Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను హిందువు కాను, ముస్లీంనూ కాను, నాకు చతుర్ణవర్ణాలు, బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు వీటిపై నమ్మకం లేదు. ప్రత్యేకమైన వస్త్రధారణను పాటించడంపై కూడా నాకు నమ్మకం లేదు. 200 ఏండ్ల కిందట ఓ మహిళ ఈ మాటలు రాయగలిగిందంటే ఎవరైనా నమ్ముతారా..? పితృస్వామ్యం, కుల వ్యవస్థ, మతాచారం బలంగా ఉన్న ఆ రోజుల్లో ఆమె అక్షరాలు ఓ బహిరంగ సవాల్ విసిరాయి. రెండు శతాబ్దాల కిందటే ఓ మహిళ ఇంతటి తెగువ చూపించిందంటే ఎవ్వరైనా ఆశ్చర్యపోక మానరు. ఆమె ఎవరో కాదు పీరో ప్రేమణ్... పంజాబీ భాషలో మొదటి కవియిత్రిగా గుర్తింపు పొందిన ఆమె గురించి...
పీరో ప్రేమణ్... ఈ పేరు చాలా మందికి తెలియదు. పీరో అసలు పేరు ఆయూషా అని కూడా కొందరు నిపుణులు చెబుతున్నారు. పీరో ప్రేమణ్ గురించి రాసిన సుర్పీరో అనే పుస్తకం ప్రకారం ఆమె 1832 జన్మించారని తెలుస్తోంది. ఈమె తల్లి చిన్నతనంలోనే చనిపోతే తండ్రితో కలిసి ఆమె తీర్థయాత్రలు చేస్తుండేవారు. ఇలా ఆమె చిన్నతనం నుంచే అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. తన భర్త చనిపోయిన తర్వాత చిన్నతనంలోనే ఆమెను వేశ్యా వృత్తిలోకి బలవంతంగా దింపారు. లాహోర్‌లోని హీరామండిలో ఓ రెడ్‌లైట్ ఏరియాకి ఆమెను అమ్మేశారు. కానీ ఆమె ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది. తర్వాత సాదు గులాబ్దాస్ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో చేరిన కొత్తలో చాలా మంది ఆమెను వ్యతిరేకించారు. తర్వాత కాలంలో ఆ సమస్య సద్ధుమణగటంతో ఆమె అక్కడే నివసించారు.
రెడ్‌లైట్ ఏరియా నుండి తప్పించుకొని
లాహోర్‌లోని హీరామండిల్ నుంచి ఆమె తప్పించుకున్న తర్వాత మత గురువు గులాబ్ దాస్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెకు కవిత్వంపై ఆసక్తి పెరిగింది. కవిత్వం రాయడం ప్రారంభించిన తర్వాత ఆమె పేరు పీరో నుంచి పీరో ప్రేమణ్గా మారింది. గురువు గులాబ్ దాస్ ఆశ్రమంకు వచ్చిన తర్వాత ఆమె చాలా తెలివైన వారని, సన్మార్గురాలని పేరు పొందారు. పీర్ అంటే సెయింట్‌గా భావించారు. ఆమె మహిళ కావడంతో పీరోగా పిలవబడేవారు. ఆమె భక్తికి అంకితమై ఉండేవారు. కాబట్టి కొందరు ఆమెను ప్రేమణ్ అని కూడా పిలిచేవారు. ఆమె తన గురువు సాదు గులాబ్ దాస్‌కు, దేవుడికి అంకితమై పోయారు.
ఎదుర్కొన బాధలే తన కవిత్వం
పీరో ప్రేమణ్కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఆమె సుమారు 160 కవితలు రాశారు. పీరో కవిత్వం అంతా ఆమె ఎదుర్కొన్న బాధలు, ఇబ్బందులపై ఆధారం చేసుకునే ఉంటుంది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రశ్నించాలంటే ఆ రోజుల్లో ఓ విప్లవాత్మక ధైర్యంగానే భావిస్తుంటారు. పీరో సాహిత్యం చదివినవారు ఆమె పితృస్వామ్యానికి, మత చాందసవాదాలకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహిళగా చెప్తారు. చాలా మంది మహిళా రచయితలు తమ భావాలను నిర్భయంగా తెలియజేశారని కొందరు చరిత్ర కారులు చెబుతుంటారు. వారికి స్ఫూర్తి కలిగించిన వారిలో పీరో ప్రేమణ్ కూడా ఉన్నారని అంటున్నారు.
ఓ మతభ్రష్టురాలిగా...
పిరో గురించిన చాలా సమాచారం పందొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో రాసిన 'ఇక్ సౌ సాత్ కఫియాన్' లేదా ''నూట అరవై కాఫీలు (160 కాఫీలు)'' అనే ఆమె స్వీయచరిత్ర పద్యాల నుండి తెలుసుకున్నదే. 160 కాఫీలలో పిరో చాతియన్ వాలాలో గులాబ్ దాస్‌తో కలిసి జీవించడం ప్రారంభించిన తర్వాత తన జీవితంలో జరిగిన సంఘటనల శ్రేణిని వివరించారు. పిరో తనను ఒక ముస్లింగా కూడా పేర్కొన్నాడు. ఆమె చాతియాన్ వాలాకు వచ్చిన తర్వాత హీరా మండి నుండి ''ప్రొఫెషనల్ వార్డెన్లు'' ఆమెను అనుసరించారని, లాహోర్‌కు తిరిగి పంపమని గులాబ్ దాస్‌ను ఒప్పించారని పిరో రాశారు. ఆమె చివరికి లాహోర్‌కు తిరిగి రావడానికి అంగీకరించారు. అక్కడ ఆమె ముల్లాలు, ఖాజీలతో జరిగిన ఘర్షణను వివరించారు. వారు ఆమెను మతభ్రష్టురాలిగా మారడమే కాకుండా తన గురువు మతంలోకి మారారని, తద్వారా కాఫిర్‌గా మారారని భావించారు. పిరో మతభ్రష్టత్వాన్ని లేదా మార్పిడిని తిరస్కరించలేదు. కానీ ఇస్లాంలోకి తిరిగి మారడాన్ని నిరాకరించారు. ఆమె ముల్లాలను, ఇస్లాంను విమర్శించింది. తన గురువు ఆధ్యాత్మికతను ప్రశంసించింది.
చివరకు బంధించారు
పిరో వివక్షను ప్రశ్నించిన తీరు చివరకు ఆమె అపహరణకు గురయ్యేలా చేసింది. పిరోను అపహరించి లాహోర్ నుండి వజీరాబాద్‌కు బలవంతంగా రవాణా చేయడానికి దారితీశాయని పిరో రాశారు. ఆమె వజీరాబాద్‌లో మెహ్రునిస్సా అనే మహిళచే నిర్బంధించబడ్డారు. తర్వాత కాలంలో జాను, రెహ్మతి అనే ఇద్దరు మహిళలతో స్నేహం చేయగలిగానని, గులాబ్ దాస్‌కు సందేశం పంపడానికి వారి సహాయాన్ని ఉపయోగించుకున్నానని పిరో వివరించారు. గురువు తన ఇద్దరు శిష్యులైన గులాబ్ సింగ్, చతర్ సింగ్‌లను వజీరాబాద్‌కు పంపుతాడు. సానుభూతిపరుల సహాయంతో శిష్యులు పిరోను రక్షించి చాతియన్ వాలాలోని గులాబ్ దాస్ స్థాపనకు తిరిగి తీసుకురాగలుగుతారు.
ఒకే చోట సమాధి
పిరో, గులాబ్ దాస్‌కు సామాజిక, మతపరమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సన్నిహిత సంబంధాన్ని పంచుకున్నారు. పిరో తన 39 ఏండ్ల వయసులో 1872లో మరణించారు. చాతియన్ వాలాలోని సమాధి వద్ద పిరోకు తన గురువు గులాబ్దాస్కు కలిపి అంత్యక్రియలు చేయబడ్డాయి. గులాబ్దాసీలు హిందువులు లేదా సిక్కులు కానప్పటికీ,భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లోని ముస్లిం మెజారిటీ జనాభా ద్వారా వారిని చాతియన్ వాలా నుండి బహిష్కరించారు. ఈ వర్గం తర్వాత భారతదేశానికి పారిపోయి అక్కడే హర్యానాలో స్థిరపడ్డారు.
విప్లవ కవియిత్రిగా...
పీరో విప్లవ కవిత్వం కూడా రాసేవారట. 19వ శతాబ్ధంలో పంజాబ్ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న రోజుల్లో మహారాజు రణజత్ సింగ్ మరణం తర్వాత రాష్ట్రం క్రమ క్రమంగా రాజ పరిపాలన బ్రిటీష్ వారి చేతుల్లోకి వెళ్లింది. ఆ సమయంలో కూడా పీరో తన విప్లవ కవిత్వంతో సామానత, అసమానతలను ప్రశ్నించారు. సమాజాన్ని ఉన్నత వర్గాలు, నిమ్మ వర్గాల పేరుతో విభజించి వివక్ష చూపించడం ప్రకృతి విరుద్ధమని పీరో బలంగా నమ్మేవారు.. ప్రశ్నించేవారు. ఓ వ్యక్తి సిగ పెట్టకున్నంత మాత్రాన బ్రాహ్మణుడు అవుతాడా? సున్తీ చేయించుకుని మీసాలు తీసివేస్తే ముస్లిం అవుతారా? అని పీరో తన కవిత్వం ద్వారా ప్రశ్నించారు. సిక్కు మతంపై కూడా ఆమె ఇలానే వ్యాఖ్యలు చేశారు. మహిళలకు తమకు ఏ మతం పట్ల ఆసక్తి నిరూపించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆమె చెప్పారు. దీంతో గుర్తులు, గుర్తింపుల మత చాందస్వాలను ఆమె ప్రశ్నించారు. అది అసలు మతమే కాదని భావించారు. మతం అనేది ఒక విస్తృత భావన అని చెప్పే ఆమె తనను తాను ఓ సెక్స్ వర్కర్‌గా చెప్పుకునేవారు. వేశ్య అనే పదం భక్తి పదంలో కూడా ఉంటుందనేవారు. తనని తాను వేశ్య అని చెప్పుకోవడానికి ఎప్పుడూ సంకోశించే వారు కాదు.