Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప' అన్న కారల్ మార్స్క్ మాటలు మరోసారి రుజువయ్యాయి. తమను భూమికి దూరం చేసి బానిసలుగా మార్చే కుట్రతో ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘపోరాటం చేసిన రైతులు గెలిచారు. వారి పోరాటానికి గడ్డకట్టే చలి... మలమలా మాడ్చే ఎండ... జోరున కురిసే వర్షమే ఓడిపోయాయనుకున్నాం ఇన్నాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం కూడా తల వంచక తప్పలేదు. వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతులు దేశ రాజధానిలో ఏడాదికి పైగా పోరాటం చేశారు. ఆ పోరులో మేము సైతం అంటూ మహిళా రైతులు ముందుకు వచ్చారు. కొడవళ్ళు చేత పట్టిన ఆ చేతులు పిడికిళ్ళి బిగించాయి. కొంగు నడుముకు చుట్టి నాట్లు వేసిన ఆ చేతులే జెండా చేతబట్టి హక్కుల కోసం నినదించాయి. తమ కడుపులే కాదు దేశ ప్రజల కడుపులు మాడ్చే నల్ల చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరు ఆపేదే లేదని ఆనాడే శపథం చేశారు. అదే లక్ష్యంతో పోరు చేశారు. చివరకు విజయం సాధించారు. ఈ ఉద్యమంలో భాగస్వాములైన మహిళల మనోగతాలు ఈరోజు మానవిలో...
ఉద్యమంలో భాగస్వాములు కావడమే కాదు... నిరసనకారుల కడుపులు నింపారు. వారికి కావల్సిన నిత్యావసరాలు సేకరించడం దగ్గర నుండి వంటలు చేసి భోజనాలు ఏర్పాటు చేశారు. ఉద్యమం మొదలైననాటి నుండి పాటియాలా, బటిండాలను కలిపే జాతీయ రహదారిపై బాద్బార్ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద గంటల తరబడి నిరసన తెలియజేసిన తర్వాత సాయంత్రానికి యువతీయువకులు పంజాబ్‌లోని బర్నాలాలోని హరిగ గ్రామానికి తిరిగి వెళ్ళేవారు. వారందరికీ భోజనం పెట్టడం కోసం మహిళలు కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు. వారి ఆహారం ఏర్పాటు చేసి కడుపులు నింపి ఉద్యమానికి అండగా నిలిచారు.
మొదలైననాటి నుండే...
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జగిన ఆ ఆందోళనలో మగవారితో పాటు మహిళా రైతులు కూడా భుజంభుజం కలిపి అండగా నిలబడ్డారు. వీరు అవసరమైతే నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ సైతం బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఉద్యమం మొదలైనాటి నుండి అయితే అక్కడ జరుగుతున్న పోరాటంలో పాల్గొంటున్న ఉద్యమ కారుల కోసం ప్రతిరోజూ తమ గ్రామం నుండి ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు మొదలైనవి సేకరించి వంటలు చేసేవారు. నిరసన చేసే చోటనే వంటలు చేసి వారికి వడ్డించేవారు.
కుటుంబాలు ఏకమై
రైతుల నిరసన కార్యక్రమాల పట్ల, వారి డిమాండ్ల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఉదాసీన వైఖరిపై ప్రైవేట్ హెల్త్‌కేర్ కంపెనీలో పనిచేస్తున్న 27 ఏండ్ల రామన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ... రైతులకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ''నేను ఒక రైతు బిడ్డను. నేను ఈ ఆందోళనకు, రైతులకు మద్దతు ఇవ్వకపోతే నా సమాజానికి నేను ద్రోహం చేసిసనట్టు భావిస్తున్నాను. రైతుల ఉద్యమానికి అండగా నిలబడటానికి మహిళలందరం కలిసి అనేక కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామంలో ప్రతి రోజూ సాయంత్రం మేము కలుసుకుని నిత్యావసర సరుకులు, చందాలు వసూలు చేయడానికి మాకు కేటాయించిన ప్రాంతంలో తిరుగుతాము. అలాగే ఆ సరుకులతో భోజనం వండి నిరసన ప్రదేశానికి పంపుతాము. ఇది మా కర్తవ్యం. మా కర్తవ్యాన్ని మేం తప్పక నిర్వర్తిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అన్ని కుటుంబాలు ఏకమై పని చేస్తున్నాయి'' అని కౌర్ అన్నారు.
పశ్చాత్తాపం తప్పదు
60 ఏండ్ల బల్బీర్ కౌర్... మాట్లాడుతూ తాను నిరసన తెలిపే రైతులతో ఉన్నానని, వారి డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వం ఎప్పటికైనా పశ్చాత్తాప పడక తప్పదంటున్నారు ఇంకా ఆమె ''ఉదయం నా ఇంటి పని పూర్తయిన తర్వాత నేను నిరసన స్థలానికి వెళ్లి రోజూ మూడు లేదా నాలుగు గంటలు అక్కడ కూర్చుంటాను. సాయంత్రం అయిన తర్వాత ఇతర మహిళలతో కలిసి ఆహారం, ఇతర వస్తువులను సేకరించడానికి గ్రామంలో తిరుగుతాను. ఇక్కడ అవసరమైన అన్ని వస్తువులను సేకరిస్తున్నాము. బట్టలు, ఆహారం, మందులు ఇలా నిరసన కారులకు అవసరమైన వాటిని సేకరిస్తున్నాము'' అంటున్నారు ఆమె.
ప్రభుత్వం దిగిరాక తప్పదు
''ఈ యుద్ధంలో మేమందరం కలిసి ఉన్నాం. మా నాయకుల నుండి మాకు పిలుపు వచ్చిన వెంటనే మేము ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఢిల్లీకి వెళ్తాం'' అని 65 ఏండ్ల అమర్జీత్ అన్నారు. 70 ఏండ్ల కర్నైల్ కౌర్ మాట్లాడుతూ ''పంజాబ్‌లోని మహిళలు తమను, తమ ఇంటిలోని వారిని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. అలాగే సమాజంలో కూడా తమకు రావల్సిన హక్కుల కోసం రెట్టించిన శక్తితో పోరాడుతారు'' అంటున్నారు. పర్మిందర్కు 54 ఏండ్లు... ఆమె ఏమంటారంటే ''ఈ ప్రభుత్వం నాకు నమ్మకం లేదు. కొత్త చట్టాలను తీసుకు వచ్చి మా జీవితాలను ఛిద్రం చేయాలని చూస్తుంది. అందుకే ఎన్ని అడ్డంకులు ఎదురైనా, నా ప్రాణం పోయినా మాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాను. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం మా మాట వినాల్సిందే... వినే వరకు మేం ఊరుకోం'' అంటున్నారు.
గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి
రైతు నాయకుడు పర్విందర్ సింగ్ మక్కన్ మాట్లాడుతూ ''ఆందోళనలో మహిళల సహకారం అసాధారణంగా ఉంది. వారు మా ఆందోళనకు వెన్నెముకగా ఉన్నారు. అనేక గ్రామాల్లో మహిళా కమిటీలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు వేర్వేరు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పగలూ రాత్రి ధర్నా జరుగుతున్న బాద్బార్ టోల్ ప్లాజా వద్ద వందలాది మంది రైతులు పాల్గొంటున్నారు. వారందరికీ గ్రామ మహిళలు స్వయంగా వంటలు తయారు చేసి అందిస్తున్నారు. మా కడుపులు నింపుతున్నారు. మా అవసరాల గురించి ఒక లౌడ్ స్పీకర్ నుండి మేము ప్రకటనలు చేస్తాం. వెంటనే మహిళా కమిటీలు స్పందించి మా అవసరాలు తీర్చుతున్నారు. ఉద్యమం మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు ఆహారానికిగానీ ఇతర ఏ వస్తువులకూ కొరత రాకుండా చూసుకుంటున్నారు. ఈ ఆందోళనను బలోపేతం కావడానికి మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. కేవలం సహకారం అందించడం మాత్రమే కాదు ఉద్యమంలో మరింతగా భాగస్వాములు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు'' అంటూ రైతుల ఉద్యమంలో మహిళా భాగస్వామ్యం గురించి చెబుతున్నారు.
భూమిపై హక్కు కావాలి
నైనిటాల్‌లోని బిందుఖట్టాకు చెందిన 30 ఏండ్ల మధులి దేవి మాట్లాడుతూ ''ఈ సంవత్సరం మహారాష్ట్ర, ఢిల్లీ, ఘాజిపూర్లలో రైతు నిరసనల వార్తలు విని మేం ఆ ఉద్యమానికి మద్ధతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా ప్రాంతంలో మహిళా కవాతు చేశాం. మధ్యప్రదేశ్‌లోని బార్వానీ జిల్లా నుంచి వచ్చిన 60 ఏండ్ల కమలా యాదవ్ మాట్లాడుతూ ''మహిళలు తమ ఇల్లు, పిల్లలతో పాటు పొలాలను కూడా చూసుకుంటారు. అయినా మా పేరుతో భూమి ఉండదు. మహిళా కార్మికులకు తగినంత వేతనం లేదు. మాకు పెన్షన్ లభించదు. పంట దెబ్బతింటే ఆ కోపాని మా భర్తలు మాపైనే చూపిస్తారు. శ్రమలోనే కాదు కాగితంపై కూడా మాకు సమాన హక్కు కావాలి. భూమిలో సమాన యాజమాన్యం ఉంటే మేము మరింత భద్రంగా ఉంటాం'' అని ఆమె అన్నారు.
న్యాయాన్ని కోరుతూ...
యుపికి చెందిన ఇసా నగర్‌కు చెందిన పుష్పా మాట్లాడుతూ ''నాకు ఇద్దరు ఆడపిల్లలు. వారిద్దరినీ బాగా చదివించాలి. మాకు స్థలంగానీ, సొంత ఇల్లుగానీ లేదు. ఇతరుల వ్యవసాయ పొలం పని చేస్తున్నాం. మాకు కనీస వేతనం అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను'' అంటున్నారు ఆమె. ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్ నుండి 80 ఏండ్ల నఫీసా, ఒక స్థానిక రాజకీయ నాయకుడి నుండి తన భూమిని తిరిగి పొందాలనే ఆశతో ఈ ఉద్యమంలోకి వచ్చింది. అలాగే ఒడిశా సంబల్పూర్కు చెందిన 75 ఏండ్ల తారా మెహెర్ చికాడా అనే క్రిమి వల్ల దెబ్బతిన్న తన పంటకు పరిహారం కోరుతుంది.
విజయం మనదే
వేల సంఖ్యలో మహిళా రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో భాగస్వాములయ్యారు. తమ హక్కులను కాపాడుకునేందుకు అడుగులు వేశారు. గొంతు విప్పారు. వీరికి మరెన్నో ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు మద్ధతు పలికాయి. దేశ వ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో వేల సంఖ్యలో మహిళలు, మహిళా రైతులు పాల్గొన్నారు. వీరి న్యాయమైన పోరాటానికి చివరకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించక తప్పలేదు. ఐక్యంగా పోరు చేస్తే విజయం మనదే అని రుజువు చేశారు. ఈ పోరాటంలో మహిళల పాత్ర కూడా అసాధారణం. ఈ విజయంలో మహిళా రైతులకు కూడా సమాన భాగస్వాం వుందని అందరూ ఒప్పుకుంటున్న సత్యం.