Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చలికాలంలో శరీరం వెచ్చదనాన్ని కోరుకోవడం సహజం. అలాగని గంటల తరబడి ఎండలో కూర్చోవడం సాధ్యం కాదు.. అయినా వెచ్చదనం అందాలంటే మీరు పనిచేసుకునే టేబుల్ని ఎండ పడే కిటికీ వద్దకు మార్చుకోవచ్చు. చలికాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని పంచేలా పలు మార్పులు చేర్పులు ఎలాగైతే చేసుకుంటామో.. అలాగే పని ప్రదేశాన్ని వెచ్చగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇక మీపై ఎండ నేరుగా పడకుండా ఉండేందుకు కిటికీ తలుపులు మూయడం, పల్చటి కర్టెన్ వేయడం వంటివి చేస్తే.. గదిలో వెచ్చదనం నిండి చలిగా ఉందన్న ఫీలింగే రాదు.. ఫలితంగా ఎలాంటి బద్ధకం లేకుండా హాయిగా పని చేసుకోవచ్చు.
పచ్చపచ్చటి మొక్కలు మన మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అందుకే పని ప్రదేశంలో ఇండోర్ మొక్కల్ని ఏర్పాటు చేసుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. అయితే ఈ చలికాలంలో వీటి వల్ల గదిలో చలి పెరిగిపోతుందేమో అనుకుంటారు చాలామంది. ఇది నిజమే అయినా వెచ్చదనాన్ని పంచే మొక్కలు కూడా కొన్నున్నాయంటున్నారు నిపుణులు. క్రిస్మస్ కాక్టస్, ఆర్చిడ్, పోల్కా డాట్ ప్లాంట్, డైసీ పుష్పాలు.. వంటి ఇండోర్ మొక్కల్ని పని ప్రదేశంలో ఏర్పాటు చేసుకుంటే అటు వెచ్చదనాన్ని ఆస్వాదించచ్చు. ఇటు వాటి రంగులతో మనసునూ ఉత్తేజపరచుకోవచ్చు.
కొన్ని రకాల సువాసనలు మనసులోని ఒత్తిళ్లు, ఆందోళనల్ని మాయం చేసి మానసిక ప్రశాంతతను అందిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజుల్లో చాలామంది రూమ్ ఫ్రెష్నర్స్, ఇతర పరిమళాల్ని ఆయా గదుల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే వీటితో పాటు సెంటెడ్ క్యాండిల్స్కి కూడా పని ప్రదేశంలో చోటిస్తే ఇటు పరిమళాల్నీ ఆస్వాదించచ్చు.. అటు క్యాండిల్ వేడికి గదిలో వెచ్చదనాన్నీ నింపుకోవచ్చు.