Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బచ్చలి కూర... ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ ఆకు కూరతో అనేక రకాల వంటలు చేసుకోవచ్చు. తరచుగా ఈ ఆకు కూర ఆహారంలో తీసుకుంటే రక్తం వృద్ధి బాగా కలిగి మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మరి ఆ వంటలు ఏమిటో ఈ రోజు మనం తెలుసుకుందాం.
బచ్చలి కూర, వడియాలతో
కావాల్సిన పదార్ధాలు: బచ్చలి కూర - రెండు కట్టలు(కుటుంబం లోని సభ్యులను బట్టి కూర ఎక్కువ తీసుకోవాలి, నేను చెప్పేది ఇద్దరికి సరిపోతుంది), వడియాలు - పది, నూనె, పసుపు, ఉప్పు, కారం, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు.
తయారు చేయువిధానం: ముందుగా బచ్చలి కూరను బాగా కడిగి ఆరబెట్టాలి. తడి ఆరిపోయిన తర్వాత సన్నగా తరుక్కుని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. వడియాలని వేయించి ఒక పక్కన పెట్టుకోవాలి. ఉడికిన బచ్చలి కూరను నీళ్లు లేకుండా బాగా పిండేసి ఒక బాండీలో నూనె పోసి అందులో పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత బచ్చలి కూరను వేసి వేయించాలి. పచ్చివాసన పోయాక దాంట్లో వేయించి పెట్టుకున్న వడియాలు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలు వేయించిన తర్వాత దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలియబెట్టాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ మీద నుంచి దించేయాలి. ఇది అన్నంలోకి బావుంటుంది.
బచ్చలి కూర పచ్చడి
కావాల్సిన పదార్ధాలు: బచ్చలి కూర - నాలుగు కట్టలు, చింతపండు గుజ్జు - ఆరు స్పూన్లు, ఉప్పు, పసుపు, నూనె, పోపుదినుసులు, ఇంగువ - సరిపడా, నువ్వులు - రెండు స్పూన్లు.
తయారు చేయు విధానం: బచ్చలి కూరను శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక బాండీలో కొంచం నూనె ఎక్కువ పోసి అది వేడెక్కాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఉప్పు, పసుపు, చింతపండు గుజ్జు, వేయించిన బచ్చలి కూర వేసి ఓ సారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి బావుంటుంది.
బచ్చలి కూర, సొరకాయ పప్పు
కావలసిన పదార్ధాలు: బచ్చలి కూర - మూడు కట్టలు, సొరకాయ ముక్కలు - చిన్న కప్పు, చింతపండు గుజ్జు - ఆరు స్పూన్లు, కంది పప్పు - చిన్న గ్లాసు, ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, నూనె, ఇంగువ, పోపు దినుసులు.
తయారు చేయు విధానం: కందిపప్పుని కుక్కర్లో ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు బచ్చలి కూరని శుభ్రంగా కడిగి తరిగి ఒక గిన్నెలో వేయాలి. అలాగే సొరకాయ ముక్కలు కూడ వేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు మెత్త పడ్డాక అందులో చింతపండు గుజ్జు, ఉడికించిన కందిపప్పుని మెత్తగా చేసి వేయాలి. రెండింటిని బాగా కలిపి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, మెంతి పిండి వేసి బాగా కలియపెట్టి మూడు నిముషాలు పొయ్యి మీద ఉంచి దింపేయాలి. తర్వాత పోపు దినుసులు, ఇంగువ వేసి పోపుపెట్టుకోవాలి. ఇష్టమైన వారు పచ్చిమిర్చి పొడవుగా తరిగి వేసుకోవచ్చు. ఇది అన్నంలోకి బావుంటుంది.
బచ్చలి పొడి కూర
కావాల్సిన పదార్ధాలు: బచ్చలి కూర తరుగు - ఐదు కప్పులు, కంది పప్పు - కప్పు, ఉప్పు, కారం, పసుపు, నూనె, పోపుదినుసులు, కరివేపాకు.
తయారు చేయువిధానం: బచ్చలి కూర తరుగు, కందిపప్పు కలిపి నీళ్లు పోసి స్టవ్ మీద ఉడికించుకోవాలి. కందిపప్పు బద్దగానే ఉండాలి. దాన్ని మెత్తగా చేయకూడదు. కందిపప్పు మెత్తపడ్డాక పొయ్యి మీదనుంచి దించి చల్లారాక అందులో నీరు కనుక ఉంటే ఒంపేసి ఒక బాండీలో నూనె పోసి అందుకో పోపు దినుసులు వేసి ఇంగువ, కరివేపాకు వేసి అవి వేగాక బచ్చలి కూర, కందిపప్పు నీళ్ళు లేకుండా గట్టిగా పిండేసి బాండీలో వేయాలి. కొంచం వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. రెండు నిమిషాలు బాగా కలిపి దించేయాలి. ఇది అన్నంలోకి బావుంటుంది. దీనిలోకి పచ్చి ఉల్లిగడ్డ కొనుక్కుని తింటే చాలా చాలా బాగుంటుంది.
- పాలపర్తి సంధ్యారాణి