Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు గొడవలకు దారితీస్తుంటాయి. భిన్న వ్యక్తిత్వాలు కూడా అందుకు కారణం కావొచ్చు. అయితే చాలామంది వాగ్వాదం జరిగిన తర్వాత కూడా పదే పదే అవే ఆలోచనలతో ఇబ్బంది పడుతుంటారు. 'నా మూడంతా పాడైపోయింది' అని బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చంటున్నారు మానసిక నిపుణులు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం...
ఎవరితో అయినా వాగ్వాదం జరిగిన తర్వాత చాలామందిలో ఆ కోపం చాలాసేపు అలానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దానిని ఇతరులపై కూడా చూపిస్తుంటారు. ఇలాంటి సమయంలో శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా తిరిగి సాధారణ స్థితికి చేరుకోవచ్చు. ప్రాణాయామం, యోగా వంటివి ఈ కోవకే చెందుతాయి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గడమే కాకుండా ఒత్తిడి కలిగించే కార్టిసాల్ హార్మోన్ తీవ్రతను తగ్గిస్తుంది. కోపం వచ్చినప్పుడు కండరాలు పట్టేస్తుంటాయి. ఈ వ్యాయామాలు చేయడం వల్ల అవి తిరిగి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.
ఊహించుకోండి...
కొంతమంది అప్పుడప్పుడు తమకు నచ్చిన ప్రదేశాలను ఊహించుకుంటారు. తాము అక్కడ ఎలా ఎంజారు చేస్తామో ఊహించుకుంటూ స్వాంతన పొందుతారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. మీరు కూడా గొడవ జరిగిన తర్వాత మీకు నచ్చిన ప్రదేశాన్ని ఊహించుకోండి. ఆ ప్రదేశం గుడి, బీచ్, జలపాతం, పార్క్.. ఏదైనా కావొచ్చు.
నచ్చిన ఆహారంతో...
ప్రయాణాలు చేసినప్పుడు శరీరానికి అలసటగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అలాగే ఏదైనా వాగ్వాదం జరిగిన తర్వాత చల్లటి నీళ్లతో స్నానం చేయండి. ఆ తర్వాత నచ్చిన వంటకంతో ఆహారం తీసుకుంటే ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది. అదే సమయంలో నచ్చిన సినిమా చూస్తే జరిగిన గొడవ సంగతి మర్చిపోయి మంచి మూడ్లోకి ఇట్టే వచ్చేస్తారు.
పక్కన పెట్టండి...
మనుషుల మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం. ఒకవేళ జరిగిన దానిలో మీరే కరెక్ట్ అని భావిస్తే అవతలి వ్యక్తి ఎక్కడ తప్పు చేస్తున్నారో ఆలోచించండి. ఈ చిన్న జీవితంలో గొడవల వల్ల సాధించేది ఏమీ ఉండదని గమనించండి. కాబట్టి, వాళ్లే ముందు మాట్లాడాలనే ఈగోని పక్కన పెట్టి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకరికొకరు తమ సమస్యల గురించి వివరంగా చెప్పుకోలేకపోవడం వల్లే ఈ ప్రపంచంలో సగం గొడవలు జరుగుతున్నాయని నిపుణులు అంటుంటారు. కాబట్టి గొడవ జరిగిన తర్వాత అవతలి వ్యక్తి వైపు నుంచి ఆలోచించి ఆ సమస్యను అక్కడితో ముగించే ప్రయత్నం చేయండి. హ్యాపీగా ఉండండి.