Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శారీరకంగా చురుకుగా ఉండేవారితో పోలిస్తే రోజులో చాలాసేపు కదలకుండా కూచునే వారికి గుండె జబ్బుల ముప్పు రెండింతలు అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- కుర్చీలో ఎక్కవసేపు కూర్చుని ఉండటం వల్ల వెనక ఉండే వీపు కండరాలు చాలా బిగుతుగా మనల్ని పట్టి ఉంచుతాయి. కడుపు కండరాలు సడలిపోవటం, వీపు కండరాలు బిగుతు కావటం.. దీనివల్ల వెన్నెముక బాగా ముందుకు వంగిపోతోంది. చివరకు వెన్నుముక సమస్యలకు దారితీస్తుంది. రోజంతా కూర్చుని ఉండే వారిలో తుంటి ఎముక బాగం బిగుతుతనం కోల్పోయి నడిచే సమయంలో పటుత్వం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
- నిల్చోవడం, నడవడంతో పోల్చితే కూర్చోవడం వల్ల చాలా తక్కువ శక్తి ఖర్చవుతుంది. దీనివల్ల ఊబకాయం రావటం, రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోవడం, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, కొలెస్ట్రాల్ స్థాయిల్లో అసమతుల్యత ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సుదీర్ఘకాలం కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.
- ఎప్పుడూ కూర్చుని ఉండటం వల్ల కదలికలు లేక ఎముక పటుత్వమూ తగ్గుతుంది. సాధారణంగా నడక, పరుగు వంటి బరువు మోసే పనులు చేస్తున్న కొద్దీ తుంటి ఎముక, కాళ్లల్లోని ఎముకలు బలిష్టంగా తయారై, వాటి సాంద్రత పెరుగుతుంది. కూర్చుని ఉంటే మాత్రం ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.
- శారీరక శ్రమ లేకపోవటం వల్ల ఇటీవలి కాలంలో ఎముక క్షీణత సమస్య పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసేపు కదలకుండా కూచునేవారికి నడుము దగ్గరి పూసల మధ్య డిస్కులు బయటకు తోసుకుచ్చే ముప్పు ఏర్పడుతుంది. అటు ఇటు కదులుతున్నప్పుడు మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. మెదడును ఉత్సాహపరిచే, మానసిక స్థితిని మెరుగుపరచే రసాయనాలు విడుదలవుతాయి.
- దీర్ఘకాలం పాటు శారీరక శ్రమలేకుండా కూర్చునే వారిలో ఇలాంటివన్నీ మందగిస్తాయి. దీంతో మెదడు పనితీరు కూడా క్రమేపీ నెమ్మదిస్తుంది. మెడబాగంపై వత్తిడి సైతం పెరిగే అవకాశాలు అధికం. నిత్యం కూర్చునే ఉండేవారిపై క్యాన్సర్లూ దాడి చేస్తాయి. ముఖ్యంగా వీరికి పెద్దపేగు, రొమ్ము, ఎండోమెట్రియం క్యాన్సర్ల ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు కూచున్నప్పుడు ఒంట్లో ఇన్సులిన్ స్థాయులు పెరగటం, అది కణాల వృద్ధిని ప్రోత్సహిస్తుండటం.. ఇవన్నీ క్యాన్సర్కు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- కంప్యూటర్ ముందు కూర్చుని గంటలతరబడి పనిచేయటం లేదా గంటలకొద్దీ డ్రైవ్ చేయడం వంటిని దీర్ఘకాలంలో ప్రాణాంతకమైన వ్యాధులకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా కదలకుండా కూర్చోవడానికి, అనారోగ్య సమస్యలకు మధ్య సంబంధం ఉందని పరిశోధనలు కూడా తేల్చాయి.