Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి పౌష్టకాహారం ఇస్తాం. కానీ చాలా మంది పిల్లల కంటి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపరు. గతం కంటే ఇప్పుడు కంటి సరక్షణ చాలా ముఖ్యం. చేతిలో మొబైల్, కండ్ల ముందు కంప్యూటర్, కుంచించుకుపోయిన ఆధునిక టీవీ ప్రపంచం మనం రోజులో ఎక్కువ భాగం ఎలక్ట్రానిక్స్పైనే గడుపుతున్నాం. అన్ని వయసుల వారిలో మొబైల్ వినియోగం పెరిగింది. ఎక్కువ స్క్రీన్ సమయం పిల్లల కంటిచూపుపై ప్రభావితం చేస్తుంది. చిన్నవయసులో దృష్టి లోపం వస్తుంది. వాళ్లు పెరుగుతుంటే కంటికి సంబంధించిన వ్యాధులు రావచ్చు. పిల్లలు ఎంత సమయం మొబైల్ ఉపయోగిస్తున్నారు గమనించి స్క్రీన్ సమయాన్ని తగ్గించడం తప్పనిసరి. అలాగే శరీర వివిధ విధులకు పోషకాలు ఉన్నట్టే కండ్లు, దృష్టిని బలోపేతం చేసి, కండ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచే నిర్ధిష్ట ఆహారాలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. కంటి రక్షణ కూడా అంతే ముఖ్యం. మీ పిల్లలకు ఎలాంటి ఆహారాలు పెట్టాలో చూద్దాం.
కూరగాయలు, ఆకుకూరలు: రోజూ ఆహారంలో పచ్చికూరలు చేర్చుకోవాలి. ఆకుకూరలు ఎక్కువగా తినాలని ఎన్నో ఏండ్లుగా వింటూనే ఉన్నాం. కూరగాయలు, ఆకుకూరల్లో ఉండే పోషకాలు కంటి చూపుకు చాలా ముఖ్యం. రోజువారీ ఆహారంలో బచ్చలి కూర లేదా ఆకుపచ్చ కూరగాయలు మాత్రమే తినడానికి ప్రాధాన్యతనివ్వాలి. బచ్చలి కూర, పొన్నగంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కండ్ల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
క్యారెట్: క్యారెట్లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన విటమిన్ ఏ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కంటి చూపునకు విటమిన్ ఏ అత్యంత ముఖ్యమైన పోషకం. ముఖ్యంగా ఆరోగ్యకరమైన కండ్ల కోసం క్యారెట్లను ప్రతిరోజూ తినవచ్చు.
ఎల్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్: బొప్పాయి, మామిడి, జామ, పసుపు గుమ్మడి కాయలతో సహజంగా పసుపు రంగులో ఉండే కూరగాయలు, పండ్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. క్యారెట్ లాగా ఈ ఫుడ్ కంటి చూపునకు చాలా ముఖ్యమైంది.
చేపలు: చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ బిడ్డ కంటి చూపును మెరుగుపరుస్తుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చేపలు తింటే శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి..
కోడిగుడ్లు: ఎన్నో రకాలుగా వండుకుని తినగలిగే అనేక ఆహారాల్లో గుడ్డు ఒకటి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చాలా ఆహారాల్లో కనిపించని పోషకం. ఇది కంటి చూపును బలోపేతం చేస్తుంది. గుడ్డులో విటమిన్ ఏ మాత్రమే కాకుండా కంటి చూపును మెరుగుపరచే పోషకాలైన లుటీన్, జియాక్సంథిన్, జింక్ కూడా ఉంటుంది.
నట్స్, సీడ్స్: విటమిన్ ఇ రిచ్ బాదం, పిస్తాపప్పులు, వాల్నట్లు, సన్ఫ్లవర్ సీడ్స్ కంటిశుక్లం వంటి వయసు సంబంధిత మాక్యులర్ డీజనరేషన్ వంటి వ్యాధులను నివారిస్తుంది.
సిట్రస్ పండ్లు: నిమ్మ, నారింజ, జాజికాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి విటమిన్ సీ అధికంగా ఉండే సిట్రస్ పండ్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా కండ్లలోని రక్తనాళాలను కూడా బలోపేతం చేస్తాయి. కాబట్టి వీటిని మీ పిల్లలకు రోజూ ఇవ్వండి.