Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డయాబెటిస్ కంట్రోల్ కాకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలొస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు తరచూ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తప్పవు. ఏం తిన్నా... బ్లడ్ షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని సహజసిద్ధంగా కంట్రోల్ చేసేదై ఉండాలి. అందుకు చాలా రకాల ఆహార పదార్థాలున్నాయి. వాటిలో పసుపు చాలా కీలకమైనది. పసుపుతో ఆరోగ్య ప్రయోజనాలకు లెక్క లేదు. చక్కటి లైఫ్‌స్టైల్‌తో పాటూ.... చక్కటి ఆహారం తీసుకుంటూ పసుపును కూడా డైట్లో చేర్చుకుంటే డయాబెటిస్‌పై చక్కటి ప్రభావం చూపించి... బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రణలో ఉంచుతుంది. మీకు ఈ మధ్యే టైప్ 2 డయాబెటిస్ వచ్చి ఉంటే మీ లైఫ్స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. చక్కటి హెల్తీ లైఫ్‌స్టైల్‌తో డయాబెయిస్ వల్ల ఏర్పడబోయే తీవ్రమైన పరిణామాల నుంచీ తప్పించుకోవచ్చు.
పసుపులో ఔషధ గుణాలు ఎక్కువ. 2013లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం టర్మరిక్ (పసుపు)లో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం... బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్‌ని తగ్గించగలదు. డయాబెటిస్ వల్ల తలెత్తే ఇతర సమస్యల్ని కంట్రోల్ చెయ్యగలదని తేలింది.
కర్క్యుమిన్ మన శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. అందువల్ల రక్తనాళాల్లో కొవ్వు కరిగి శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అది డయాబెటిస్ తగ్గేందుకు, కంట్రోల్ అయ్యేందుకూ వీలు కలిగిస్తుంది.
మన శరీరంలోని పాంక్రియాటిక్ కణాల పనితీరును మెరుగుపరిచే శక్తి కర్క్యుమిన్‌కి ఉంది. ఈ కణాలనే బీటా సెల్స్ అంటారు. వీటిని పునరుత్పత్తి చెయ్యడంలో కర్క్యుమిన్ ఉపయోగపడుతుంది.
కాలేయం (లివర్)లో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడంలో పసుపు బాగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని ఇది పెంచుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అందువల్ల అన్నీ వంటల్లో పసుపు వాడటం మేలు. కావాలంటే ఓ గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఎంతో ప్రయోజనం.
పసుపు మంచిది కదా అని ఇష్టమొచ్చినట్లు వాడలేం కదా. మామూలుగా వంటల్లో చిటికెడు వేస్తారు అది ఓకే. వంటల్లో పసుపు వాడని వారు ఖాళీ పొట్టలోకి దాన్ని వెళ్లేలా చేసుకోవాలి. రోజుకు 500 నుంచి 2000 మిల్లీగ్రాముల పసుపును తినాలి. డైరెక్టుగా తినలేకపోతే పాలలో వేసుకొని తాగొచ్చు. లేదా ఏదైనా తినే పదార్థంలో పసుపును కలిపేసుకొని తీసుకోవాలి.
షుగర్ వ్యాధి ఉన్నవారు తప్పనిసరిగా ఏం చేసైనా పసుపు మీ డైట్లో ఉండేలా చేసుకోవాలి. అయితే పసుపును ఎంత వాడాలి, ఎలా వాడాలి అనే విషయంలో డాక్టర్ని కలిసి వాళ్ల సూచనలు పాటిస్తే బెటర్. ఎందుకంటే డయాబెటిస్ ఏ స్థాయిలో ఉందో, దాన్ని బట్టి ఎంత పసుపు వాడాలన్నది ఆధారపడి ఉంటుంది.