Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలలు నెరవేర్చుకోవాలంటే జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవల్సిందే. విభిన్నమైన లక్ష్యాలు పెట్టుకోవల్సిందే. అలాంటి లక్ష్యాలనే పెట్టుకొని తన కలలను నిజం చేసుకుంటుంది సూఫియా ఖాన్... తన కోసమే కాదు సమాజం కోసం చిరుతపులిలా పరుగులు పెడుతుంది. తన పరుగుతో కొందరిలో స్ఫూర్తి నింపుతుంది. రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. అక్టోబర్ 1న హిమాలయన్ అల్ట్రా ఎక్స్‌పెడిషన్‌ను పూర్తి చేసింది. మనాలి నుండి లేV్‌ా వరకు 156 గంటల్లో 480 కి.మీ ఆరు రోజుల్లో పరిగెత్తి ప్రపంచంలోనే మొదటి మహిళా రన్నర్‌గా నిలిచి తన సత్తా చాటుకుంది.
సూఫియా రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆమె పదహారేండ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఒంటరిగా కష్టపడి డిగ్రీ చదివించింది. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించమని తల్లి చెప్పింది. అయితే సూఫియా లక్ష్యం వేరు. ఆమె కలలు వేరు. ఏవియేషన్ రంగమంటే ఆమెకు ఎంతో ఇష్టం. తన కలను ఎలాగైనా నిజం చేసుకోవాలనుకుంది. అందుకే దానికి సంబంధించిన ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా చేరింది. కానీ అక్కడ పని ఎంతో కష్టంగా ఉండేది. వెట్టిచాకిరిలా అనిపించేది. అయినప్పటికీ తన లక్ష్యం కోసం ఆ కష్టాన్ని భరించింది. ఏడాది పాటు అక్కడే పని చేసింది. విపరీతమైన శ్రమతో బలహీనపడిపోయింది. ఆ తర్వాత నేను చేయాల్సింది ఇది కాదు అనుకుంది. దాంతో తన ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. దానికోసం రోజూ కొంత సేపు పరిగెత్తడం మొదలుపెట్టింది.
ఉద్యోగం మానేసి
తన ఆరోగ్యం కోసం మొదలైన పరుగు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. దాంతో తన లక్ష్యం పెరిగెత్తడమే అనే నిర్ణయానికి వచ్చింది. వెంటనే ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం మానేసి పరుగు ప్రారంభించింది. పరిగెడుతూ సమాజంలోకి సందేశాన్ని తీసుకెళ్ళింది. మొదటిసారి ''రన్ ఫర్ హౌప్ - హ్యుమానిటీ, పీస్, ఈక్వాలిటి' సందేశంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4000 కి.మీ పరుగులు పెట్టింది. 2019లో ఏప్రిల్‌లో రోజుకు 50 కి.మీ చొప్పున వంద రోజులు పరిగెత్తి రికార్డు సృష్టించింది. ఇదే ఆమె మొదటి విజయం. అక్కడితో ఆమె పరుగు ఆగలేదు. తర్వాత 16 రోజుల్లో 720 కి.మీ గ్రేట్ ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్ రన్ చేసింది. ఈ రకమైన పరుగు తీసిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించింది.
మొదటి మహిళగా...
ఇటీవల ప్రపంచంలోని అత్యంత సవాలుతో కూడుకున్న, ఎత్తైన హిమాలయాలపై పరుగులు పెట్టింది. తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో ఐదు ప్రధాన పాస్‌లను అధిరోహించింది. ఉష్ణోగ్రతలు మైనస్ ఐదు డిగ్రీల కంటే తక్కువగా పడిపోతున్న తన పరుగును మాత్రం ఆపలేదు. అదే సెప్టెంబర్ 2021 'హిమాలయన్ అల్ట్రా రన్ ఎక్స్పిడిషన్' మనాలి నుండి మొదలుపెట్టిన పరుగు. 480 కిలో మీటర్లు ఆ పరుగు. అక్టోబర్ 1న లెV్‌ా లడక్‌లో ముగించింది. ఇన్ని కిలోమీటర్లు పరుగు తీసిన వాళ్లు ఇప్పటి వరకు ఎవరూ లేకపోవడం గొప్ప విషయం.
నమ్మలేకపోతున్నాను
ప్రపంచంలోని అత్యంత కఠినమైన భూభాగాలలో ఒకదానిపై జరిగిన భీకరమైన, కష్టమైన ప్రయాణాన్ని వివరిస్తూ ''నా పరుగు ముగింపులో నమ్మశక్యం కానిదిగా అనిపిస్తుంది. నేను ప్రయాణాన్ని పూర్తి చేయగలిగానా అని ఆశ్చర్యపోయాను. శిక్షణ తీసుకునే సమయంలో నేను చేయగలనా లేదా అనే సందేహం వచ్చింది. ఈ పరుగు నేను అనుకున్నదానికంటే ఎంతో కఠినంగా అనిపించింది'' ఆమె చెప్పింది.
కఠినమైన శిక్షణ
సుఫియా 'హిమాలయన్ అల్ట్రా రన్ ఎక్స్పిడిషన్' కోసం 20 రోజుల పాటు శిక్షణ తీసుకుంది. ఇందులో భాగంగా మార్గంలోని వివిధ ప్రాంతాలలో నడిచింది. ఆ ప్రదేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఎత్తైన ప్రదేశాలకు పరుగులు పెట్టడానికి అలవాటుపడింది. ముఖ్యంగా ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు ఎలా తట్టుకోవాలో నేర్చుకుంది. తన దారిలో ఆర్మీ అధికారులతో, స్థానికులతో మాట్లాడింది. శిక్షణా కాలంలోనే ఇది అనేక సవాళ్లతో నిండిన పరుగు అని అర్థం చేసుకుంది. అన్నింటికీ సిద్ధమై పరుగు మొదలుపెట్టినప్పటికీ అనుకున్నట్టుగా పనులు జరగలేదు. రోV్ాతంగ్ పాస్‌లో మొదటి అధిరోహణ ఆమెకు ఓ సవాలుగా మారింది.
స్పృహ కోల్పోయింది...
''ఇది ఒక మైండ్ గేమ్. శారీరకంగా ఎంత కష్టపడి శిక్షణ పొందుతున్నామో మన మనసు కూడా ఈ పరుగు కోసం అంతే శిక్షణ పొందాలి'' అంటుంది సూఫియా. ఆమె ధూళి పర్వతాల గుండా నడవవలసి వచ్చింది. హిమపాతం గుండా పరుగెత్తవలసి వచ్చింది. ఒకానొక సమయంలో ఆమె ఆక్సిజన్ స్థాయి 56కి పడిపోయింది. దాంతో స్పృహకోల్పోయింది. ఆమె బృందం సుఫియాకు సహకరించింది. మూడు నుండి నాలుగు గంటలపాటు నిద్రించిన తర్వాత తన యాత్రను సమయానికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ రాత్రంతా పరుగును కొనసాగించింది.
పరిమితులను అధిగమించు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి పరుగు తర్వాత సూఫియాకు దుస్తులు, శిక్షణను అందించే అమెరికన్ స్పోర్ట్స్ పరికరాల కంపెనీ అండర్ ఆర్మర్‌తో జతకట్టింది. ''నా పరిమితులను అధిగమించమని వారు నన్ను సవాలు చేశారు. నా భాగస్వామి వికాస్, నా కోచ్, వాలంటీర్ రన్నర్లు, ఇతరులు నా సాహసయాత్రలో నాతో పాటు ఉన్నారు'' అని ఆమె చెప్పింది. అవసరమైనప్పుడల్లా ఆమెకు వైద్య సహాయం అందించిన ఆర్మీ అధికారులు, మార్గంలో ఉన్న ప్రజల మద్దతుతో ఆమె తన పరుగులో మునిగిపోయింది.
వసుధైవ కుటుంబం కోసం...
ఫిజికల్ ఫ్రంట్‌లో సాహసయాత్రలో సహాయం చేయడానికి సుఫియా బలం, కోర్ కండరాల శిక్షణపై ఆధారపడింది. మానసిక శక్తి కోసం యోగా, ప్రాణాయామం అభ్యసిస్తుంది. 2024లో వసుధైవ కుటుంబం (ప్రపంచం ఒకే కుటుంబం) సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరిగెత్తాలని సూఫియా లక్ష్యంగా పెట్టుకుంది. అంతకు ముందే అన్వేషించడానికి ఆమెకు అనేక ఇతర పరుగులు ఉన్నాయి.. వెళ్ళడానికి మైళ్ళు ఉన్నాయి.
ప్రకృతి మారుతుంటే...
నేను కూడా భూమిపై ఉన్న కొన్ని సహజమైన, అత్యంత అందమైన ప్రాంతాల వెంట నడుస్తున్నాను. పర్వతాల రంగు మారడం చూశాను. నా ముఖం మీద మంచు తునకలు కనిపించాయి. ప్రతి కొన్ని కిలోమీటర్లకు ప్రకృతి మారుతుంటే విస్మయంతో చూశాను. చివరి రోజున అత్యంత లోతువైపు పరుగు నాకు అత్యంత ఉత్కంఠభరితమైన వీక్షణలను అందించింది. ఉప్షి లోయ, పచ్చదనం, పర్వతాలు, ప్రవహించే నది నాకెంతో ఉత్సాహాన్ని అందించాయి. దాంతో మరింత శక్తిని కూడగట్టుకొని ఆనంద భావనతో నా పరుగును త్వరగా పూర్తి చేయగలిగాను
పరిమితులు అధిగమించేందుకు
సందేశాన్ని వ్యాప్తి చేయడానికి పరుగు మంచి మార్గం అని నేను అనుకున్నాను. నా పరిమితులను అధిగమిస్తూ దేశాన్ని అన్వేషించాలని నిర్ణయించుకున్నాను. పోటీ చేయడానికి లేదా ఏ రికార్డులను బద్దలు కొట్టడానికి పరిగెత్తలేదు. ప్రతి సవాలుతో నా సామర్థ్యాలను పరీక్షించాలనుకుంటున్నాను. ఆశ, ఏకత్వం, సమానత్వం, శాంతి, మానవత్వం సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి వ్యాప్తి చేయాలనుకుంటున్నాను. పరిమితులు మనసులో మాత్రమే ఉన్నాయి. నేను ప్రజలను, ముఖ్యంగా స్త్రీలు తమ బంధనాల నుండి బయటకు రావడానికి, వారి మనసులోని అడ్డంకులను తొలగించడానికి, వారి కలలను నెరవేర్చుకునేలా ప్రేరేపించా లనుకుంటున్నాను.
- సూఫియా ఖాన్
- సలీమ