Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైనా, అమెరికా, రష్యాలలో కరోనా మూడోవేవ్ ప్రారంభమై కేసులు పెరుగుతున్నాయని తెలుస్తున్నది. రష్యాలో రోజుకు 48 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు రాజ్యమేలుతున్నాయి. చైనాలోని మూడు సిటీల్లో లాక్డౌన్ విధించారు. ఇవన్నీ చూసే వైద్యరంగ నిపుణులు మూడో వేవ్ దగ్గరలో రానున్నదని అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కోవిడ్ మరణాలు యాభై లక్షలు దాటినాయి. అసలు కరోనా బారినపడ్డ ప్రజలు ఇరవై నాలుగు కోట్లు దాటాయి. ఒక్క అమెరికాలోనే 7.45 లక్షల మంది కరోనా మరణాలు సంభవించాయి. ఒకవైపు వ్యాక్సిన్లు వెయ్యటం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నా కొత్త వేరియంట్లు పుట్టుకు రావడం మానలేదు. మన దేశంలో తయారైన కోవాగ్జిన్‌కు ఆస్ట్రేలియా గుర్తింపు కూడా లభించింది. ఈ తరుణంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ వైరల్ జ్వరాల వ్యాప్తికి కారణమైన దోమల గురించి వాటి జీవన విధానం గురించి తెలుసుకోవటం ఆవశ్యం. అందుకే ఈరోజు నేను దోమల బొమ్మల్ని చేసి వాటి గురించిన వివరాలు చెప్పాలనుకుంటున్నాను. పక్క దేశాల్లోని కరోనా విజృంభణ చూసి మనం జాగ్రత్తగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పల్లీకాయ తొక్కలతో...
పల్లికాయల సీజన్లో పల్లీకాయలు ఉడకబెట్టుకొని తినడానికి కొనుక్కున్నాం. పల్లీ కాయల్ని ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటాయి. లోపలి పప్పులన్నీ తిన్నాక పల్లీకాయల తొక్కల్ని దాచి పెట్టాము. అలా దాచిన పల్లీల తొక్కతోనే ఇప్పుడు దోమ బొమ్మను చేశాను. ఈవారం దోమ బొమ్మల్ని చేయాలనుకున్నాను. ఎందుకంటే దోమలు మానవులకు ఎన్నో జబ్బుల్ని కలగచేస్తాయి. ఇవి మానవుల రక్తం పీల్చి పీల్చి రకరకాల జబ్బుల్ని అంటించి పోతాయి. దోమల వల్ల మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ జ్వరం, చికున్ గునియా, మెదడు వాపు వ్యాధి, లింఫాటిక్ ఫైలేరియాసిస్ వంటి వ్యాధులు సంభవిస్తాయి. అధిక జబ్బులకు కారణమైన ఈగలు, దోమల జీవిత చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలనే ఆలోచనతో హైస్కూలు స్థాయిలోనే ప్రవేశపెట్టారు. దోమలు గుడ్లు ఎలా పెడతాయి, దోమ లార్వాలు ఎలా వృద్ధి చెందుతాయి, వాటి వల్ల జరిగే నష్టాల గురించి పాఠాల్లో వివరించారు. దోమలు ఇళ్ళలోకి రాకుండా ఇప్పుడు తలుపులు, కిటికీలు మెష్‌లు పెట్టుకోవడం, ఒక వేళ లోపలికి వచ్చినా ఆల్ అవుట్ లాంటి మస్కిటో రిపెల్లింట్లు వాడడం చేస్తుంటారు. గతంలో దోమతెరలు, మస్కిటో కాయిల్స్ వంటివి వాడేవారు. ఇంటి పరిసరాల్లో నీళ్ళు నిలవ లేకుండా చూసుకుంటే దోమల ప్రత్యుత్తత్పిని నివారించినట్టే.
లవంగాలతో...
వంటింటిలోని మసాలా దినులులైన లవంగాలతో ఒక దోమను రూపొందించాను. లవంగాలు నల్లగా ఉంటాయి కాబట్టి దోమ శరీరం కూడా నలుపే కాబట్టి దోమ బొమ్మ బాగా కుదిరింది. దోమల్లో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి. దోమల్లో క్యూలెక్స్, అనాఫిలస్, ఈడిస్ అనే మూడు రకాలు ఉంటాయి. దోమలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉంటాయి. దోమలు నీటిలో ఉండే సేంద్రియ పదార్థాలను తింటాయి. ఒక జత రెక్కలు మధ్య భాగానికి అతుక్కుని ఉంటాయి. ఆడ దోమల వలననే మానవులకు వ్యాధులు సంక్రమించేవి. పాత టైర్లు, తాగి పారేసిన కొబ్బరి బోండాలు, వాడి పారేసిన టీ కప్పులను, ప్లాస్టిక్ డబ్బాల వంటి వాటికి దూరంగా పడెయ్యాలి. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను, చెత్తా చెదారం కుప్పల దగ్గరా శుభ్రం చేయాలి. చెత్త నిల్వ ఉండకుండా చూసుకోవాలి. లవంగాలు మసాలా దినుసే కాదు సుగంధ ధ్రవ్యం కూడా. లవంగాలు మిర్టేసి కుటుంబానికి చెందిన పూ మొగ్గలు. లవంగాల శాస్త్రీయనామం ''షైజీజియమ్ ఏరోమేటికమ్''. లవంగం దోమల్ని దరిచేయరనివ్వని అద్భుత ఔషధం. లవంగాలు దోమల్ని దగ్గరకు రానివ్వవట. కానీ మనం లవంగాలతోనే దోమను తయారు చేశాం. లవంగాల్లోని 'యుజెనాల్' అనే రసాయనం కషానికి విరుగుడుగా పని చేస్తుంది.
ఇంజక్షన్ మూతలతో
ఇంజక్షన్ మీద ఉండే ప్లాస్టిక్ మూతలతో ఈరోజు దోమను సృష్టించాను. పర్పుల్ కలర్ ప్లాస్టిక్ మూతలతో దోమ శరీరాన్ని తయారు చేశాను. 'సిట్రోనెల్లా' అనే మొక్క దోమలను ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. దోమలు లేని దేశం ప్రపంచం మొత్తంలో ఫ్రాన్స్ దేశమేనట. రోజ్మేరీ, తైలముగడ్డి, బంతిపువ్వు, కాత్నిప్, అగేరతుం, హార్స్‌మింట్, వేప, లావెండర్, తులసి వంటి దోమల వికర్షక మొక్కల్ని పెంచడం వలన దోమలు రాకుండా నిరోధించగలుగుతాము. దోమలు కుట్టడం వలన దురద, జబ్బులు వస్తాయి. రసాయనాలు వంటి దోమ నిరోధకాల వలన ఆరోగ్యం పాడవడమే కాకుండా పర్యావరణం కలుషితమవుతుంది. సిట్రోనెల్లా మొక్క ప్రత్యేకమైన వాసన కలిగి ఉండటం వల్ల దోమలు దూరంగా పారిపోతాయి. ఈ మొక్క అందంగా ఉండటం వల్ల ఇంట్లో పెంచుకోగలుగుతాము. దోమలు 'కులిసిడే' కుటుంబానికి చెందిన కీటకాలు, దోమలు మద్యం తాగిన వారిపై అధికంగా దాడి చేస్తాయట.
పిస్తా పొట్టుతో...
మా అబ్బాయి డైటింగ్‌లో భాగంగా పిస్తా, బాదం పప్పులు ఎక్కువగా తీసుకుంటున్నాడు. పిస్తా పప్పుల మీద ఉండే పొట్టును దాచి వాటితో దోమను తయారు చేశాను. దోమ పొట్టలో గప్చిప్ వడియాలను నింపాను. దోమల లార్వాలు, ప్యూపాలు పెరగకుండా గంబూసియా చేపల్ని పెంచుతారు. ఈ చేపలు దోమల లార్వాలను తినేయటం వల్ల అవి ప్రౌఢ జీవులుగా మారకముందే చనిపోతాయి. ప్రస్తుతం కరోనా కాస్త విరామం తీసుకున్న సమయంలో మిగతా వ్యాధులు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ చికున్‌గునియా వంటి వ్యాధులు పిల్లల్ని వణికిస్తున్నాయి. ఈ వైరల్ వ్యాధులకు కారణం దోమలు కుట్టి రక్తాన్ని పీల్చుకున్నపుడు అవి మన శరీరంలో వదిలే వ్యాధి కారక వైరస్సులే. దోమల్ని పారద్రోలితే జబ్బులు రాకుండా కాపాడుకోగలిగినట్టే.
ఉల్లిపాయ రింగులతో...
అన్నంలో నంచుకొని తినడానికి వడియాలు ఎంతో బాగుంటాయి. వడియాలతో ఎన్నో రకాలు దొరుకుతున్నాయి. పూర్వం గుమ్మడి వడియాలు, బియ్యప్పిండి వడియాలు, మినప వడియాలు వంటివి మాత్రమే ఉండేవి. ఇప్పుడు బ్యాట్లు, రింగులు, పువ్వులు, స్టార్టు రకరకాల ఆకారాల్లో రంగు రంగుల్లో లభ్య మవుతున్నాయి. వీటిలోని ఆనియన్ రింగ్స్‌తో దోమను తయారు చేశాను. 'ఏడిస్ ఈజిప్టి' అనే శాస్త్రీయనామం కలిగిన ''ఎల్లో ఫీవర్ మస్కిట్లో'' మానవులను కుట్టటం వలన డెంగ్యూ జ్వరం వస్తుంది. ఈ దోమకు కాళ్ళ మీద తెల్లటి గీతలు కనిపిస్తాయి. ఉరో భాగంలోనూ తెల్లని గీతలు కనిపిస్తాయి. ఈ దోమ ఆఫ్రీకాకు చెందినవి. కానీ ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నది. ఈ దోమ చాలా రకాల జ్వరాలకు ఏజెంట్‌గా పని చేస్తుంది. సాధారణంగా ఏ దోమను అయినా దాని జీవిత కాలం రెండు వారాలాను మించి ఉండదు. ఆడదోమ తన గుడ్లను పొదగడానికి మానవులను కుట్టి రక్తం పీల్చుకుంటుంది డెంగ్యూ జ్వరాల వలన ప్లేట్లెట్స్ సంఖ్య పడిపోయి చివరికి మరణానికి దారి తీస్తుంది. బయట తిరిగేటపుడు కాళ్ళు, చేతులు కవరయ్యే విధంగా బట్టలు తొడుక్కుని దోమల నుంచి రక్షించుకోవాలి.
- డా|| కందేపి రాణిప్రసాద్