Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సొరకాయ... ఈ కూర అంటే చాలు చాలా మంది మూతి ముడుచుకుంటారు. ముఖ్యంగా పిల్లలు. అయితే దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. కాబట్టి కచ్చితంగా తినాల్సిందే. దీంతో చేసే రకరకాల వంటకాలేంటో చూద్దాం...
సొరకాయ హల్వా
కావలసిన పదార్ధాలు: సొరకాయ తురుము - రెండు కప్పులు, పాలు - కప్పు, పంచదార - రెండు కప్పులు, నెయ్యి - అరకప్పు, ఏలకులు - ఐదు, జీడిపప్పు, కిష్మిష్ - పది చొప్పున.
తయారు చేయు విధానం: ముందుగా మందపాటి గిన్నెలో నెయ్యి పోసి వేడెక్కాక, అందులో సొరకాయ తురుము వేసి బాగా వేయించాలి. పచ్చి దనం పోయాక అందులో పాలు పోసి ఉడికించాలి. సొరకాయ తురుము మెత్తబడ్డ తర్వాత దాంట్లో పంచదార వేయాలి. పంచదార కరిగిన తర్వాత వేరే బాండీలో నెయ్యి పోసి జీడీ పప్పు కిస్మిస్ వెయ్యాలి. ఏలకులు పొడి చల్లుకోవాలి. ఇది వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
సొరకాయ, టమాటా పులుసు
కావాల్సిన పదార్ధాలు: సొరకాయ ముక్కలు - కప్పు, టమాటో ముక్కలు - అరకప్పు, ఉల్లిగడ్డ - ఒకటి(చిన్నది), పచ్చి మిర్చి మూడు, ఉప్పు, పసుపు, కారం, బెల్లం ముక్క, కరివేపాకు, ఇంగువ, పోపుదినుసులు, నూనె, చింతాపండు గుజ్జు - కొంచం, కొత్తిమీర, బియ్యపు పిండి - కొద్దిగా, అల్లం, వెల్లుల్లి పేస్ట్.
తయారు చేయు విధానం : సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు ఒక గిన్నెలో వేసి కొంచం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. అవి మెత్తపడ్డాక అందులో ఉప్పు, పసుపు, కారం, బెల్లం వేసుకోవాలి. అవి కొంచం ఉడికిన తర్వాత చిక్కదనం కోసం రెండు స్పూన్ల బియ్యపు పిండిని నీళ్ళల్లో కలిపి ఉడుకుతున్న పులుసులో వేయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. దించుకునే ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.
సొరకాయ కోట్
కావలసిన పదార్థాలు: సొరకాయ ముక్కలు - రెండు కప్పులు, పెసరపప్పు - ఒక చిన్న కప్పు, కొబ్బరి తురుము - ఒక చిన్న కప్పు, పచ్చి మిర్చి - నాలుగు, ఉప్పు, పసుపు, కరివేపాకు, ధనియాల పొడి, కరివేపాకు.
తయారు చేయు విధానం: ముందుగా సొరకాయ ముక్కల్ని,పెసరపప్పుని పోపులో వేసుకుని కొంచం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి వేయాలి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేయాలి. ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసి బాగా కలియబెట్టాలి. దించేముందు కరివేపాకు వేయాలి. ఇది అన్నంలోకి బావుంటుంది
సొరకాయ పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్ధాలు: సొరకాయ తురుము - ఒక కప్పు, పెరుగు - రెండు కప్పులు, పచ్చిమిర్చి - మూడు, పసుపు, ఉప్పు, ఆవపిండి, పోపుదినుసులు, నూనె, కొత్తిమీర.
తయారు చేయు విధానం: పెరుగుని ఒక గిన్నెలో పోసుకుని అందులో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి నిలువుగా తరిగి వేయాలి. ఒక బాండీలో కొంచం నూనె పోసి పోపు దినుసులు వేసి అవి వేగాక సొరకాయ తురుము వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. కొంచం పచ్చి వాసన పోవలన్నమాట. చల్లారాక ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. రెండు స్పూన్ల అవపిండి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలియ బెట్టాలి. ఇది అన్నంలోకి, రొట్టెల్లోకి బావుంటుంది.