Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్ర పరిశ్రమలోకి కొత్త హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొందరు మాత్రమే చిరకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. అలాంటి వారు చాలా అరుదుగా వెండితెరపై మెరుస్తారు. ఆ కోవకు చెందినవారే లిజోమోల్ జోస్. ఇటీవల సూర్య కీలక పాత్రలో తెరకెక్కిన 'జై భీమ్'లో సినతల్లి పాత్రలో ఆమె నటించలేదు.. జీవించింది. ఆ పాత్రను ఆకళింపు చేసుకుంది. కాదు.. కాదు.. ఆవాహన చేసుకుంది. షూటింగ్ జరిగినన్ని రోజులు తాను లిజో అన్న సంగతి మర్చిపోయింది. సినతల్లిగా గర్భవతి పాత్రలో ఒదిగిపోయింది. ఆ కష్టమే ఇప్పుడు ఆమెకు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇన్ని ప్రశంసలు దక్కించుకుంటున్న ఆమె గురించి కొన్ని విశేషాలు మానవి పాఠకుల కోసం...
లిజోమోల్ కేరళలో 1992లో పుట్టింది. తల్లిదండ్రులు ఉన్నత మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. ఆమెకు ఓ చెల్లి వుంది. అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదివింది. పాండిచ్చేరి యూనివర్సిటీలో 'ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్'లో మాస్టర్స్ చేసింది. డిగ్రీ తర్వాత కొన్నాళ్లు ఓ టెలివిజన్ ఛానల్లో లిజో పనిచేసింది.
తొలి అవకాశం
ఫహద్ ఫాజిల్ నటించిన 'మహేశింటే ప్రతికారం' చిత్రంలో లిజోకు తొలి అవకాశం లభించింది. తన స్నేహితురాలి వాట్సాప్ గ్రూపులో ఈ సినిమా ఆడిషన్స్ గురించి ప్రకటన రావడంతో ఆమె లిజోకు చెప్పింది. అలా ఆడిషన్స్‌కు తన ఫొటోలు పంపించింది. రెండు వారాల తర్వాత చిత్ర బృందం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తనకు నటన, పాడటం ఏదీ రాదని లిజో చెప్పడంతో 'ఇటీవల మీరు చూసిన సినిమా గురించి మీ స్నేహితురాలికి ఎలా చెబుతారు' అనేది చేసి చూపించమనడం, లిజో చేయటం, అది వారికి నచ్చడంతో సినిమా కోసం తీసుకున్నారు.
సహజంగా వచ్చేవట
షూటింగ్ అంటే భయపడుతున్న ఆమెకు దర్శకుడు దిలీశ్ పోతన్ ఎక్కువ ఆలోచించే సమయం ఇచ్చే వారు కాదట. దీంతో అప్పటికప్పుడు సన్నివేశాలు చేయడంతో అవన్నీ సహజంగా వచ్చాయట. 2016లో వచ్చిన మలయాళ చిత్రం 'రిత్విక్ రోషన్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'హనీ బీ 2.5' ఆమెను మరో మెట్టు ఎక్కించింది. ఆ తర్వాత 'స్ట్రీట్‌లైట్స్', 'ప్రేమసూత్రం', 'వత్తకోరు కాన్ముకన్' ఇలా మరికొన్ని మలయాళ చిత్రాల్లో నటించింది.
తనని తాను మార్చుకుంది
తమిళంలో 'శివప్పు మంజల్ పచ్చారు(తెలుగులో ఒరేరు బామ్మర్ది) సిద్ధార్థ్‌కు జోడీగా చక్కని నటన కనబరిచింది. అయితే ఈ సినిమా ఆడిషన్స్ సందర్భంగా తమిళం రాక లిజో ఇబ్బంది పడింది. మూడు దశల్లో జరిగిన ఆడిషన్స్‌ను దాటుకుని చివరకు కథానాయికగా ఎంపికైంది. 'శివప్పు'లో లిజో నటనను చూసిన త.శె.జ్ఞానవేల్ 'జై భీమ్'లో సినతల్లి పాత్ర కోసం అడిగారు. అందులోని పాత్ర కోసం లీజో తనని తాను మార్చుకుంది. సినిమా చూసిన తర్వాత 'ఒరేరు బామ్మర్ది'లో నటించిన లిజోనేనా 'జై భీమ్'లో చేసిందా? అన్న ఆశ్చర్యం ప్రేక్షకుడిలో కలిగింది.
గ్లిజరిన్ లేకుండా ఏడ్చేశాను
'జై భీమ్'లో చిన్నతల్లి పాత్ర గురించి లీజో మాట్లాడుతూ.. ''షూటింగ్ చేసేటపుడు ఆ పాత్ర నుంచి పూర్తిగా బయటకు రాలేకపోయా. సినతల్లి అనుభవించిన బాధ, ఆవేదన ఇప్పటికీ నాలో ఉండిపోయాయి. గతంలో నేను పోషించిన ఏ పాత్ర కూడా నన్ను ఇంతలా ప్రభావితం చేయలేదు. కొన్ని సన్నివేశాల్లో నటించినప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు గ్లిజరిన్ వాడకుండానే ఏడ్చేశాను. డైరెక్టర్ కట్ చెప్పినా.. నా కన్నీళ్లు ఆగలేదు. తిరిగి సాధారణ స్థితికి రావడానికి నాకు చాలా సమయం పట్టేది. ఎన్నిసార్లు ఈ చిత్రం చూసినా నాకు ఏడుపు వచ్చేస్తోంది'' అని లీజో భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. ఇలా సినతల్లి పాత్రలో జీవించిన లిజో ఇలాంటి మరెన్నో పాత్రల్లో నటించాలని కోరుకుందాము. ఆమె ఇటీవల అరుణ్ ఆంటోనీని వివాహం చేసుకుంది.