Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది సెప్టెంబరు 18 రాత్రి... మానవ హక్కుల కార్యకర్త, ఆఫ్ఘన్ ఉమెన్స్ నెట్వర్క్ అధ్యక్షురాలు మహబూబా సెరాజ్ ఇంటికి తాలిబాన్ బృందం ఒకటి వచ్చింది. వారు ఆమె పని గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు. బాలికలు, మహిళల కోసం ఆమె నడుపుతున్న ఆశ్రయాలను చూపించాలని డిమాండ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ఇంకా ముగియలేదు. ఎందుకంటే వారు నిరంతరం భయం, అనిశ్చితిలోనే జీవిస్తున్నారు. సెరాజ్ గత 20 ఏండ్ల నుండి అమ్మాయిల కోసం యుద్ధం చేస్తూనేవున్నారు. ఐఎస్ఐ, హక్కానీ నెట్‌వర్క్‌ల ఆధ్వర్యంలో అంతులేని అమెరికన్ దాడులను భరించిన ఆఫ్ఘనిస్తాన్ త్వరలో ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా మారుతుందని హెచ్చరిస్తూ ఆమె ది వీక్ కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ సారాంశం మానవి పాఠకుల కోసం..
మీ ఇంటికి తాలిబాన్లు వచ్చినప్పటి విషయాల గురించి వివరించగలరా?
రాత్రి 9 గంటలకు నా ఇంటికి దాదాపు ఏడు నుండి తొమ్మిది మంది పొడవాటి, బొద్దుగా ఉన్న మనుషులతో నిండిన కారు వచ్చింది. మహిళల కోసం నేను నడుపుతున్న షెల్టర్లను చూడాలనుకుంటున్నామని వారు చెప్పారు. ఇంత అర్థరాత్రి నా ఇంటికి రావడం సరికాదని, వారిని చూసి అమ్మాయిలు విపరీతంగా భయపడుతున్నారని వారికి చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మాయిలు మళ్ళీ మామూలు స్థితికి రావడం కోసం నేను వాళ్ళతో కాసేపు గడపాల్సి వచ్చింది. నా వద్ద ఒక షెల్టర్‌లో 18 మంది, మరో షెల్టర్‌లో 14 మంది మహిళలు ఉన్నారు. వీరిలో అత్యంత చిన్నవారు 14 ఏండ్లు, అత్యంత పెద్దవారు 75 ఏండ్లు పైబడి ఉన్నారు. వీరంతా అనాథలు. ఆదరించే వారు లేక ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. మేం ఎలా పనిచేస్తున్నామో తాలిబాన్లకు తెలియదు.
ప్రభుత్వాధికారులకు ఈ సమాచారం అందించారా?
రాత్రి పూట తాలిబన్లు మా ఆశ్రమానికి వచ్చినపుడు నేను చాలా కలత చెందాను. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇద్దరు తాలిబన్లు షెల్టర్‌లో కూర్చొని వారి పేర్లు, ఇతర వివరాలను అడగుతుంటే అమ్మాయిలకు నచ్చలేదు. మా ఆశ్రమంలోకి ఎప్పుడూ మగవారు రాలేదు. నా ఆశ్రయంలో పనిచేసేవారందరూ స్త్రీలే. పురుషులను అసలు లోపలికి అనుమతించము. ఇలాంటి పరిస్థితుల్లో పభుత్వంలో ఎవరిని సంప్రదించాలో నాకు తెలియదు. ఇకపైనే తెలుసుకుని సమాచారం అందించాలి. ఎందుకంటే ఆశ్రమంలో ఉండేవారికి ఏమీ కాకూడదు. అయితే నేను ఆఫ్ఘన్ మహిళలకు ఎలా సహాయం చేయాలి అనే దాని గురించి మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తాలిబాన్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. వారితో కూర్చుని మాట్లాడాలనుకుంటున్నాను. కానీ అది జరగడం లేదు. మహిళలు ప్రభుత్వంలో చేరవచ్చని, బాలికలు పాఠశాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని తాలిబన్లు చెప్పారు. బాలుర కోసం పాఠశాలలు తెరవబడ్డాయి. తాలిబన్లు బాలికల కోసం పాఠశాలలను తెరవడానికి కృషి చేస్తున్నారని చెబుతున్నారు. అయితే అది జరుగుతుందో లేదో వేచి చూడాలి.
యువతలో డ్రగ్స్ సమస్య ఎలా వుంది? తాలిబాన్లు దీన్ని ఎలా ఎదుర్కోవాలని మీరు భావిస్తున్నారు?
మాదకద్రవ్యాల అలవాటును పారద్రోలగలమని తాలిబాన్లు భావిస్తున్నారు. విచిత్రమేమిటంటే తాలిబాన్లు ఇన్నాళ్లూ మిగతా ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నారు. వీరు వాస్తవికతతో సంబంధాన్ని కోల్పోయారు. డ్రగ్స్ సమస్య ఎందుకు వచ్చిందో, సమాజానికి ఏం చేస్తుందో అర్థం కాదు.
షరియా చట్టాల గురించి మీరేమంటారు?
తాలిబాన్లు నిజంగా షరియా చట్టాల వెనుక నిలబడితే అది మంచిది కాదు. ఎందుకంటే షరియా చట్టం చాలా కఠినమైనది. షరియా చట్టాలను చూసే విధానం, మనందరికీ తెలిసిన కోణంలో జీవితం ఉండదు.
తాలిబాన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతిఘటన ఉద్యమం గురించి మీరు ఏమనుకుంటున్నారు?
ఇది వాస్తవానికి ప్రతిఘటన కాదా లేదా కొంతమంది వ్యక్తుల కోసం ఒక స్థానాన్ని సృష్టించే మార్గమా అనేది నాకు తెలియదు. ప్రతిఘటనలు సాధారణంగా వ్యక్తికి కట్టుబడి ఉండవు. కానీ ఒక వ్యక్తి లేదా ప్రదేశం నుండి ప్రారంభమవుతాయి, పెరుగుతాయి, ఇతర ప్రదేశాలకు తరలిపోతాయి. ప్రస్తుతం ప్రతిఘటన వ్యాప్తి చెందడం నాకు కనిపించడం లేదు. 40 ఏండ్లు ఈ రక్తపాతం కొనసాగుతూనే మనల్ని చంపేస్తోంది. కాబట్టి ప్రతిఘటన అనే ఈ ఆలోచనను విక్రయించడం చాలా కష్టం. అహ్మద్ మస్సూద్ తప్ప మిగిలిన మాజీ ముజాహిద్‌లు చాలా అవినీతిపరులు. వారి చుట్టూ ఎవరూ నిలబడటానికి ఇష్టపడరు.
సెరాజ్ పరిచయం
సెరాజ్ 1948లో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్‌లో రాజవంశంలో పుట్టారు. ఈమె ఒక జర్నలిస్ట్, మహిళా హక్కుల కార్యకర్త. బాలికల కోసం పని చేసేందుకు మలాలై ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఈమె కాబూల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తర్వాత కాలంలో సెరాజ్, ఆమె భర్తను ప్రభుత్వం జైలులో పెట్టింది. విడుదలైన తర్వాత 1977లో యునైటెడ్ స్టేట్స్కు వెళ్లిపోయింది. 2003లో ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి రావడానికి ముందు అక్కడ దాదాపు 26 సంవత్సరాలు ఆమె ప్రవాసంలో నివసించారు. 26 సంవత్సరాల ప్రవాసం తర్వాత ప్రాథమిక పాఠశాలలో 10 శాతం కంటే తక్కువ మంది బాలికలు నమోదు చేసుకున్న సమయంలో మహిళలు, పిల్లల హక్కుల కోసం పని చేసేందుకు ఆమె తనకు ఇష్టమైన ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుండి అవినీతి, మహిళలు, పిల్లల హక్కులను పరిష్కరించడానికి అనేక సంస్థలను స్థాపించారు. ముఖ్యంగా లాభాపేక్షలేని 'ఆఫ్ఘన్ ఉమెన్స్ నెట్వర్క్' స్థాపకురాలిగా ఆమె పిల్లల ఆరోగ్యానికి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి, గృహ హింస బాధితులకు సాధికారత కల్పించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె ఆఫ్ఘనిస్తాన్ అంతటా ప్రసారం చేయబడిన ''మహబూబా సెరాజ్ ద్వారా మా ప్రియమైన ఆఫ్ఘనిస్తాన్'' పేరుతో మహిళల కోసం ఏర్పాటు చేసిన రేడియో ప్రోగ్రామ్‌కు సృష్టికర్త, అనౌన్సర్‌గా మారారు. అలాగే జాతీయ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మహిళలు రాజకీయ చర్చలో భాగం కావాలని ఆమె వాదించారు. ఆగష్టు 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు చాలామందిలా ఆమె అక్కడి నుండి వెళ్ళిపోకుండా మహిళలు, పిల్లలతో కలిసి పని చేయడం కొనసాగించడానికి కాబూల్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్న ఆమె ధైర్య సాహసాలు అమోఘం.
- సలీమ