Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం మనం దేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య మూడున్నర కోట్లకు చేరుకున్నది. కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో టీకా తీసుకోని వారికి గ్యాస్, పెట్రోలు రేషన్ ఇవ్వటం లేదు. ఈ విధంగా ఎక్కువ మంది టీకాలు తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా ఎక్కువ మంది టీకాలు తీసుకుంటున్నారు. రెండు డోసుల టీకాలు తీసుకున్నాక బూస్టర్ డోస్ ఇచ్చే సూచనలున్నాయని భారత్ బయోటెక్ సంస్థ చెబుతున్నది. రెండు డోసుల తర్వాత ఆరు నెలల కాలం ఆగాలి. అమెరికా దేశం ప్రస్తుతం పిల్లలకు వ్యాక్సిన్లు ఇస్తున్నది. మా తమ్ముడి పిల్లలు నిన్న వ్యాక్సిన్ వేయించుకున్నారు అమెరికాలో. డిసెంబర్ తర్వాత కరోనా విజృంభిస్తుందనీ ఇయులో 5 లక్షల మరణాలు సంభవిస్తాయని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడుతున్నది. అంటే మనమెంత జాగ్రత్తగా ఉండాలి. కొంత సడలింపు వచ్చింది గదాని అందరూ మర్చిపోయి ఫంక్షన్లు, పండుగల హడావిడిలో ఉన్నారు. ఇప్పటికీ కరోనా ముప్పు తొలగిపోలేదనే చెబుతున్నారు. కాబట్టి నిపుణుల సూచనను పెడచెవి పెట్టక జాగ్రత్త పడటం మంచిది. మాస్కులు, భౌతికదూరం పాటించటం కుదరటం లేదని జైళ్ళలోని పది లక్షల మంది ఖైదీలను విడుదల చేశారు. మనం జాగ్రత్తగా ఉందాం... క్షేమంగా ఉందాం...
వడియాలతో...
ఈ రోజు వడియాలతో ఏనుగు బొమ్మను చేస్తున్నాను. ఈవారం అంశంగా ఏనుగును తీసుకున్నాను. జంతువులలో భారీ ఆకారం కలిగిన జంతువు ఏనుగు. పెద్ద తొండం, పెద్ద శరీరంతో భూమ్మీద నివసించే అన్ని జంతువులలోకన్నా పెద్ద జంతువు ఏనుగు. ఏనుగులు కష్టపడి పని చేసే జంతువులు. మానవులు ఏనుగులను మచ్చిక చేసుకుని వాటితో పనులు చేయించుకునేవారు. అడవుల్లోని భారీ వృక్షాలను పడగొట్టాలన్నా, వాటిని ఎత్తి వాహనాల్లోకి పెట్టాలన్నా ఏనుగుల సహాయం తీసుకోవాల్సిందే. ఏనుగులను మచ్చిక చేసుకొని రాజులు తమ యుద్ధాలలో ఉపయోగించేవారు. భారతదేశంలోని రాజులు మాత్రమే కాదు, పర్షియా దేశంలోనూ యుద్ధాలలో ఏనుగుల దళాలను ఉపయోగించేవారు. యుద్ధ ఖైదీలను కూడా ఏనుగు పాదాల కింద పడేసి తొక్కించి చంపడానికి ఉపయోగించేవారు. మహారాజులు అడవులలో క్రూర మృగాలను వేటాడటానికి ఏనుగుల మీదనే ప్రయాణిస్తారు. బరువైన చెట్టు దుంగల్ని తరలించడానికి ఏనుగుల్నే ఉపయోగిస్తారు. కేరళలో నేను ఎలిఫెంట్ క్యాంప్‌కు వెళ్ళినపుడు పెద్ద చిన్న దుంగల్ని ఏనుగు ఎంత జాగ్రత్తగా మోసుకెళ్తుందో చూశాను. ఒక చెక్క కింద పడబోతుంటే దాన్ని జాగ్రత్తగా సర్దుకుని పైన పెట్టుకున్నది. జంతువు ఆకారం పెద్దదే గానీ మనసు సున్నితంగా ఆలోచిస్తుంది అనిపించింది నాకు.
వెంటిలేటర్ వేస్టుతో...
కరోనా వల్ల ఆసుపత్రుల్లో వాడే వెంటిలేటర్ల పేరు తెలియని వాళ్ళు లేకుండా పోయారు. ప్రస్తుత తరుణంలో వెంటిలేటర్ పరికరం ప్రజల్లోకి అంతగా చొచ్చుకు పోయింది. నేను కూడా వెంటిలేటర్ పరికరం వాడాక వచ్చే వేస్ట్ మెటీరియల్‌తో బొమ్మలు చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఏనుగు బొమ్మను చేసుకుంటున్నాను. ఏనుగుల్ని దేవాలయాల్లో వాడటం పూర్వకారంలో నుంచి జరుగుతున్నదే. ఊరేగింపుల్లో, ఉత్సవాల్లో ఏనుగుల సేవలను వినియోగించుకుంటారు. దక్షిణ భారతదేశ ఆలయాల్లో ఎక్కువగా ఏనుగుల్ని ఊరేగింపుల్లో ఉపయోగిస్తారు. కంచి, ఉడిపి వంటి చాలా పుణ్యస్థలాల్లో దేవాలయాల ప్రధాన ద్వారాల వద్దనే ఏనుగులు ఉండటాన్ని మనం గమనించవచ్చు. ప్రసిద్ధులైన కవులు, పండితులను గజారోహణం చేయించి ఊరేగించటం పెద్ద సన్మానంగా భావించేవారు. ఆసియా ఏనుగులు, ఆఫ్రికా ఏనుగులు అనే రెండు రకాల ఏనుగులుంటాయి. ఇవి పూర్తిగా శాకాహారం తీసుకుంటాయి.
ఇంజక్షన్ మూతలతో...
నేను ఇంజక్షన్ల సీసాల పైన ఉండే ప్లాస్టిక్ మూతలతో దాదాపు రెండు వేల బొమ్మలు తయారు చేశాను. మొత్తం ఆసుపత్రి వ్యర్థాలతో నయితే నాలుగు వేల బొమ్మల వరకు ఉండొచ్చు. ఈ మూతలు ఎరుపు, నీలం, ఆకుపచ్చ, గులాబీ, వంగరంగు, నిండు ఆకుపచ్చ వంటి అనేక రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలాంటి మూతలతో ఏనుగును తయారు చేశాను. చిన్నప్పుడు మా అబ్బాయి ఏనుగును పెంచుకుందామని తెగ బతిమాలేవాడు. అప్పుడు బులుగురంగు మూతలతో ఒక పెద్ద ఏనుగును తయారుచేసిచ్చాను. దానితో ఏనుగు ఊసు మానేశాడు. నేనీ ఇంజక్షన్ మూతలు వాడినా మీరు మంచినీళ్ళ బాటిళ్ళ మూతలు వాడుకోవచ్చు. జంతు జాలంలోనే అతి పెద్ద జంతువైన ఏనుగును నేను రకరకాల వస్తువులతో తయారు చేస్తున్నాను. ఏనుగులు 70 సంవత్సరాలకు పైబడే జీవిస్తాయి. నేను సందర్శించిన ''ఎలిఫెంట్ కాంప్''లో ఒక్కొక్క ఏనుగుకు ఒక్కొక్క ఇల్లు, ఆ ఇంటి పెరట్లో దాని కిష్టమైన చెట్లు, అటూ ఇటూ తిరగడానికి బోలెండత ఖాళీ స్థలం ఉన్నాయి. ఐదారు ఎనుగుల ఇళ్ళు చూసేసరికే నడిచి నడిచి కాళ్ళు నొప్పెట్టాయినాకు.
తిప్పతీగ ఆకులతో...
మా అపార్టుమెంట్ ఖాళీలో చాలా చెట్లు పెట్టారు. అక్కడ పారిజాతం, మేడి చెట్లు, కాగితం పూలచెట్లు మా బాల్కనీగ్రిల్లో నుంచి నా చేతికి అందుతాయి. పారిజాతం చెట్టు, అశోక చెట్లను చుట్టుకుంటూ తిప్పతీగ అల్లుకున్నది. పారిజాతం ఆకులు, తిప్పతీగ ఆకుల్ని బాల్కనీ నుంచే కోసుకున్నాను. ఈ రెండు రకాలతోనే ఏనుగును చేశాను. బాగా ఎక్కువ నీళ్ళు అందుతున్నాయేమో తిప్పతీగ ఆకులు బాగా పెద్దగా పెరిగాయి. పెద్ద ఆకును మొహంలా అమర్చాను. మరో రెండు ఆకులను చెవులుగా పెట్టాను. చిన్నచిన్న కండ్లు కదా ఏనుగుకు అందుకే నా బొట్టు బిళ్ళలను తెచ్చి కండ్లలా అతికించాను. రెండు పాతిజాతం ఆకులను తొండం వలె అమర్చాను. పారిజాతం ఆకులు కొద్దిగా రఫ్‌గా కోలగా ఉంటాయి. ఇలా ఈ రెండు రకాల ఆకులతో ఏనుగు తయారయింది. ఏనుగుకు హస్తి, గజము, కరి, దంతి అనే ఎన్నో పేర్లున్నాయి.
గన్నేరు పూలతో...
గన్నేరు పూలతో చాలా రంగులు ఉంటాయి. ఎరుపు, గులాబి, తెలుపు రంగుల్లో లభ్యమవుతాయి. వీటిని ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు. ఈ పూలు విషపూరితమైన అపోసైనేసి కుటుంబానికి చెందినవి. ఈ పూలలో ఒలియాండ్రిన్, ఒలియాండిజిన్ అనే రసాయనాలు ఎక్కువగా ఉండటం వలన విషపూరితం అవుతాయి. ఇవి కార్టియాక్ గ్లైకోసైడ్స్గా ప్రసిద్ధి చెందినవి. శ్రీలంకలో వీటిని అలంకార మొక్కలుగా పెంచుతారు. దీనిని అక్కడ 'కానేరు' అంటారు. మా ఇంట్లో తెలుపు, గులాబి రంగుల గన్నేరు చెట్లు ఉన్నాయి. ఈ పూలతో ఏనుగును తయారు చేశాను. దాని శరీరం మధ్యలో బంతి పూలను తుంచి వేశాను. ఆగస్టు 12వ తేదీని ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆసియా ఏనుగులు ఎక్కువగా అంతరించి పోతున్నాయి. దంతాల కోసం ఎక్కువగా వేటాడుతుంటారు. సర్కస్‌లలో బందీగా పెడుతున్నారు. వాటి సంఖ్య నానాటికీ క్షీణించిపోతున్నది.
- డా|| కందేపి రాణిప్రసాద్