Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పద్మ భూషణ్, పద్మ విభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను సొంతం చేసుకోవడం అంత సులువు కాదు. అయితే, ఈసారి ఆ పద్మాలకే వన్నె తెచ్చారు మహిళామణులు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వ్యక్తులకు భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో 29 మంది మహిళలున్నారు. వీరిలో అడవిని సృష్టించి దానితోనే తన జీవితాన్ని మమేకం చేసుకుని వనదేవతగా మారిన తులసీగౌడ, ట్రాన్స్‌జెండర్‌గా మారినందుకు కుటుంబం నుంచి వెలివేయబడి.. సమాజంలో ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొని నృత్యం ద్వారా వేలాది ప్రదర్శనలి జీవితంలో నిలబడిన మంజమ్మ మరొకరు. అలాగే, కడు పేదరికంలో పుట్టి.. కనీసం రెండుపూటలా తిండి కూడా లేని దుర్భర పరిస్థితుల నుంచి వచ్చి.. టోక్యో ఒలంపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశప్రతిష్టను పెంచారు హాకీ మహిళా జట్టు కెప్టెన్ రాణి రాంపాల్. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన తాను మహిళా రైతుగా మారి పసుపులో కొత్త వంగడం సృష్టించి.. ఎంతో మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు మేఘాలయకు చెందిన ట్రినిటీ సైవో. ఇలా పద్మాలు అందుకున్న వారు సమాజానికి చేసిన గొప్ప సేవలు, సాధించిన విజయాలేంటో చూద్దాం..
నాడు యాచించిన చేతుల్లో నేడు పద్మశ్రీ
చిరునవ్వుతో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కళాకారిణి మంజమ్మ జోగతి. ఆ నవ్వుల వెనుక కష్టాల కడలి దాగి ఉంది. కన్నవాళ్లు ఆమెను కాదనుకున్నారు.. సమాజం చీదరించుకుంది. కడుపు నింపుకోవడం కోసం చేయి చాచి యాచించింది. ఎన్నో అవమానాలను భరించి ముండ్ల బాటను దాటుకుంటూ పద్మశ్రీ వరకు చేరుకుంది.
కర్నాటకలోని బళ్లారి జిల్లాలో జన్మించిన మంజమ్మ జోగతి అసలు పేరు మంజునాథ శెట్టి. 10వ తరగతి వరకు చదువుకుంది. తనకు 15ఏండ్ల వయసున్నప్పుడు శరీరంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. మంజునాథ తాను అబ్బాయి కాదు అమ్మాయి అని గుర్తించాడు. కొడుకు పరిస్థితి తెలిసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అతడిని 'జోగప్ప'గా మార్చారు. జోగప్ప అనేది అతి పురాతన హిజ్రాల వర్గం. వీరు దేవుడిని పెండ్లి చేసుకుని జీవితాన్ని దేవుడికి అంకితమిస్తారు. అలా మంజునాథ శెట్టి కూడా దేవుడిని పెండ్లి చేసుకుని మంజమ్మ జోగతిగా మారింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వలేదు. పని చేసుకొని బతుకుదామంటే.. అదీ దొరకలేదు. దాంతో కడుపు నింపుకోవడం కోసం చీర కట్టుకుని వీధుల్లో యాచించింది. ఓ దశలో వేధింపులు భరించలేక ప్రాణం తీసుకోవాలనుకుంది. కానీ ఆమె జీవితంలో వెలుగులు నింపేందుకు 'కళ' కొత్త జీవితాన్ని పరిచయం చేసింది.
మంజమ్మ.. కాలవ్వ జోగతి అనే కళాకారిణి వద్ద జోగతి నృత్యం నేర్చుకుంది. కాలవ్వ బృందంలో చేరి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చింది. కాలవ్వ మరణం తర్వాత ఆ బృందానికి తానే నాయకత్వం వహించి జోగతి నృత్యానికి ప్రజాదరణ తీసుకొచ్చేందుకు కృషి చేసింది. 2010లో కర్నాటక ప్రభుత్వం మంజమ్మను రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది. 2019లో కర్నాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. ఈ పదవి చేపట్టిన తొలి ట్రాన్స్‌జెండర్‌గా అరుదైన గుర్తింపు సాధించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కళల విభాగంలో పద్మశ్రీకి ఎంపిక చేసింది. పద్మ అవార్డు అందుకున్న రెండో ట్రాన్స్‌జెండర్ ఈమే కావడం విశేషం. అంతకుముందు 2019లో తమిళనాడుకు చెందిన ప్రముఖ నర్తకి నటరాజ్ ఈ పురస్కారం అందుకున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు సాధించారు. అయితే పద్మశ్రీ అందుకోవడానికి రాష్ట్రపతికి నమస్కరిస్తూ వెళ్లిన మంజమ్మ.. ఆయనకు తన చీర కొంగుతో పలుమార్లు దిష్టి తీసి అందరి మెప్పు పొందింది.
సంప్రదాయం ఉట్టి పడిన తులసీగౌడ
సంప్రదాయ వస్త్రధారణలో.. ఓ సామాన్యురాలిలా వచ్చి రాష్ట్రపతి చేతుల మీదుగా పర్యావరణ సేవకుగాను పద్మశ్రీ అవార్డు అందుకున్న గొప్ప మానవతావాది తులసీ గౌడ. కర్నాటకకు చెందిన 72 ఏండ్ల తులసీ గౌడ.. హలక్కీ తెగకు చెందిన గిరిజన మహిళ. పేద కుటుంబానికి చెందిన ఆమె చదువుకోలేదు. అయినప్పటికీ ఔషధ మొక్కలు, భిన్నమైన జాతుల గురించి విశేషమైన జ్ఞానం ఉన్న వ్యక్తిగా అభివర్ణిస్తుంటారు. ఆమెకు రెండేండ్ల వయసులోనే తండ్రి మరణించారు. పూట గడవడానికి రోజూ తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. చిన్న వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. కొన్నాండ్లకే భర్త మరణించాడు. ఆ బాధ నుంచి బయటపడటానికి దగ్గర్లోని అడవిలో గడిపేది. అలా ఆమెకు అడవితో అనుబంధం ఏర్పడింది. ఎన్నో రకాల మొక్కలు నాటేది. అడవినే సృష్టించి ప్రకృతితో మమేకమయ్యారు. వనదేవతగా గుర్తింపు పొందారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చూసి అటవీ శాఖ అధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. ఆమె అంకితభావం చూసి తర్వాత శాశ్వత ఉద్యోగిగా నియమించారు. పద్నాలుగేండ్ల పాటు అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ప్రకృతిపై ఆమెకున్న అంతులేని ప్రేమనే ఆమెకు ఈ గుర్తింపు తీసుకొచ్చింది. ఆమె వస్త్రధారణ, నడవడిక అడవి తల్లికి ఆడబిడ్డగా అనిపిస్తుంది.
రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ట్రినిటీ సైవో
తాను వ్యవసాయం చేస్తూ.. మరోవైపు ఎందరో రైతులకు మార్గదర్శిగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపారు మేఘాలయాకు చెందిన మహిళా గిరిజన రైతు ట్రినిటీ సైవో. ఆమె సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈమె ఆరుగులు పిల్లల తల్లి, పాఠశాల ఉపాధ్యాయురాలు. మేఘాలయలోని వెస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలోని ములెV్‌ా గ్రామం తనది. నిరక్షరాస్యులైన మహిళల సంపాదనను పెంచడానికి సేంద్రీయ వ్యవసాయం పద్ధతులను నేర్చుకోవడంలో శిక్షణ ఇచ్చారు. పసుపులో సరికొత్త వంగడం లకాడోంగ్(శ్రీaసaసశీఅస్త్ర)ను పండించి.. అక్కడి రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఈ రకం పసుపుకు ప్రపంచ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. అందువల్ల ఈ పంటపై రైతులకు అవగాహన కల్పించి.. రైతులు ఆర్థికంగా స్థిరపడేలా కృషి చేశారు. 800 మంది రైతులు తమ గ్రామాల్లో ఈ రకం పసుపు పంట సాగు చేశారు. ఈమెను అక్కడి వారు 'టర్మరిక్ ట్రినిటీ' అని పిలుస్తారు. ఆమె ములీV్‌ా నుంచి 25 మంది రైతులతో తన ప్రయాణాన్ని ప్రారంభించి స్పైసెస్ బోర్డు నుంచి మద్దతు పొందారు. ప్రస్తుతానికి ట్రినిటీ సమాఖ్యలో 100కి పైగా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఇది మాత్రమే కాదు ఫెడరేషన్ లకడాంగ్ రకాన్ని ఈశాన్య రాష్ట్రాలకు, దక్షిణాన కేరళ, కర్నాటకకు ఎగుమతి చేస్తున్నారు.
హాకీ రాణి రాంపాల్..
జపాన్ వేదికగా సాగిన ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత మహిళల హాకీ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్. పురుషుల జట్టుతో సమానంగా పోరాడారు మన మాణిక్యాలు. భారత మహిళల హాకీ జట్టుకు పూర్వ వైభవాన్ని సాధించడంలో కెప్టెన్ రాణి రాంపాల్‌ది కీలక పాత్ర. అందుకుగాను ఈమెకు కూడా పద్మశ్రీ వరించింది.
రాణి రాంపాల్ స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర జిల్లాలోని షాహాబాద్. తండ్రి ఎద్దులబండి నడిపించేవాడు. తల్లి పని మనిషి. తొలిరోజుల్లో విరిగిన హాకీ స్టిక్‌తో ప్రాక్టీస్ చేసేవారు. రోజూ రెండు పూటల భోజనం చేయడం అదృష్టంగా భావించే కుటుంబం నుంచి వచ్చిన రాణి దేశం గర్వించేలా చేశారు. మహిళా హాకీ జట్టును ఒలింపిక్స్ సెమీస్‌కు చేర్చారు. హాకీ మ్యాచ్‌లో ప్రాక్టీస్ చేయాలంటే స్కర్ట్ తప్పనిసరి. దాన్ని ధరించడానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తొలి రోజుల్లో సల్వార్ కమీజ్‌లో ప్రాక్టీస్ చేశారు. ఇలా ప్రాక్టీస్‌లో పాల్గొనేలా కోచ్‌ను ఒప్పించడానికి విశ్వ ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని రాణి రాంపాల్ ఓసారి చెప్పారు. కేరీర్లో ఎదగడానికి కోచ్ అందించిన సహకారాన్ని విస్మరించలేనిదని రాణి రాంపాల్ అన్నారు. తనకోసం హాకీ కిట్‌ను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. 15 ఏండ్ల వయసులో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం 2017లో సొంత ఇంటిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు.
భారత్ బ్యాడ్మింటన్‌కు వన్నె తెచ్చిన సింధు
భారత్ బ్యాడ్మింటన్‌కు వన్నె తెచ్చిన తెలుగు 'సింధూరం'ను దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుపొందిన పీవీ సింధు.. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణిగా ఘనత సాధించింది.
మృదంగంలో సుమతి..
భారతీయ సంగీత వాయిద్యరంగంలో మృదంగవాద్యాన్ని వృత్తిగా స్వీకరించిన మొట్టమొదటి మహిళా కళాకారిణి నిడుమోలు సుమతి (దండమూడి సుమతీ రామమోహనరావు)ని భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. విజయవాడకు చెందిన సుమతి పదో ఏటనే తొలి కచేరి ఇచ్చారు.
- పి.విజయ