Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ పాయల్ కనోడియా... కెటిల్‌బెల్ లిఫ్టింగ్‌లో ప్రపంచ ఛాంపియన్షిప్ రజత పతక విజేత... ఎం3ఎం అనే సంస్థను స్థాపించి అట్టడుగు వర్గాల ప్రజల జీవితాల్లో విద్యా వెలుగులు నింపుతున్నారు. కరోనా సమయంలో క్రీడల్లోకి ప్రవేశించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న ఆమె మనదేశంలో క్రీడలకు, క్రీడాకారులకు ఎలాంటి ప్రాధాన్యం ఉంది అనే దాని గురించి ఆమె ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
మార్చి 2020లో కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఆమె కెటిల్‌బెల్ ఎత్తడం ప్రారంభించినప్పుడు ఫిట్నెస్ కోసం ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం క్రీడా అభిరుచిగా మారింది. ఏడాదిన్నర లోపే పాయల్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కెటిల్బెల్లో రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ హంగేరీలోని బుడాపెస్ట్‌లో అక్టోబర్ 22 నుండి 24 వరకు జరిగింది.
ఫిట్నెస్ కోసం ప్రారంభించి
హర్యానాలోని టౌరుకు చెందిన పాయల్ గత పదేండ్లుగా ఢిల్లీలో నివసిస్తున్నారు. ఆమె కెటిల్‌బెల్ ట్రైనింగ్‌ను ఎలా ప్రారంభించింది అనే దాని గురించి మాట్లాడుతూ ''నేను ఎప్పుడూ ఫిట్నెస్ కోసం ప్రయత్నిస్తుంటాను. నా ఫిట్నెస్ దినచర్యలో భాగంగా కెటిల్‌బెల్‌ను తీసుకున్నాను. కాలక్రమేణా దానిని క్రీడగా ఎంచుకునే సామర్థ్యం నాలో ఉందని గ్రహించాను. నా కోచ్ కూడా దీన్ని క్రీడగా ప్రయత్నించమని సూచించారు. రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనమని అతను నన్ను ప్రోత్సహించారు. అక్కడ బాగా ఆడాను కానీ ఏ పతకం సాధించలేదు. తర్వాత జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాను. అక్కడ బంగారు పతకాన్ని గెలుచుకున్నాను. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది'' అని చెప్పారు.
పతకాన్ని గెలిచిన తర్వాత...
పాయల్ (35-39 సంవత్సరాలు, 68 కేజీల విభాగం), ఆమె కోచ్ అన్షు తారావత్ (58 కేజీల విభాగం) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రజతం గెలుచుకున్నారు. 35 ఏండ్ల పాయల్‌కి కెటిల్‌బెల్ ట్రైనింగ్ అనేది ఓ అద్భుతమైన చర్య. ఎందుకంటే ఆమె అన్షు వద్ద కొద్దికాలం నుండే శిక్షణ తీసుకుంటున్నారు. జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లో మొదటి పతకాన్ని గెలుచుకున్న తర్వాత ఆమెను కుటుంబం ఎంతో ప్రోత్సహించింది. అది మరింత శిక్షణ పొందేందుకు ప్రేరేపించింది.
ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం
''నా పిల్లలు నా విషయంలో ఎంతో ప్రోత్సాహకంగా ఉన్నారు. ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు. పిల్లల ఉత్సాహం, ప్రోత్సాహం నన్ను ఈ పోటీలో పాల్గొనడానికి పురికొల్పింది. నా కొడుకు వెళ్లి నా పతకాన్ని తీసుకున్నాడు. తన తల్లి గురించి చాలా గర్వంగా భావించినందుకు నేను చాలా సంతోషంగా అనిపించింది'' అని పాయల్ చెప్పారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదని పాయల్ చెప్పారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే ఆమె ప్రధాన లక్ష్యం.
మన దగ్గర గుర్తింపు లేదు
ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశంలో క్రీడకు ఉన్న ఆదరణ గురించి పాయల్ మాట్లాడుతూ ''చాలా మంది ప్రజలు కెటిల్‌బెల్‌ను ఎత్తినప్పటికీ భారతదేశంలో ఇది ఒక క్రీడగా కనిపించదు. దీనిని పాలించే సమాఖ్య ఉంది. కానీ ఇతర క్రీడలతో పోలిస్తే ఈ క్రీడకు అంత గుర్తింపు లేదు. 55 దేశాల నుండి 450 మందికి పైగా పాల్గొన్నారు. ఇప్పుడు పతకం గెలిచిన తర్వాత చిన్నప్పటి నుండే కెటిల్‌బెల్ లిఫ్టింగ్ నేర్చుకోవాలనుకునే పిల్లలకు సహకరించాలనుకుంటున్నాను'' అని ఆమె చెప్పింది. పాయల్ భారత ప్రభుత్వం నిర్వహించే ఫిట్ ఇండియా ప్రోగ్రాంకు అంబాసిడర్. అలాగే హర్యానా చాప్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వింగ్ ప్రెసిడెంట్ కూడా.
ఫౌండేషన్ ప్రారంభించి
పాయల్ వృత్తిపరంగా వైద్యురాలు. తన కుటుంబ వ్యాపారమైన ఎం3ఎం ఇండియా గ్రూప్‌లో రియల్ ఎస్టేట్‌లో చేరినందున వృత్తిపరంగా మెడిసిన్‌ను కొనసాగించలేదు. ఆమె వ్యాపారంలో మార్కెటింగ్, హెచ్ఆర్, సిఆర్ఐ విభాగాన్ని చూసుకుంటున్నారు. 2019లో ఆమె ఎం3ఎం ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీని ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణం, విద్య కోసం ఆమె ఆ కుటుంబాలకు సహకరిస్తున్నారు. వీరి కార్యక్రమాలలో ఒకటి ఎంపవర్. ఇది గురుగ్రామ్‌లోని వలస కార్మిక శిబిరాలకు సహాయపడుతుంది.
క్రీడా శిక్షణా కార్యక్రమం కోసం
''మేము వారి పిల్లలకు శిక్షణ ఇస్తాం. వాళ్ళు బడికి వెళ్ళి చదువుకునేందుకు అర్హులుగా చేస్తాం. క్రీడల్లో రాణించాలనుకునే పిల్లలకు సహకరించాలని మేము భావిస్తున్నాం. వారి కోసం క్రీడా శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాము'' అని పాయల్ పంచుకున్నారు. కెటిల్‌బెల్ లిఫ్టింగ్‌తో తన సొంత భవిష్యత్ ప్రణాళికల విషయానికొస్తే ట్రైనింగ్ ఒక హాబీ అయితే, అది తన ఫిట్నెస్ రొటీన్లో కూడా ఒక భాగమని పాయల్ చెప్తున్నారు. ''ఎలాంటి ఒత్తిడికీ లోనుకాకుండా సంవత్సరానికి రెండు ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొనాలను కుంటున్నాను'' అంటున్నారు ఆమె.
నమ్మలేకపోయాను
నిజం చెప్పాలంటే నేను అనుభవం కోసం ప్రపంచ స్థాయిలో కెటిల్‌బెల్ లిఫ్టింగ్‌లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి వెళ్ళాను. ఇది నాకు గర్వించదగిన క్షణం కంటే ఎక్కువ. నా బెస్ట్ షాట్ ఇచ్చి రావాలని అప్పుడే అనుకున్నాను. నేను చాలా కాలంగా కెటిల్‌బెల్స్ ఎత్తడం లేదు. దశాబ్దాలుగా కెటిల్‌బెల్స్ ఎత్తే 453 మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీలో ఉన్నందున గెలవడం అన్నది అసలు నా ఊహలోనే లేదు. గెలిచినప్పుడు నేను దానిని నమ్మలేకపోయాను. తేరుకోవడానికి కొంత సమయం పట్టింది.
- సలీమ