Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయసు కేవలం ఓ సంఖ్య మాత్రమే.. ఏదైనా సాధించాలనే పట్టుదల.. దృఢ సంకల్పం ఉంటే శరీర భౌతిక పరిమితులను అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని రుజువు చేశారు 46 ఏండ్ల అల్ట్రా మారథాన్ రన్నర్ అంజలి సరయోగిని. చాలా మంది ఈ వయసులో అథ్లెట్స్ నుండి రిటైర్ కావాలనుకుంటారు. కానీ ఈమె మాత్రం 40 ఏండ్లు దాటిన తర్వాతనే సాహసం చేశారు. ఆమె స్ఫూర్తి దాయక పరుగు ప్రయాణం గురించి మనమూ తెలుసుకుందాం...
41 ఏండ్లు వయసులో అంజలి తన పరుగును ప్రారంభించారు. ప్రతి స్త్రీకి 40వ దశకంలో శారీరక సామర్థ్యాలు దెబ్బతినడం సహజం. ఈ వయసులో కొన్ని పరిమితులు తప్పవు. అలాంటిది అంజలి మాత్రం పెద్ద సవాళ్లను స్వీకరించాలని నిర్ణయించుకుంది. అల్ట్రా మారథాన్ చేసేందుకు సిద్ధమయింది. అల్ట్రామారథాన్లు సాధారణంగా 50 కి.మీ నుండి 100 కి.మీ మధ్య ఉంటాయి.
క్రమం తప్పకుండా...
70వ దశకంలో పెరిగిన అంజలి అప్పట్లో ఒలింపిక్ మారథాన్ రన్నర్లను చూసి ఆశ్చర్యపోయానని గుర్తుచేసుకుంది. 42 కి.మీ వేగంతో పరుగెత్తాలనే ఆలోచన ఆమెను మంత్రముగ్దురాలిని చేసింది. 90వ దశకం చివరిలో కుమార్తెకు జన్మనిచ్చిన తర్వాత అంజలి జాగింగ్, రన్నింగ్ ప్రారంభించింది. 15-16 సంవత్సరాలుగా అంజలి క్రమం తప్పకుండా ఓ పద్ధతిని అనుసరిస్తుంది. అవే వాకింగ్, జాగింగ్, రన్నింగ్.
కుమార్తె ప్రోత్సాహంతో
2015లో కోల్‌కతాలో జరగనున్న హాఫ్ మారథాన్‌ను రన్ చేయాలనే ఆలోచనను తన కుమార్తెతో పంచుకుంది. ఆలోచనైతే చేసింది కానీ ఎన్నో భయాలు, సందేహాలు అంజలిని చుట్టుముట్టాయి. మొదట్లో ఎంతో భయపడింది. 21 కిమీ పరుగంటే చాలా ఎక్కువగా అనిపించింది. అప్పటికి ఆమె అంత దూరం కోసం శిక్షణ పొందలేదు. సహాయం చేయడానికి శిక్షకులు కూడా లేరు. కుమార్తెనే ఆమెను హాఫ్-మారథాన్‌లో పరుగెత్తమని ప్రోత్సహించింది. 2015లో తన 21 ఏండ్ల కుమార్తె ఒత్తిడితో ఆ మారథాన్‌లో పాల్గొని గంట 55 నిమిషాలతో మూడవ స్థానంలో నిలిచింది. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. ప్రస్తుతం అంజలి ఫాస్ట్ అండ్ అప్ సపోర్టెడ్ రన్నర్. అలాగే కోల్‌కతాలో సొంతంగా డయాగస్టిక్ సెంటర్‌ను నడుపుతుంది.
అల్ట్రామారథాన్తో జీవితం
''నేను సవాళ్ళను ఇష్టపడుతున్నాను. 100కి.మీ.ల కోసం సైన్ అప్ చేసినప్పుడే ఎంతో కష్టపడి శిక్షణ పొందబోతున్నానని నాకు తెలుసు. క్రమశిక్షణ, నా పట్ల నాకున్న కమిట్మెంట్ వల్లే దీన్ని అమలు చేయబోతున్నాను'' అని అంజలి చెప్పింది. 2017లో ఆమె మొదటిసారి అల్ట్రామారథాన్‌లో పాల్గొన్నది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద అల్ట్రామారథాన్ రేసు. దాదాపు 89 కి.మీ.ల మేర ఈ రేసు రెండు దక్షిణాఫ్రికా నగరాల మధ్య ఉండే డర్బన్, పీటర్‌మారిట్జ్‌బర్గ్ ప్రాంతంలో జరిగింది.
ఏం జరగబోతుందో తెలీదు
తన మొదటి అల్ట్రామారథాన్ గురించి చెబుతూ ''ఇది చాలా అందమైన పరుగు. అయితే కొండల మీదుగా ఉండడం వల్ల కఠినమైన రేసుగా కూడా చెప్పాలి. అయినా ఇంత దూరం నేనెప్పుడూ పరిగెత్తలేదు. కాబట్టి నా శరీరానికి ఏం జరగబోతుందో తెలియక పరిగెడుతున్నాను. శిక్షణ సమయంలో కూడా 60 కిలోమీటర్ల వరకు మాత్రమే పరిగెత్తాను. కాబట్టి నాకు ఏమి జరుగుతుందో తెలియదు. అయితే నొప్పిని అంగీకరించడం మాత్రం నాకు చాలా సులభం. అనుభవంతో సంబంధం లేకుండా మన స్థాయి వంద కిలోమీటర్లు బాధిస్తుంది.. చాలా బాధిస్తుంది. ఆ బాధ చాలా కాలం పాటు ఉంటుంది'' అంటుంది. అయినప్పటికీ ఆమె ఛాలెంజ్‌లో మునిగిపోతూనే ఉంది. పరుగును ధీటుగా తీసుకుంటుంది. ''రేసులో అత్యంత కష్టతరమైన భాగం 60, 80వ కిలోమీటరు మధ్య ఉంటుంది. నేను నా సప్లిమెంట్లపై ఆధారపడే సమయం అది. రీలోడ్ చేయడం, సర్దుబాటు చేయడం. ఇది నన్ను 80 కి.మీ మార్క్ వరకు పునరుజ్జీవింపజేస్తుంది. 80 కిలోమీటర్ల తర్వాత నేను బాగానే ఉన్నాను. ఎందుకంటే నాకు కేవలం 20 కి.మీ మాత్రమే వెళ్లాలని నాకు తెలుసు'' అంటూ అంజలి గుర్తు చేసుకుంది.
అడ్డంకులను అధిగమించడం
జూలై 2018లో క్రొయేషియాలో సెప్టెంబర్‌లో జరగనున్న 100 కి.మీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అంజలి సిద్ధమైంది. ఆ సమయంలో ఆమెకు డెంగ్యూ వచ్చింది. రక్తమార్పిడి చేయించుకుని దాదాపు ఐదు వారాల పాటు శిక్షణ తీసుకుంది. తన దేశానికి మొదటిసారి ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఆమెను ఈ రేసులో పాల్గొనేలా చేసింది. క్రొయేషియాలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు సభ్యుల జట్టులో ఆమె ఒంటరి మహిళ. 9 గంటల 40 నిమిషాల్లో రేసును ముగించింది. ఆమె అప్ రన్లో రెండవ అత్యంత వేగవంతమైన భారతీయురాలు. అలాగే 100 కిలోమీటర్లలో అత్యంత వేగవంతమైన భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది.
రొమ్ముల్లో గడ్డలతోనే పరుగు
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తన రొమ్ములలో గడ్డలు ఉన్నట్టు గమనించింది. ఆ గడ్డలను తొలగించాల్సి వచ్చింది. అయితే డెంగ్యూ వల్ల అంతకు ముందే రక్తమార్పిడి చేయడంతో వైద్యులు ఆమెను రెండు నెలలు వేచి ఉండాలని చెప్పారు. ఆగగడ్డలతోనే అంజలి మారథాన్ రేసుల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. నవంబర్ 2018లో ఆమె గడ్డలను తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకుంది. జనవరి 2019లో మళ్లీ రేసుల్లోకి వచ్చింది. ముంబై మారథాన్‌లో పాల్గొంది. దీనిలో ఆమె ఔత్సాహిక విభాగంలో రెండవ స్థానంలో, తన వయసు వర్గం విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. మరుసటి నెల ఆమె కోల్‌కతా మారథాన్‌లో పాల్గొని 3 గంటల 16 నిమిషాల 54 సెకన్లతో రేసును గెలుచుకుంది. ఏప్రిల్ 2019లో బోస్టన్ మారథాన్‌లో పరుగెత్తాలనే తన కలను నెరవేర్చుకుంది. అక్కడ ఆమె తన పరుగును 3 గంటల, 14 నిమిషాల 33 సెకన్లలో పూర్తి చేసింది. ఆమె ఇప్పటివరకు పరిగెత్తిన అన్ని మారథాన్ రేసుల్లో ఇది అత్యుత్తమంగా నిలిచింది.
మరో మారథాన్‌కు సిద్ధం
అంజలి ప్రతి వారం 90 కి.మీ. రేసు కోసం శిక్షణ తీసుకుంటుంది. ఆమె తనంతట తానుగా శిక్షణ పొందుతుంది. రేసుల ముందు ఏకాంతంగా ఉండటానికి, సరైన హెడ్స్పేస్లోకి రావడానికి ఇష్టపడుతుంది. ఆమె రోజుకు కనీసం మూడు సార్లు యోగా, వ్యాయామం, వాకింగ్ కూడా చేస్తుంది. పరిగెత్తాలంటే సరైన పోషకాహారం కీలకమని ఆమె నమ్ముతుంది. మారథాన్ల సమయంలో అవసరమైన శక్తిని పొందేందుకు అవసరమైన ఆహారాన్ని తీసుకుంటుంది. 2022, జనవరి 19న అంజలి టాటా ముంబై మారథాన్‌లో పాల్గొనబోతున్నది. గతం కంటే మరింత వేగమైన పరుగుకోసం ఆమె సన్నద్ధమవుతోంది.
అంగీకరించాల్సిందే
జీవితం ఎత్తు పల్లాలు ఉంటాయి. అయితే ఇందులు విషయాలు అతి తక్కువ మాత్రమే వస్తాయి. మనం దానిని అంగీకరించాలి. సమన్వయం పాటిస్తూ ముందుకు సాగాలి. ఎందుకంటే పరిస్థితిలో మార్పు రావడం లేదని జాలిపడి ఏడవడం వల్ల ప్రయోజనం ఉండదు.
- సలీమ