిలో దూకేలా చేస్తుంది. అతి వేగంగా పరిగెత్తే జీవి. ఇంత వేగంగా పరిగెత్తే కుందేలు కూడా తాబేలుతో పందెం వేసుకొని అతి ధీమాతో ఓడిపోతుంది. కుందేలు గురించిన కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి.
ఆలుగడ్డలతో...
వీటిని బంగాళా దుంపలు, వుర్లగడ్డలు అని కూడా అంటారు. రెండు ఆలూగడ్డల్ని ఉండకబెట్టి తోలు తీసి కూర వండుకోవాలని అనుకున్నాను. తెల్లగా ఉన్న ఆలుగడ్డల్ని చూశాక కుందేలు చెయ్యాలనిపించింది. వెంటనే సంత్రా తొనలతో చెవులు, బొప్పాయి కాయ విత్తనాలతో కళ్ళు, కుంకుమ పూసిన తొక్కతో నోరు అమర్చాను. చందమామలో కుందేలు పిల్ల ఉంటుందంటారు. కొరియా, జపాన్ దేశాల జానపద గాధల్లో కుందేలు చందమామ మీద ఉంటుందనీ, అది బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుందని నమ్ముతారు. కుందేళ్ళను ప్రత్యుత్పత్తికి చిహ్నంగా భావిస్తారు. తెలుగు జానపద కథల్లో కుందేళ్ళను అమాయకంగానూ, జాలి పుట్టించే పాత్రలు గానూ చిత్రించారు. మగ కుందేళ్ళను 'బక్స్' అనీ, ఆడకుందేళ్ళను 'డోస్' అనీ అంటారు. పిల్ల కుందేలును 'బన్నీ' అని అంటారు. మిడిల్ ఇంగ్లీష్ వారి రెబెట్ అన్న పదం నుంచీ 'రాబిట్' అన్న పదం పుట్టింది. కుందేళ్ళ సమూహాన్ని 'కాలనీ' లేదా 'నెస్ట్' అని పిలుస్తారు. కుందేళ్ళు పెంపుడు జంతువులుగా మానవులతో సన్నిహితంగా ఉంటాయి.
ఆకులతో...
పారిజాతం చెట్టు ఆకులు, కాగితం పూల చెట్టు ఆకులు ఉపయోగించి కుందేలును తయారు చేశాను. తెల్లని కుందేలును కాస్తా నేను హరిత కుందేలుగా మార్చాను. పారిజాతం పూల నుంచి సుగంధ తైలాల్ని తీస్తారు. పారిజాతం ఆకుల నుంచి తయారైన తేనీరును జలుబు, దగ్గులకు మందుగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు. కీళ్ళ నొప్పులకు కూడా పారిజాతం ఆకులను ఉపయోగిస్తారు. ఇంకా ఇందులో తిప్పతీగ ఆకుల్ని కూడా వాడాను. తిప్పతీగను 'అమృతవల్లి' అంటారు. ఎర్రటి పండ్లు, గుండె ఆకారపు ఆకులు కలిగిన తీగజాతి మొక్క. దీని శాస్త్రీయనామం ''టీనోస్పారా కార్డిఫోలియా''. దీనిని ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకారి మొక్కగా చెబుతారు.
పిప్తాపొట్టుతో
పిస్తా, బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండ టానికి, అధిక ప్రోటీన్ల కొరకు తింటుంటారు. శరీరానికి అత్యధిక పోషకాలను అందిస్తాయి. మరి కుందేళ్ళకు కూడా పోషకాలు కావాలి కదా! అందుకే పిస్తా పొట్టుతో కుందేలును చేశాను. కుందేళ్ళు చలాకీగా తిరిగే జంతువులు. కళ్ళు ఎప్పుడూ మెరుస్తూ ఏ విధమైన స్రావాలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన మెరిసే బొచ్చు ఉంటుంది. నేల మీద బొరియలు తవ్వుకొని జీవిస్తాయి. ఎడారుల్లోనూ, చిత్తడి నేలల్లోనూ కూడా జీవితం గడుపుతాయి. గడ్డిని, కాయ గింజల్ని తినే శాకాహార జంతువులు. కొన్ని దేశాలలో మాంసం కోసమే కుందేళ్ళను పెంచుతారు. కుందేళ్ళకు ఆకలి ఎక్కువ ఉండటం వల్ల ఎన్నో పంటలు నాశనమవుతున్నాయి. సంతానోత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల వ్యవసాయానికి ముప్పు కలుగుతున్నది.