Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదు దశాబ్దాలకు పైగా ఆల్ ఇండియా అగర్బతి మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ గ్రామీణ భారతదేశం అంతటా చదువులేని మహిళలకు ఉపాధిని కల్పిస్తోంది. దీని ద్వారా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం మూడు లక్షలు. గ్రామీణ, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళలు అగర్బతీలు తయారు చేస్తూ ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందుతున్నారో తెలుసుకుందాం...
మైసూరులోని సాతనూర్ అనే గ్రామానికి చెందిన 30 ఏండ్ల శృతి మహాదేవ్ పచ్చి అగర్బత్తీలను తయారు చేస్తూ తన ఆరుగురు కుటుంబ సభ్యులను పోషిస్తున్నారు. ''ఇంతకుముందు నేను అగర్బాతీలను స్థానిక వ్యాపారులకు సరఫరా చేసేదాన్ని. అయితే వారు సరైన సమయానికి డబ్బులు ఇచ్చేవారు కాదు. దాంతో మాకు సమీపంలో ఉండే కొన్ని నగరాల్లో అగర్బాతీలు కొనేవారు ఎవరున్నారో తెలుసుకున్నాను. వారికి నా నమూనాలను చూపించి నా వ్యాపారాన్ని విస్తృతపరుచుకున్నాను'' అని ఆమె చెబుతున్నారు.
కుటుంబంతో పాటు...
శృతి గత రెండేండ్లుగా వెండర్‌గా పనిచేస్తూ ప్రతి నెల దాదాపు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు సంపాదిస్తోంది. ఆమె రోజు ఉదయం ఐదు గంటలకు ప్రారంభిస్తుంది. గుండెపోటుతో బాధపడుతున్న తన భర్త, అత్తయ్య, ఇద్దరు పిల్లలు, వికలాంగులైన మేకోడలి అవసరాలతో సహా ఇంటి పనిని చూసుకుంటుంది. ఉదయం 8 గంటలకు తన ఇంటికి దగ్గరగా ఉన్న యూనిట్లో పని ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. కొన్ని సంవత్సరాల కిందట భర్తకు వచ్చిన స్ట్రోక్ అతన్ని కదలకుండా చేసింది. కుటుంబ భారం శృతిపై పడింది. ఎక్కడో దూరంగా వెళ్ళి పని చేసే అవకాశం లేదు. కుటుంబాన్ని వదిలి వెళ్ళే పరిస్థితి కాదు. అందుకే గ్రామంలోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అగర్బతి తయారు చేసి అమ్ముతుంది.
మూడు లక్షల మందిలో...
లాక్డౌన్ సమయంలో కార్మికులు పనికి రాలేకపోయారు. అయితే వారు సరఫరా చేసిన అగర్బతి కంపెనీ ముడి పదార్థాలను అందించింది. దానితో శృతి తన భర్త సహాయంతో ఉత్పత్తిని నిర్వహించింది. మూడు లక్షల మంది మహిళల్లో శృతి ఒకరు. వారు మైక్రో ఎంటర్ ప్రెన్యూర్స్ గా తయారీదారులకు సరఫరా చేస్తున్నారు. లేదా ఆల్ ఇండియా అగర్బతి మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ (ఏఐఏఎమ్ఏ) తయారీ కంపెనీల వర్క్‌ఫోర్స్‌లో చేరారు.
గ్రామీణ మహిళల కోసం..
(ఏఐఏఎమ్ఏ) గ్రూప్ ప్రకారం భారతదేశంలో అగర్బతి (అగర్బతి, ధూప్) మార్కెట్ 2021 నుండి 2026 వరకు 10.1 శాతం వద్ద పెరుగుతుందని అంచనా వేయబడింది. సంవత్సరాలుగా ఎగుమతి డిమాండ్ కూడా పెరిగింది. కేవలం ఎగుమతుల నుండే రూ.965 కోట్ల ఆదాయాన్ని చూసింది. 1949లో అగర్బత్తీ తయారీదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికగా ఆల్ ఇండియా అగర్బతి మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ స్థాపించబడింది. నేడు సంఘం పరిధిలోని తయారీదారుల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు 80 శాతం మంది ఇందులో ఉన్నారు. ఈ సంస్థకు గత సంవత్సరం ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన అర్జున్ రంగా అగర్బతి పరిశ్రమ ఆకర్షణీయంగా ఉండకపోవచ్చని అయితే మహిళల ఉపాధికి సంబంధించినంత వరకు కచ్చితంగా స్థిరంగా ఉంటుందని చెప్పారు.
అనుభవం లేనివారికి...
తయారీదారులు, అసోసియేషన్ కలిసి తక్కువ వ్యవసాయ కార్యకలాపాలు ఉన్న ప్రాంతాలను గుర్తిస్తాయి. స్థానిక ఎన్జీఓలు, సంఘాలతో కలిసి విద్య లేని, నైపుణ్యం లేని మహిళలను ఉత్పత్తిని తయారు చేయడంలో శిక్షణ ఇస్తాయి. ''మా వద్ద పని చేసేవారికి గతంలో ఎలాంటి అనుభవం గానీ, నైపుణ్యాలు గానీ లేవు. మేమే వారికి శిక్షణ ఇస్తాము. వెయ్యి మంది మహిళలకు శిక్షణ ఇస్తే దాదాపు 100 మంది తయారీదారులతో పని చేస్తారు. వారి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి అవసరమైనప్పుడు వారికి ముడి పదార్థాలు ఇచ్చి సహకరిస్తారు'' అంటూ అర్జున్ దశాబ్దాలుగా అమలు చేస్తున్న విధానాన్ని వివరించారు.
పిల్లలకూ చేయూత
1990వ దశకం వరకు ఈ శిక్షణ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకే పరిమితం కాగా ఇప్పుడు క్రమంగా దేశమంతటా విస్తరించింది. అయితే పరిశ్రమ ఎక్కువగా సహజ ముడి పదార్థాలు, కలప లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ''చాలా మంది మహిళలు తమ ఇంటి పనులు పూర్తి చేసుకుని మూడు నుండి ఐదు గంటల పాటు ఇంటి నుండే అగర్బతీలు తయారు చేస్తున్నారు. కుటుంబం కోసం భర్త కష్టపడి సంపాదించే దానితో సంబంధం లేకుండా ఈ ఆదాయం మహిళలకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది'' అని అర్జున్ అంటున్నారు. సంఘం కార్మికుల పిల్లల చదువుల కోసం నిధులను సేకరించడం ద్వారా అట్టడుగు వర్గాలకు చెందిన అనేక వేల మంది మహిళలకు సహాయం చేస్తుందని. తయారీదారులు దాని సిఎస్ఆర్ కార్యకలాపాలలో భాగంగా ఈ పిల్లల ఉన్నత చదువులు, కళాశాల విద్యకు నిధులు సమకూర్చడంలో సహకరిస్తారు. దాని సభ్య సంస్థలలో కొన్ని సైకిల్ ప్యూర్ అగర్బతీలు, విజరు అగర్బత్తి, థక్రాల్ పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి.
- సలీమ
సుమారు నూట ఇరవై కిలోలు...
వర్కర్లు రాకముందే నేను యంత్రాలను ఒకసారి తనిఖీ చేసుకుంటాను. ముడి బాతి తయారీకి పౌడర్లను కలుపుతాను. వర్కర్లు వచ్చిన తర్వాత మిగిలిన పని ప్రారంభమవుతుంది. సగటున రోజులో మేము సుమారు 120 కిలోల ముడి బాతీని తయారు చేస్తాం. సాయంత్రం 7 గంటలలోపు మా యూనిట్‌ని మూసివేస్తాము.
- శృతి మహాదేవ్