Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టబు... నాలుగు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో ప్రామాణిక హద్దులన్నింటినీ చెరిపేసి, కాలం, సంఘం విధించిన నియమాలు, కట్టుబాట్లను తెంచుకుని భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. నవంబర్ 4న తన 51వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఐదు పదుల వయసు దాటినా నేటికీ చెక్కు చెదరని అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఆమె గురించి మరిన్ని విశేషాలు...
టబు అసలు పేరు తబస్సుమ్ హష్మి. హైదరాబాద్‌లో 1970, నవంబర్ 4వ తేదీన పుట్టారు. టబు కుటుంబ సభ్యులంతా మంచి విద్యా వంతులు. ఈమె బంధువైన షబానా అజ్మీ హిందీ సినిమాల్లో మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో, ఆమె అక్క ఫరా హష్మికి కూడా సినిమాలపై ఆసక్తి పెరిగింది. అయితే టబుకు మాత్రం సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టే ఆలోచనే లేదు. కానీ, అనుకోకుండా 'బజార్' (1982) అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర చేయడంతో తర్వాత దేవానంద్ చిత్రం 'హమ్ నౌజవాన్' (1984)లో మరో అవకాశం వచ్చింది. దాంతో టబు అడుగులు సినీ పరిశ్రమవైపే పడ్డాయి. ''నేను నటిని కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. అది యాదృచ్ఛికంగా జరిగింది. బహుశా అందుకే నాకు రోల్ మోడల్ లేదా రిఫరెన్స్ పాయింట్ అంటూ ఎవరూ లేరు'' అని టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పారు.
విజయం వైపు అడుగులు..
బోనీ కపూర్ నిర్మించిన 'ప్రేమ్' (1995) సినిమాలో టబుకు తొలిసారిగా పూర్తి నిడివి ఉన్న పాత్ర చేశారు. కానీ తెరపై కథానాయికగా కనిపించిన తొలి సినిమా మాత్రం తెలుగులో వచ్చిన 'కూలీ నం.1'(1991). ఇందులో ఆమె వెంకటేష్ పక్కన హీరోయిన్గా చేశారు. ఇక అజరు దేవగన్ హీరోగా హిందీలో వచ్చిన 'విజయపథ్' (1994) సినిమాతో ఆమె విజయపథంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాకు టబు 'ఉత్తమ తొలి చిత్ర నటి'గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా గెలుచుకున్నారు. దీని తర్వాత 'హకీకత్'(1995), 'సాజన్ చలే ససురాల్' (1996), 'జీత్'(1996), 'బోర్డర్'(1997), 'చాచీ 420' (1998), 'బీవీ నం.1'(1999), 'హమ్ సాత్-సాత్ హై'(1999) వంటి సినిమాలతో టబు హిందీ చిత్రసీమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ప్రతిభను వెలికి తీసిన చిత్రాలు
ప్రారంభం నుంచే టబు వరుస హిట్లు కొట్టినప్పటికీ 'మాచిస్' (1996), 'కాలాపానీ' (1996) చిత్రాలతో ఆమెలోని అసలైన ప్రతిభ తెరపైకి వచ్చింది. పంజాబ్ ఉగ్రవాద సమస్యల నేపథ్యంలో గుల్జార్ మాచిస్ హిందీ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సిక్కు అమ్మాయి 'వీరాన్' పాత్రకుగాను టబు 'ఉత్తమ నటి'గా నేషనల్ అవార్డు అందుకున్నారు. బ్రిటిష్ వలస పాలన నేపథ్యంలో కమల్ హాసన్ రచించి, ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం 'కాలాపానీ'. తర్వాతి సంవత్సరం ప్రియదర్శన్ దర్శకత్వంలోనే వచ్చిన హిందీ చిత్రం 'విరాసత్' (1997)లో ఒక పల్లెటూరి అమ్మాయిగా ఆమె నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు... మధుర్ భండార్కర్ దర్శకత్వంలో వచ్చిన 'చాందినీ బార్' (2001) హిందీ చిత్రంలో టబు నటన మరో ఎత్తు. బార్ డాన్సర్ 'ముంతాజ్'గా టబు నటన అత్యంత సహజసిద్ధంగా ఉందని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికీ మెథడ్ యాక్టింగ్‌కు ఓ మంచి ఉదాహరణగా ఆ సినిమాను ప్రస్తావిస్తారు. చాందినీ బార్ సినిమాకు మరోసారి 'ఉత్తమ నటి'గా జాతీయ అవార్డు అందుకున్నారు.
ప్రపంచ సినిమాకు దొరికిన నిధి
టబు తెలివైన నటి అనడంలో సందేహం లేదు. ఆమె ఎంచుకునే పాత్రల వైవిధ్యం ఆమెను భారతీయ సినిమా తెరపై ప్రత్యేకమైన నటిగా నిలబెట్టింది. ఓ పక్క తెలుగు, తమిళం, మరాఠీ మొదలైన భారతీయ భాషల్లో సినిమాలు చేస్తూ మరోవైపు 'ది నేమ్‌సేక్' (2006), 'లైఫ్ ఆఫ్ పై' (2012) వంటి అంతర్జాతీయ చిత్రాల్లోనూ తన సత్తా చాటుకున్నారు. షేక్స్పియర్ నాటకాల ఆధారంగా రూపొందించిన 'మక్బూల్', 'హైదర్' (హిందీ), చార్లెస్ డికెన్స్ రచన ఆధారంగా తీసిన 'ఫితూర్' (హిందీ), జేన్ ఆస్టిన్ రచన ఆధారంగా నిర్మించిన 'కండుకొండేన్ కండుకొండేన్' (తమిళం) లాంటి చిత్రాల్లో నటించి క్లాసిక్స్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటూనే, మరోవైపు 'హేరా-ఫేరీ' (1999), 'గోల్మాల్ అగైన్' (2017) లాంటి సరదా చిత్రాల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 'అస్తిత్వ' (2000), 'మక్బూల్' (2004), 'చీనీ కమ్' (2007), 'హైదర్' (2014), 'దృశ్యం' (2015), 'అంధాధున్' (2018), 'ఎ సూటబుల్ బారు' (2020) సినిమాలు టబు కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. ఈ సినిమాలన్నింటిలోనూ పాత్రలను సొంతం చేసుకుని, తెరపై సహజ నటనను ఆవిష్కరించారు టబు. సినిమా కథకు, అందులో ఉన్న భావోద్వేగాలకు కొత్త అర్థాన్ని, కొత్త కోణాలను జోడించడం ఆమె ప్రత్యేకత. అందుకే 'లైఫ్ ఆఫ్ పై' సినిమాకు దర్శకత్వం వహించిన ఆంగ్ లీ ఆమెను ''ప్రపంచ సినిమాకు దొరికిన నిధి''గా అభివర్ణించారు.
మెథడ్ యాక్టర్‌గా
ఈ నవంబర్ 4న ఆమె జరుపుకున్న పుట్టిన రోజుతో ఆమె వయసు యాభై పదులు దాటింది. రెండు జాతీయ అవార్డులు, అరడజను ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మశ్రీ పురస్కారం అందుకున్న టబు కెరీర్ ఇప్పటికీ అంతే జోరుగా సాగుతోంది. నటనలో ఎంత ఉన్నత స్థాయికి చేరారో, వ్యక్తిగత జీవితంలో కూడా ఆము అంతే ఉన్నతంగా, ఆనందంగా ఉన్నారు. లీ స్ట్రాస్బెర్గ్ ప్రతిపాదించిన ప్రసిద్ధ నటనా సూత్రాలు.. ఇంప్రొవైజేషన్ (సొంతం చేసుకోవడం), ఎఫెక్టివ్ మెమొరీ (మంచి జ్ఞాపకశక్తి) మొదలైనవి టబు నటనలో విశేషంగా కనిపిస్తాయి. ఇవన్నీ ఒక మెథడ్ యాక్టర్‌కు ఉండవలసిన కచ్చితమైన లక్షణాలు. అందుకే షేక్స్పియర్, డికెన్స్ రచనలను చదవకపోయినా వారు సృష్టించిన పాత్రలకు తెరపై ప్రాణం పోయగలిగారు.
ఇదీ ఆమె విశిష్టత
ఒకే సమయంలో విభిన్న భాషల్లో వేరు వేరు అంశాలకు సంబంధించిన సినిమాల్లో సునాయాసంగా నటించడంలో కూడా టబు సిద్ధహస్తురాలు. సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషించకపోయినా ఆమె నైపుణ్యమే ఆమెను కేంద్ర బిందువుగా చేస్తుంది. ఉదాహరణకు హామ్లెట్ నాటకం ఆధారంగా తీసిన 'హైదర్' సినిమాలో తల్లి 'గజాలా మీర్'గా సహాయక పాత్ర పోషించారు టబు. ''ఈ సినిమాకు హైదర్ అని కాకుండా గజాలా అని పేరు పెట్టాల్సింది' అంటూ ది న్యూయార్క్ టైమ్స్ రాసింది. అదీ ఆమె విశిష్టత. సినిమాలో ఏ పాత్రనైనా తన నటనా సామర్థ్యంతో ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకోగలరు. 'మాచిస్', 'హు-తు-తు' సినిమాల్లో టబు నటన చూశాక గుల్జార్ ఆమెను మీనాకుమారి, నూతన్ వంటి ప్రజ్ఞావంతురాలని ప్రశంసించారు.
భారతీయ సినిమాకు మెరిల్ స్ట్రీప్
రూపంలో, వివిధ స్థాయిల్లో భావోద్వేగాలను పండించడంలో, భాష, నేపథ్యాలను అర్థం చేసుకోవడంలో, క్రాఫ్ట్‌లో హాలీవుడ్ స్టార్ మెరిల్ స్ట్రీప్‌ను గుర్తుకు తెస్తారు టబు. 'సోఫీస్ ఛాయిస్' (1982), 'అవుట్ ఆఫ్ ఆఫ్రికా' (1985), 'ది ఐరన్ లేడీ' (2011) వంటి చిత్రాల్లో చిరస్మరణీయ పాత్రల్లో నటించారు మెరిల్ స్ట్రీప్. బహుశా అందుకే మీరా నాయర్ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై టబును ''భారతీయ సినిమాకు మెరిల్ స్ట్రీప్'' అంటూ ప్రశంసించారు.