Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజువల్ డిజైనర్‌గా ఫ్జోర్డ్తో కలిసి పని చేస్తున్నది జయతి సిన్హా... విదేశాల్లో భారతీయ సంస్కృతిని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. తన స్వయం కృషి, సృజనాత్మకతతో యుఎస్‌లోనే ప్రముఖ డిజైనర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాషన్ రంగమంటే నోరునొక్కుకునే సమాజంలో ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ ఈ స్థాయికి చేరుకున్న ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి నేటి మానవిలో...
ఢిిల్లీకి చెందిన జయతి సిన్హాకకు తొమ్మిదేండ్ల వయసులోనే సృజనాత్మక రంగంలో అడుగుపెట్టాలనే కోరిక కలిగింది. చిన్నతనం నుండి డిస్నీ షోలు ఎక్కువగా చూస్తుండేది. అలా బార్బీ డ్రెస్‌లను డిజైన్ చేయడం పై ఆసక్తి పెంచుకుంది. అంతే కాదు వివిధ రకాల సృజనాత్మకత కళలవైపు దృష్టి పెట్టింది. ఎప్పుడూ ఏవో ప్రశ్నలు అడుగుతూ ఇంట్లో వాళ్ళకు చిరాకు పుట్టించేది. సమయం దొరికినప్పుడల్లా ఎన్నో ఆసక్తి కరమైన ప్రశ్నలు అడుగుతుండేది. ''అమ్మాయిలు ఎవ్వరూ ఇలా ప్రశ్నలు వేయారు'' అంటూ ఇంట్లో వాళ్ళు చిరాకు పడేవారు. అయినా ఆమె తన ప్రశ్నలను ఆపేది కాదు.
ఎన్విరాల్మెంట్ డిజైనర్‌గా...
జయతి ఎక్కువగా తన గదిలో ఉంటూ బొమ్మలు తయారు చేస్తూ ఉండేది. అదే చివరికి ఆమె కెరీర్‌గా మారిపోయింది. ప్రస్తుతం జయతి యుఎస్‌లోనే ప్రముఖ విజువల్ డిజైనర్లలో ఒకరిగా ఎదిగారు. 2017లో యుఎస్‌కి వెళ్లడానికి ముందు ఆమె వియా హోమ్, డిమూరో దాస్, ఆర్టెక్నికాతో సహా అనేక సంస్థలతో కలిసి పని చేసింది. అంతేకాదు ఫ్యూజ్ప్రాజెక్ట్లో ఎన్విరాన్మెంట్ డిజైనర్‌గా కూడా పనిచేసింది. ఇదే ఆమెను డిజైనింగ్‌పై దృష్టి సారించే విధంగా చేసింది. పారిశ్రామిక రూపకల్పన, వ్యూహాలు రూపొందిండంతో పాటుగా రిటైల్, ఎగ్జిబిషన్ ఏర్పాట్లలో తనకున్న అనుభవంతో మరెన్నో కొత్త పద్ధతులను సృష్టించింది.
హస్తకళాకారులతో కలిసి...
ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుండి లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జయతి అనేక ప్రాజెక్టులకు పని చేసింది. ''కాలేజీలో చదివేటపుడు ఒక క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాను. అక్కడ మేము మెటల్ క్రాఫ్ట్‌లను తయారు చేసే గ్రామానికి వెళ్ళాము. అక్కడ హస్తకళాకారులతో సంభాషించాము. వారితో కొన్ని వారాల పాటు ఉండి ఆ ప్రక్రియను నేర్చుకున్నారు.
నిరాశ్రయులకు అండగా...
తమ అందమైన ఉత్పత్తులకు తగినంత ఆదాయం లభించని కళాకారులతో కలిసి పనిచేయడం జయతిని బాధించింది. అందమైన వస్తువులు అందమైన పరిస్థితుల్లోనే తయారవుతాయని ఆమె నమ్మకం. కొంతకాలం తర్వాత యుఎస్‌లో పర్యావరణ రూపకల్పనలో మాస్టర్స్ చేసే సమయంలో ఆమె లాస్ ఏంజిల్స్‌లో నిరాశ్రయుల కోసం పని చేసే ఓ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉంది. వారికి ఉన్నతమైన భవిష్యత్‌ను అందించేందుకు తన వంతు సహకారం అందించింది. జయతి వ్యక్తిత్వ వికాస దశలను కూడా అన్వేషించింది. భావోద్వేగాలు, అనుభవాల నుండి ఉత్పన్నమైన ఉత్పత్తులను రూపొందించింది.
నమ్మకం పెంచుకుంది
అతి తక్కువ కాలంలోనే జయతి టి - ఆకారపు డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రంగులు, నమూనాలు, కూర్పులతో పని చేయడం పట్ల ఆనందిస్తుంది. విజువల్ సంస్కృతిపై నమ్మకాన్ని పెంచుకుంది. వైవ్స్ బెహర్ నేతృత్వంలోని డిజైన్, ఇన్నోవేషన్ సంస్థ అయిన ఫ్యూజ్ప్రాజెక్ట్లో పర్యావరణ డిజైనర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆమె పారిశ్రామిక రూపకల్పన, అనుభవ రూపకల్పన, వ్యూహ బృందానికి సహకారం అందించింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన బృందంతో కలిసి పని చేస్తున్న సమయంలో ఆమె కోవిడ్ - సంబంధిత వెంటిలేటర్ ప్రాజెక్ట్‌లో భాగమయింది. ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో ఏదైనా చేయాలని ఆమె ఎల్లప్పుడూ కోరుకునేది. ఆ తర్వాత కాలంలో ఇదే అత్యంత విలువైన సేవా కార్యక్రమంగా నిరూపించబడింది.
సవాళ్లను అధిగమిస్తూ...
ఆమె ఇటీవల ఫ్జోర్డ్ వారి శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో విజువల్ డిజైనర్‌గా చేరింది. ఇక్కడ కూడా కొన్ని ప్రభావవంతమైన ప్రాజెక్ట్‌లలో పని చేయాలని చూస్తోంది. అయితే ఈ దశకు చేరుకోవడం జయతికి అంత సులువుగా జరగలేదు. మహిళలు ''వృత్తులకు అర్హులు'' అని ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ ఆమె భారతదేశంలో చాలా కష్టపడింది. అయితే బయటి వారు ఎన్ని మాటలు అంటున్నా కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరగలిగింది. ''ప్రతి మహిళకు ఎప్పుడూ ఈ సవాళ్ళు, హక్కులు, అధికారం కోసం పోరాటాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. యుఎస్‌లో కూడా నేను ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాను.
మరింత కష్టపడాలి
''చాలా విజయవంతమైన మహిళా డిజైనర్లతో కలిసి పనిచేయడం విశేషం. ప్రతి స్త్రీ సాధించగలదు అనేది దగ్గరగా చూడడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వాస్తవానికి మనలోని శక్తిని నిరూపించుకోవడానికి కొన్నిసార్లు మనం మరింత కష్టపడాల్సి రావడం కాస్త విచారకరం'' అంటున్నారు జయతి.
నాకెంతో ఇష్టమైన పని
''నా వ్యక్తిగత ప్రాజెక్ట్‌లన్నీ మానవ మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినవి. వ్యక్తులు ఎలా ఎదుగుతారు, తమ అనుభవాల ద్వారా ఎలా వెళతారు, వ్యక్తులు ఎలా పని చేస్తారు... ఇలా ఎన్నో విషయాల గురించి నా ప్రాజెక్టులు ఉంటాయి. ఇది నేను నిజంగా ఇష్టపడే పని. భారతీయ సంస్కృతి అనేది ఈ అందమైన క్షణాలు, అనుభవాలకు సంబంధించినది. ప్రజలను సంతోషపరిచే అందమైన వాతావరణాలను ఎలా సృష్టించాలో భారతీయులకు తెలుసు. కాబట్టి ఈ డిజైన్ రంగం చాలా విలువైనదిగా ఉంటుందని నేను భావిస్తున్నాను'' అని ఆమె అంటున్నారు.
భవిష్యత్తులో జయతి మెడ్‌టెక్, బ్లెండ్ సైకాలజీ, హెల్త్‌కేర్ గురించి మరింత తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చేస్తూనే ఉంటా...
ప్రాణాలను కాపాడే వ్యక్తులతో కలిసి పని చేయడం ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నేను ఈ సేవా కార్యక్రమాలను దీర్ఘకాలికంగా చేయాలనుకుంటున్నాను. ఇది ఇంకా ఏదో పెద్ద పనిలో భాగం కావడానికి అవకాశం ఉంది. కరోనా సమయంలో ప్రజలు ఎంతో మంది ఇంట్లోనే, నిస్సహాయంగా ఉండిపోయారు. అటువంటి వారికి సాయం చేసే ప్రాజెక్ట్‌లో భాగస్వామిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
- సలీమ