Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వ్యాయామంలో అనేక పద్దతులు ఉన్నాయి. కొందరు నడకను ఎంచుకుంటే, మరికొందరు పరుగును ఎంచుకుంటారు. అలాగే ఈత, కఠిన వ్యాయామాలు కూడా చేస్తుంటారు. ఆరోగ్యం కోసం కొందరు జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడతారు. మరికొందరు రోజుకు 10,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. సాధారణంగా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి 30 నిమిషాల వ్యాయామం, 10 వేల అడుగుల నడకను బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తుంటారు. అయితే వీటిలో ఎది మంచిది.. రెండూ ఒకేలా ఉంటాయా.. ఆరోగ్యంగా ఉండేందుకు ఏది మంచిది... ఆ వివరాలు తెలుసుకుందాం.
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి వారానికి 150 నిమిషాల మధ్యస్థ, కఠినమైన వ్యాయామం అవసరమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది. వారానికి ఐదు రోజులు, రోజుకు 30 నిమిషాలపాటు వ్యాయామం చేయడం ద్వారా వారంలో 150 నిమిషాలు పూర్తి చేయవచ్చు. దీనికన్నా ఎక్కువగా చేసే వ్యాయామం శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే తేలికైన వ్యాయామాలతో ప్రారంభించి తరువాత కఠినమైనవి చేయాలి. ఇలా చేయలేని వారు రోజుకు కనీసం 10,000 అడుగులు నడిస్తే సరిపోతుంది. ఇలా చేయడం ద్వారా శారీరకంగా చురుగ్గా ఉంటారు. క్రమం తప్పకుండా చేసే ఏ వ్యాయామం అయినా బరువు తగ్గడానికి, ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపింది.
నడకతో ప్రయోజనాలు
రోజుకు పదివేల అడుగులు నడవడం చాలా తేలిక. ఇతరులతో మాట్లాడుకుంటూ కార్యాలయాలకు నడవడం, పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్లడం, పిల్లలతో ఆటలాడటం ద్వారా రోజుకు పది వేల అడుగులను పూర్తి చేయవచ్చు. ఇలా చేస్తే ఉత్సాహంగానూ ఉంటారు. రోజుకు పదివేల అడుగులు నడక కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీర్ఘకాలంలో కీళ్లనొప్పులు, ఇతర ఎముకల సబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆరుబయట నడవడం వల్ల మెదడు కణాలు ఉత్తేజం పొందుతాయి. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ఇది మంచి మార్గం. 10,000 అడుగులు వేగంగా నడవడం, జాగింగ్ చేయడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.
రెండింట్లో ఏది ఉత్తమం..
వ్యాయామం, నడక రెండూ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. జీవనశైలి చురుగ్గా మార్చడంలో సహాయపడతాయి. వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇతర జబ్బులు ఉన్నవారు నెమ్మదిగా నడవడం ఉత్తమం. బైకర్లు, క్రీడాకారులు, చురుకైనవారు కఠిన వ్యాయామాలు చేయడం వారికి అవసరం. నడక, వ్యాయామం రెండింటినీ కలపడం ఆదర్శవంతమైన పద్దతి. వారంలో రోజు మార్చి రోజు ఒక పద్ధతిని పాటించవచ్చు. వారంలో ఒక రోజు సాధారణ స్ట్రెచింగ్ చేసి మరో రోజు విశ్రాంతి తీసుకోవచ్చు.