Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పాడనా తెనుగు పాట.. పరవశనై.. నే పరవశనై.. మీ ఎదుట.. మీ పాట'' అని ఆమె గొంతు నుండి జాలువారుతుంటే.. సంగీత సాగరంలో తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది. 'ఇది మల్లెల వెళయనీ..ఇది వెన్నెల మాసమనీ', 'మనసు పరిమలించెనె..తనువు పరవశించెనె.. నవ వసంత గానంలో' పాటలు ప్రేమికుల హృదయాలను ఆకాశవీదుల్లో విహరింపచేస్తాయి. 'ఆడగక ఇచ్చిన మనసె ముద్దు.. అంది అందని అందమె ముద్దు..' అంటూ సాగె పాట సమ్మోహన మలయమారుతంలా రంజింపచేస్తుంది. 'ఆకులో ఆకునై.. పువ్వులో పువ్వునై.. కొమ్మలో కొమ్మనై.. నునులేత రెమ్మనై..' అంటూ సాగె పాట చందనపు చల్లదనంలా.. తన్మయ తరంగం అవుతుంది. 'లాలీ.. లాలీ.. లాలీ.. లాలీ.. వటపత్ర సాయికి వరహాల లాలీ నా జీవనేత్రునికి రతనాల లాలీ' పాట ఏడుస్తున్నపాపలను జోలపాటలా.. జో కొడుతుంది. 'సీతారాముల కళ్యాణం చూతము రారండి' అంటూ సాగే పాట ఎక్కడ పెళ్లి జరిగినా.. ఎవరింట పెళ్లి బాజా మొగినా ఆ పాత మధురమైన పాట అక్కడ వినిపిస్తుంది. ఆమె గానానికి ఇది కొలమానం అని చెప్పలేము. దశాబ్దాలు గడచినా, తరాలు మారినా ఆమె
పాటని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. చూడగానే భారతీయ సంప్రదాయ కట్టుబొట్టుతో కనిపించే తెలుగింటి కోయిల ఆమె. యువ గాయనీ, గాయకులకు ఎందరికో ఆమె స్పూర్తిప్రదాత. పసందైన గొంతుతో.. పదునైన పాటలతో.. పండు వెన్నెలలా.. పసిపాప బోసినవ్వులా, ప్రేక్షకుల అభిరుచికి తగ్గ స్వర రచనని అందించిన గాన కోకిల. శ్రోతల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటల తోటలో పారిజాతం పి. సుశీల. ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా ఆమె పరిచయం మానవి పాఠకుల కోసం...
పులపాక సుశీల... విజయనగరంలో సంగీతం, సాహిత్యాలకు నిలయమైన కుటుంబంలో 1935, నవంబర్ 13న జన్మించారు. ఆమె తండ్రి పి.ముకుందరావు, తల్లి శేషావతారం. ఈమ తండ్రి వృత్తి లాయర్, ప్రవృత్తి కళాకారుడు. ఆయనకి శాస్త్రీయ సంగీతమంటే ఎనలేని అభిమానం. స్వయంగా వీణా విద్వాంసులు కూడా. తల్లిదండ్రులు ఇద్దరూ సంగీతారాధకులే కావడంతో తమ కుమార్తె శాస్త్రీయ సంగీతంలో ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మిలా పేరు తెచ్చుకోవాలని కలలు కనేవారు. అయితే సుశీల మాత్రం శాస్త్రీయ సంగీతం కాకుండా లలిత సంగీతం, సినీ సంగీతంపై మక్కువ పెంచుకుని లతా మంగేష్కర్, పి.భానుమతి, పి.లీల, జిక్కీ పాడిన పాటలు పాడుతుండేది. తండ్రి కోరిక మేరకు ద్వారం భావనారాయణ వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకున్నారు.
సంగీత ప్రావీణ్యాన్ని గుర్తించి
పాఠశాల విద్య పూర్తైన తర్వాత విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో చేరి గాత్రంలో 'డిప్లొమా ఇన్ మ్యూజిక్' చేసారు. ఆ తర్వాత విజయనగరంలోనే కాకుండా చిత్తూరు, మద్రాసు, విజయవాడ, హైదరాబాద్ లాంటి పలు ప్రాంతాల్లో కచేరీలు చేశారు. మద్రాసు మ్యూజిక్ అకాడమీలో కోర్సు చేయడానికి వెళ్ళిన సుశీలలోని సంగీత ప్రావీణ్యాన్ని గుర్తించి ఆ అకాడమీ అధినేత ప్రోత్సాహాన్ని అందించారు. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు అలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. రేడియోలో బందాకనక లింగేశ్వరరావు, న్యాపతి రాఘవరావు, మాదవపెద్ది సత్యం ప్రోత్సాహంతో సుశీల చిన్నపిల్లల బాలానందం కార్యక్రమాల్లో పాటలు పాడటం ప్రారంభించారు.
గాయనిగా వెండితెరకు
ప్రముఖ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు తన కొత్త చిత్రంలో పాటల స్వరకల్పన కోసం కొత్త గాయకులను వెతుకుతూ రేడియో స్టేషన్‌కు ఫోన్ చేసి రేడియోలో పాడుతున్న ఐదుగురి అత్యుత్తమ గాయకుల పేర్లు పంపమని కోరారు. ఆ జాబితా నుండి సుశీలను కూడా ఎంపిక చేసి 'పెట్రతారు' తమిళ చిత్రంలో ఏ. ఎమ్. రాజాతో కలిసి 'ఎదుకు అలత్తారు' అనే యుగళ గీతం, తెలుగులో 'కన్నతల్లి' సినిమాలో ''ఎందుకు పిలిచావెందుకు'' యుగళగీతం పాడించడంతో సుశీల గాయనిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత చెట్టియార్ సుశీలను పిలిపించి మూడు సంవత్సరాల కోసం ఎ.వి.ఎం. స్టూడియోలో నెలవారీ జీతంతో పాడటం కోసం కాంట్రాక్టు రాయించుకున్నారు. ఈ కాంట్రాక్టు పూర్తి అయ్యాక 1954లో 'మాడిదున్నో మారాయ' అనే చిత్రంతో కన్నడ భాషాచిత్రాలలోకి ప్రవేశించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పాటలు పాడి తిరుగులేని గళనాయకిగా గుర్తింపు పొందారు. సినీ సంగీత పరిశ్రమను శాసిస్తున్న పి. లీల, ఎం.ఎల్. వసంతకుమారి, జిక్కి వంటి ప్రముఖ మహిళా గాయకుల ఆధిపత్యంతో 1950వ దశకంలో సంగీత పరిశ్రమలోకి కొత్తవారు ప్రవేశించడం అంత సులభం కాదు. అయినా సుశీల తన ప్రత్యేకమైన స్వర మాధుర్యంతో గాయనిగా నిలదొక్కుకున్నారు.
అన్ని చిత్రాలలో సుశీల పాటలు
అన్నపూర్ణ సంస్థ తొలిసారి కె. వి. రెడ్డి దర్శకత్వంలో 'దొంగరాముడు' చిత్రంలో కథానాయిక సావిత్రికి నేపథ్య గాయనిగా జిక్కీని ఎంపిక చేసుకుని పెండ్యాల సంగీత సారథ్యంలో పాటలు రికార్డ్ చేసి కథానాయకుని చెల్లెలు పాత్రధారిణి జమునకు గాయని కోసం వెతుకుతున్న సమయంలో సుశీల గురించి తెలిసి జమున పాత్రకు నేపథ్య గాయనిగా సుశీలను ఎంపిక చేశారు. ఆ తర్వాత 1955 సంవత్సరం 'విజయా' సంస్థ సుశీల చేత పాడించిన 'మిస్సమ్మ' సినిమాలో 'బృందావనమది అందరిది' తో పాటు ఆమె పాడిన మిగతా పాటలు కూడా అత్యంత ప్రజాదరణ పొందడంతో ఈ సంస్థ 'మాయాబజార్', 'అప్పుచేసి పప్పుకూడు', 'గుండమ్మకథ', 'సి.ఐ.డి' చిత్రాలలో పాడించారు. ఇదే సంవత్సరం విడుదలైన తమిళ చిత్రం 'కనవనే కాన్ కందా దేవం'లో పాడిన పాటలకు ఆమెకు తమిళనాడులో మంచి పేరు తెచ్చింది. 1955 నుండి 85 వరకు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాలలో సుశీల పాడే పాటలకు సినీ సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు వచ్చింది. పౌరాణిక పాటలకు ప్రసిద్ధి పొందిన తమిళ సంగీతకారులు విశ్వనాథన్ - రామమూర్తి ద్వయం, తమిళ సినిమాల కోసం పాటలను సుశీల స్వరానికి అనుగుణంగా రాశారు. తెలుగులో ఘంటసాల, తమిళంలో టి.ఎం. సౌందరరాజన్, కన్నడలోని పి.బి. శ్రీనివాస్‌తో కలిసి ఆమె పాడిన యుగళగీతాలు దక్షిణ భారత సంగీత పరిశ్రమలో యుగళ గీతాల కొత్త శకాన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత సౌందరరాజన్, విశ్వనాథన్, రామమూర్తి ద్వయంతో కలిసి వందల పాటలు పాడింది. 'ఎడకల్లు గుద్దాడ మేలే' అనే కన్నడ చిత్రంలో సుశీల పాడిన పాట 'విరాహా నోవు నూరు తారాహా' కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా భారతీయ సినిమాలోని టాప్ పది పాటల జాబితాలో ఒకటిగా చోటు సంపాదించి సంచలనం సృష్టించింది. నటి జయంతితో తీసిన సినిమాలలో ఆమె పాడిన పాటల కలయిక కర్ణాటకలో బాగా ప్రాచుర్యం పొందాయి. 1960వ సంవత్సరంలో సుశీల 'సీత' చిత్రానికి వెంకటేశ్వరన్ దక్షిణామూర్తి స్వరకల్పనతో మలయాళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి జి.దేవరాజన్, ఎమ్.కె. అర్జునన్ వంటి మలయాళ స్వరకర్తలతో ఆమె అనేక విజయవంతమైన పాటలను పాడింది. కె.జె. యేసుదాస్‌తో కలిసి సుశీల అనేక మలయాళ యుగళగీతాలను పాడింది. 1965లో ఎమ్.ఎస్.వి. రామమూర్తితో అనుబంధం విడిపొయిన తరువాత కూడా, ఎమ్. ఎస్. విశ్వనాదన్ సుశీలతో అనుబంధం కొనసాగించాడు.
ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌గా
1968 నవంబరు 29న విడుదలైన 'ఉయర్ధ మణితన్' తమిళ చిత్రం రంగస్థల నాటకంలాగా 125 రోజులకు పైగా కమర్షియల్‌గా విజయవంతమైంది. ఈ చిత్రంలో ఎం.ఎస్. విశ్వనాధన్ స్వరకల్పన చేసిన 'పాల్ పోలేవ్' పాట గాత్రం చేసిన సుశీలకు 16వ జాతీయ చలన చిత్ర అవార్డులలో 'ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్'గా మొదటి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని 1969లో గెలుచుకుని, జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ గాయకులకు ప్రవేశ పెట్టిన మొదటి అవార్డును సుశీల అందుకున్నారు. అదే పాటకు ఆమె తమిళనాడు రాష్ట్ర అవార్డును కూడా పొందింది. ఆ సమయంలో నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలవబడే 'లతా మంగేష్కర్' సుశీలకు మద్య బలమైన స్నేహం కుదిరింది. సుశీల 'చండిప్రియా' చిత్రంలో జయప్రద చేసిన నృత్యం కోసం 'శ్రీ భాగ్య రేఖ - జననీ జననీ' అనే గానం చేసిన పాట ప్రేక్షకులలో అత్యంత గుర్తింపు పొందింది.
16 భాషల్లో 50 వేలకు పైగా
1970వ దశకంలో సుశీల దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లోనూ అనేక అవార్డులను గెలుచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి హిందీ పాటలను కూడా పాడారు. 16 భాషల్లో 50 వేలకు పైగా, తెలుగులో 12000కి పైగా పాటలు పాడారు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో కలిసి తెలుగులో మొదటి యుగళగీతం పాడారు. ఆమె కె.వి.మహదేవన్ సంగీతంలో 2000 పాటలను, కె. చక్రవర్తి సంగీతంలో 2000కి పైగా పాటలను పాడారు. తమిళంలో ఆమె సినిమా, భక్తిపాటలతో సహా 6000కి పైగా పాటలు పాడింది. ఆమె టి.ఎం.సౌందర రాజన్‌తో కలిసి 1000 యుగళగీతాలు, ఆయన సంగీతంలో 1500కి పైగా పాటలను కూడా పాడారు. కన్నడంలో 5000కి పైగా పాటలను రికార్డ్ చేసింది. ఆమె ఘంటసాల, పి.బి. శ్రీనివాస్‌తో కలిసి అనేక యుగళగీతాలు పాడారు.
కళాకారులకు అండగా
సుశీల డాక్టర్ మోహనరావును వివాహం చేసుకున్నారు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు, జయశ్రీ, శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ గాయనిగా 'ఇరువర్' అనే తమిళ చిత్రంలో ఎ.ఆర్. రహమాన్‌తో కలసి ఆరంగేట్రం చేసింది. తన పేరుతో 2008లో ట్రస్ట్‌ను ఏర్పరచిన సుశీల అర్హులైన సంగీతకారులకు నెలవారీ పెన్షన్లు ఇస్తున్నారు. తన పుట్టినరోజు అయిన ప్రతి నవంబరు 13న సంగీత కచేరీ ఏర్పాటు చేసి, ప్యానెల్ ద్వారా ఎంపిక చేసిన సీనియర్ ఆర్టిస్ట్‌లకు ఈ కార్యక్రమంలో జీవితకాల సాధన అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులను టి.ఎం. సౌందర్యరాజన్, పి.బి.శ్రీనివాస్ లకు, ట్రస్ట్ అవార్డులను ఎస్.జానకి, వాణీ జయరామ్, ఎల్.ఆర్. ఈశ్వరి, పి. జయచంద్రన్, ఎస్.పి. బాలసుబ్రమణ్యం, కె.జె. యేసుదాస్లకు ప్రదానం చేసారు.
- పొన్నం రవిచంద్ర, 9440077499
సీనియర్ జర్నలిస్టు, సినీ విమర్శకులు.