Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలు ఇంటి నుండి బయటకు రాకూడదు. ఘోషా పద్ధతి ఆచరించేవారు. బాల్య వివాహాలు సర్వసాధారణం. పేదరికం కారణంగా కన్యాశుల్కం ఆశతో పసిపిల్లలకు ముసలి వారికి ఇచ్చి పెండ్లి చేసేవారు. ఆ పిల్లలు యుక్తవయసుకు వచ్చే వసరికి వితంతువులుగా మారేవారు. స్త్రీ పునర్వివాహం చేసుకోవటం నేరమని వంటింటికే పరిమితం కావాలని, ఆడవారు చదువుకోకూడదని ఇలా ఎన్నో మూఢాచారాలు, ఛాందసభావాలతో వుండేవారు. అలాంటి సమయంలో మహిళల్లో చైతన్యం నింపే బాధ్యతలను మానికొండ సూర్యవతి భుజాలకెత్తుకున్నారు. నిర్భందాలు, దాడులు, కష్టాలు ఎన్ని ఎదురైనా ఆ బాధ్యత నుండి తప్పుకోలేదు. తుదిశ్వాస విడిచే వరకు అదే లక్ష్యంతో పని చేశారు. అటువంటి ధైర్యశాలి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ స్ఫూర్తిదాయక జీవిత విశేషాలను ఓసారి మననం చేసుకుందాం....
మానికొండ సూర్యావతి... 1921లో కృష్ణాజిల్లాలోని గన్నవరం తాలూకా ఇందుపల్లిలో జన్మించారు. తల్లి బ్రమరాంబ, తండ్రి కోగంటి పున్నయ్య. చదువుకున్నది, పెరిగింది మాత్రం కాటూరులోని పినతండ్రి కడియాల గోపాలరావు వద్ద. ఆయన కమ్యూనిస్టు నాయకులు. ఆయన ప్రభావం సూర్యావతిపై ఎక్కువగా ఉండేది. చిన్నతనం నుండే సౌమ్యత, చిరునవ్వు ఆమె ఆభరణాలు. ఆనాటి సామాజిక పరిస్థితుల వల్ల 16 ఏండ్ల వయసులోనే నందమూరు గ్రామానికి చెందిన మానికొండ సుబ్బారావుతో ఆమె వివాహం జరిగింది. వీరికి వాణి, రమా అని ఇద్దరు ఆడపిల్లలు. పుట్టింట్లో గారాబంగా పెరిగిన సూర్యావతికి మెట్టినింట్లో కూడా అదే ప్రేమ దొరికింది.
చైతన్యం నింపేందుకు
అప్పటికే సోషలిస్టు, అభ్యుదయ భావాలకు ఆకర్షితులైన సుబ్బారావు భార్యను ఎంతగానో ప్రోత్సహించేవారు. పుస్తకాలు ఇచ్చి చదివించేవారు. కడియాల గోపాలరావుగారి ప్రోత్సాహంతో నాగళ్ళ రాజేశ్వరమ్మ, సూర్యవతి కలిసి కృష్ణాజిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి మహిళలను సమీకరించి సమావేశాలు ఏర్పాటు చేసేవారు. ''మీకు మొగుళ్ళున్నారా, ఆడవాళ్ళు మీటింగులు పెట్టడం ఏంటీ, సంచులు పుచ్చుకుని తిరుగుళ్ళేమిటి'' అంటూ మగవారితో పాటు ఆడవారు కూడా వీరిని తిట్టిపోసేవారు. ఆ మాటలకు మొదట్లో కాస్త భయపడినా భర్త, పినతండ్రి ప్రోత్సాహంతో సూర్యావతి తనకు తానే ధైర్యం చెప్పుకునేవారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, స్త్రీ విద్య ఆవశ్యకతను, స్వాతంత్రోద్యమంలో స్త్రీలు కూడా పాల్గొనాలంటూ అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నారు.
దాడులను ఎదుర్కొంటూ
1942లో కృష్ణాజిల్లా మహిళా మహాసభలో సూర్యావతి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం ఆమె పార్టీ కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో స్త్రీలకు ఆస్తి హక్కు కావాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పోరాటం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె బృందం అనేక దాడులను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. తాడంకి గ్రామంలో ఒకరు విరేశలింగంగారి ఉద్యమ స్ఫూర్తితో తన కుమార్తెకు వితంతు వివాహం జరిపించి వీరిని ఆహ్వానిస్తారు. కాటూరు గ్రామం నుండి సూర్యావతితో పాటు మరో పదమూడు మంది అక్కడకు వెళతారు. సమావేశం జరుగుతూ వుండగా ఛాందసులు కర్రలతో దాడి చేయటానికి వస్తారు. మహిళా నాయకులు నాగళ్ళ సరస్వతమ్మ, ఘంటా నాంచారమ్మ, కడియాల బుల్లెమ్మ కర్రలు తీసుకుని వారిని తిప్పికొడతారు.
నాట్లు వేసేందుకు
పేద, మధ్య తరగతి రైతాంగ స్త్రీలు బయటకు వెళ్ళి వ్యవసాయ పనులు చేయటానికి వీలులేని పరిస్థితులు ఆనాడు వుండేవి. దానికి వ్యతిరేకంగా మహిళలో ప్రచారం చేసి స్త్రీలు కూడా పని చేసుకోవచ్చునని ఆచరణలో నిరూపించేందుకు స్వయంగా నాట్లు వేశారు. దీనివల్ల కూడా వీరు అనేక ఇబ్బందులు పడ్డారు. వీరిని పొలాలకు వెళ్ళటానికి వీలులేదని పెత్తందారు హెచ్చరికలు జారీ చేస్తారు. కొందరు మాత్రం ప్రోత్సహించి వారి పొలాల్లో నాట్లు వేయడానికి అనుమతిస్తారు. అలా నాట్లు వేయడానికి వెళ్ళిన మహిళా సంఘం నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాట్లు వేయడానికి వెళ్ళిన మహిళలతో వాళ్ళ ఇండ్లలో పాలేర్లను మాన్పించి వారి చేతనే పేడ తీయించడం వంటి పనులు చేయించేవారు. వారితో మాట్లాడడం కూడా మానేశారు. అలాంటి కార్యకర్తలకు సూర్యావతి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులలో మార్పు కోసం కృషి చేస్తూనే ఉద్యమంలో భాగం పంచుకునేలా చేశారు.
ప్రజాప్రతినిధిగా...
ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిన ఫలితంగా ప్రజలతో విసృత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆమె నిస్వార్ధ సేవలను గుర్తించి నందమూరి ప్రజలు పంచాయితీ ఎన్నికల్లో మూడుసార్లు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్‌గా వున్న కాలంలో పంచాయితీ ద్వారా ఎన్నో మంచి పనులు చేపట్టి గ్రామస్తుల అభిమానం పొందారు. రోడ్లు వేయించడం, చెరువుకురేవు కట్టించడం వంటివి చేయించారు. గ్రామ ఆదాయం పెంచేందుకు మామిడి, కొబ్బరి చెట్లు నాటించారు. ఆరోజుల్లో ఎవ్వరూ చేయని విధంగా ఆమె దళిత కాలనీ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాలుగు ఎకరాల స్థలం వచ్చేలా చేశారు. అత్తగారు బుల్లెమ్మగారి సహకారంతో 25 సెంట్ల తమ సొంత స్థలాన్ని మహిళల మరుగుదొడ్డి నిర్మాణం కోసం ఉచితంగా ఇచ్చారు. సూర్యావతి చొరవతో ఆ చుట్టుపక్కల అన్ని గ్రామాలకంటే ముందే వీరి గ్రామంలోకి కరెంటు వచ్చింది. ఈ విధంగా ఆమె ఉద్యమం స్ఫూర్తినే కాదు పాలనా శక్తిని కూడా చాటుకున్నారు. కృష్ణాజిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి 1958లో ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. ఆరు సంవత్సరాల పాటు శాసనమండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. 1987లో ఉంగుటూరు మండల అధ్యక్షురాలిగా ఎన్నికై జాతీయ స్థాయిలో అగ్రగామి మండలంగా 1810 మరుగుదొడ్లను నిర్మించారు. ప్రజాప్రతినిధిగా పలు పదవులలో ఉన్నప్పటికీ ఆమె ఎంతో నిరాడంబరంగా, నిస్వార్ధంగా పనిచేశారు.
జైల్లోనూ పోరాటం
1964లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు చంటి పిల్లల తల్లిగా ఉన్న సూర్యావతిని పిల్లల నుండి విడదీసి భర్తతో పాటు జైలులో నిర్బంధించారు. 1948 ప్రాంతాలలో పార్టీని, పార్టీ సాహిత్యాన్ని, ప్రజాశక్తి వార పత్రికలను, ఆంధ్ర వనిత మాసపత్రికలను నిషేధించిన సందర్భంలో ఆ నిషేధానికి వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు పూనుకున్నపుడు బాష్పవాయువు ప్రయోగించి, లాఠీఛార్జి చేసి సూర్యావతితో పాటు 70 మందిని నందిగామ జైలులో నిర్బంధించారు. ఈ నిర్బంధ కాండలో సైతం సూర్యావతి తాను నమ్మిన ఆశయం కోసం దృఢ దీక్షతో అంకిత భావంతో పని చేశారు. ఈ విధంగా పలు సందర్భాల్లో జైలుకు వెళ్ళ వలసి వచ్చినపుడు అక్కడ కూడా హక్కుల కోసం పోరాటం చేశారు. మహిళా ఉద్యమకారులతో పాటు వారి పసిపిల్లలను కూడా జైల్లో ఉంచుకోవల్సి వచ్చేది. అయితే అప్పటి వరకు ఆ పిల్లలకు జైల్లో ప్రత్యేక రేషన్ ఉండేది కాదు. తల్లికి ఇచ్చిన ఆహారమే వారూ తినాల్సి వచ్చేది. అప్పుడు పిల్లలకు కూడా ప్రత్యేక రేషన్ ఇవ్వాలని ఆమె ఉద్యమం చేశారు. అలాగే బయట కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉన్న సమయంలో ఆమె జైల్లో ఉండి కూడా మేడే జెండా ఎగరవేసిన ధిశాలి.
కడవరకు ఆదర్శ జీవితం
1947లో రాష్ట్ర మహిళా సంఘం కార్యదర్శిగా ఎన్నికై రాష్ట్రమంతటా అనేక జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి సంఘ స్థాపనకు, నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు. 1942 నుండి 1988 వరకు జిల్లా కార్యదర్శిగా, 1989 నుండి జిల్లా అధ్యక్షరాలుగా ఉన్నారు. మహిళలు కేవలం మహిళా సమస్యలపైనే కాకుండా వర్గ ఉద్యమాలు, ప్రజాతంత్ర పోరాటాలలోకి కూడా పాల్గొనేట్టు కృషి చేశారు. 1975లో భర్త సుబ్బారావు మరణంతో ఆమె ఎంతో కుంగిపోయారు. అయినప్పటికీ తన కర్తవ్యాన్ని మరువకుండా ఉద్యమంలో తన వంతు పాత్ర నిర్వహిస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. 1990లో జిల్లాలో మొదటిసారి న్యాయసలహా సంఘం ఏర్పాటు చేశారు. దీని ఏర్పాటులో సూర్యావతి కృషి ఎనలేనిది. చనిపోయే వరకు ఆమె ఆ సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్నారు. 71 సంవత్సరాల వయసులోనూ మహిళలపై జరుగుతున్న దాడుకు వ్యతిరేంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆమె మరణించిన రోజు 1993 జూలై 4వ తేదీ కూడా ఆమె హైదరాబాద్ గాంధీభవన్‌లో 41 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొని మహిళా సంగం తరపును ఉత్తేజరకమైన ఉపన్యాసం ఇచ్చి వచ్చారు. అటువంటి గొప్ప చైతన్యం కలిగిన మహా మనిషి కా|| సూర్యావతి.
అమ్మంటే చైతన్యం
అందరికీ అమ్మంటే అమృతమయి. నాకు మాత్రం అమ్మంటే ఓ ధైర్యం. అమ్మంటే చైతన్యం. అమ్మ... ప్రేమా, ఆప్యాయతను పంచే మంచి మనిషి. స్నేహం, సౌశీల్యం, ధైర్యం, సాహసం అన్ని కలబోసిన మహా మనిషి. నేను అమ్మతో గడిపిన కాలం చాలా స్వల్పం. ఎందుకంటే నేనూ, చెల్లి రమ పుట్టిన దగ్గర నుండి మా మేనత్త దమయంతి దగ్గరే పెరిగాం. ఎప్పుడైనా సమావేశాలు ఉంటే అమ్మ మా దగ్గరకు వచ్చేది. అప్పుడు మాకు సందడే సందడి. ఉన్న కాసేపైనా మా పనులన్నీ తనే చూసుకునేది. మా అమ్మానాన్న ప్రజాసేవకు అంకితమై పని చేస్తున్నారని వారికి ఇబ్బంది లేకుండా అత్తయ్యనే మమ్మల్ని పెంచింది. అమ్మ చిన్నప్పటి నుండే ఆర్థిక విషయాలను మాతో చెప్పేది. మహిళా సంఘం క్లాసులకు తీసుకెళ్ళేది. అమ్మకు చదువంటే చాలా ఇష్టం. నేను ఎలాగైనా ఎస్ఎస్ఎల్సి పూర్తి చేయాలని చాలా కోరుకునేది. అమ్మ ఆశయాలు, ఆలోచనలు, ఆచరణలు తలుచుకుంటూ ఎంతోకొంత మహిళలు, పిల్లలకు సేవచేయొచ్చు, అమ్మకు ఆర్థిక భారం లేకుండా చూడొచ్చనే తపనతో మహిళా శిశుసంక్షేమ శాఖలో ఉద్యోగంలో చేరాను. ''ఎక్కడ ఉన్నా ప్రజల కోసం, పార్టీ కోసం పని చేయాలి'' అని చెప్పేది అమ్మ. ఆ స్ఫూర్తితో మహిళా ఉద్యోగుల సమస్యలపై పని చేయడం మొదలుపెట్టాను. అమ్మ స్ఫూర్తితోనే ఐద్వా నగర శాఖలో, సిఐటియూ శాఖ సభ్యురాలిగా, సిఐటీయూ వర్కింగ్ ఉమెన్ విభాగంలో పని చేశాను. ఇప్పటికీ అమ్మ నుండి పొందిన ఆ స్ఫూర్తితోనే ఆ భావాలతోనే ఉన్నాను... ఉంటాను...
సేకరణ: ''మహిళా ఉద్యమ మణిపూస
మానికొండ సూర్యావతి'' పుస్తకం నుండి