Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి తొలిమెట్టు. ఇళ్ళ ముందుండే మురికి కాలవలు, మురికి గుంటలు దోమలకు నెలవులు. అలాగే నీళ్ళు నిలవ ఉండే సంపులు, డ్రమ్ములు వంటి వాటికి మూతలు లేకపోతే దోమలు నివాసం ఏర్పరచుకుంటాయి. వాడేసిన కొబ్బరి బోండాలు, పగిలిపోయిన ప్లాస్టిక డబ్బాలు అలా వదిలేస్తే నీళ్ళు చేరి దోమలను ఆహ్వానిస్తాయి. అలా దోమలు దూరి వాటి సంసారాలను వృద్ధి చేసుకుని, వాటి ఆహారం కొరకు మానవులను కుట్టి రోగాలను వ్యాప్తి చేస్తున్నాయి. వాటి శరీరాలకు, కాళ్ళకు అంటుకునే బాక్టీరియా, కడుపులో ఉండి జీవిత చక్రం సగం పూర్తి చేసుకున్న వైరస్లు అవి కుట్టటం వలన మానవులలోకి ప్రవేశిస్తాయి. బాక్టీరియా వైరస్లు మానవుల శరీరాల్లో చేరి అనేక రోగాలను కలగజేస్తాయి. అందుకే పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా మల మూత్రాలకు తప్పని సరిగా శౌచాలయాలను వాడేలా చూడాలి. స్వచ్ఛభారత్ కచ్చితంగా అమలు కావాలంటే, ఆరోగ్య భారతంగా నిలబడాలంటే శౌచాలయాల వాడకం, పరిశుభ్రత చాలా అవసరం. అందుకే శుభ్రంగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం... ఈ రోజు పాడేసే వస్తువులతో డెడ్డీ బేర్లను తయారు చేద్దాం...
చెట్ల ఆకులతో...
మా ఇంటి ముందు రోడు పక్కగా పెట్టే చెట్లను నాటారు. ఆ చెట్లు ఆకాశమంత ఎత్తు ఎదిగి మా బిల్డింగ్ ఎండ తగలకుండా కాపాడుతున్నాయి. బయటి నుండి చూసేవాళ్ళకి ఇక్కడో ఇల్లుందని కూడా తెలియకుండా వాటి ఆకుల్లో దాచేస్తున్నాయి. ఒక టేకు చెట్టు, ఒక కానుగ చెట్టు, ఇంకేవో చిన్న చిన్న ఆకుల చెట్లు వరసగా నిటారుగా పెరిగాయి. చిన్నచిన్న ఆకుల చెట్టు పేరేమిటో తెలియదు గానీ ఆకులు ఎంత బాగున్నాయో! గుండ్రంగా, కొద్దిగా కోలగా ఉండే చెట్ల ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో నిండుగా ఉన్నాయి. ఆకులు మందంగా ఉండి రెండు మూడు రోజుల దాకా వడలిపోకుండా ఉండటం వలన నా బొమ్మలకు బాగా పని కొస్తున్నాయి. ఈ ఆకులు కోసుకొచ్చి నేను ఎలుగుబంటిని తయారు చేశాను. ఎలుగుబంట్లు పగలంతా చెట్ల మీద నిద్రపోతూ రాత్రి పూట చురుకుగా తిరుగుతుంటాయి. ఈ ఎలుగుబంట్లు మొక్కల్ని, జీవుల్ని కూడా తింటాయి. అందుకే వీటిని సర్వభక్షకాలు అంటారు. వీటిలో ధృవపు ఎలుగుబంట్లు మాంసాహారులు. అలాగే పాండా వెదురు చెట్ల చిగుళ్ళను తింటూ శాకాహారిగా పేరు తెచ్చుకుంది. ఎలుగుబంట్లు భారీ శరీరంతో చెట్ల కొమ్మమలపై పడుకొని నిద్రపోతూ ఉంటాయి. బలమైన కాళ్ళు, పొడవైన మూతి, పొట్టితోక, గరుకుగా ఉండే వెంట్రుకలతో ఉంటాయి. వీటి పంజాలకు పదునైన గోర్లుంటాయి.
పుట్నాలపప్పుతో...
నేను పుట్నాలపప్పును ఎక్కువగా అమ్మాయిల బొమ్మలకే వాడుతుంటాను. అమ్మాయిల రంగుకు సరిపోతుందని తయారు చేస్తాను. కానీ ఈరోజు ఒళ్ళంతా నల్లటి బొచ్చుతో ఉండే ఎలుగుబంటిని తయారు చేశాను. ఎంత బాగుందో చూడండి. పిల్లలకు టెడ్డీబేర్లని తయారు చేసి అమ్ముకునే వారిని మెచ్చుకోవాలి. పులి వంటి బొమ్మలతో పాటు క్రూరమృగాలైన ఎలుగుబంటిని కూడా పిల్లల బొమ్మల్లో చేర్చుతున్నారు. ఈ ఎలుగుబంట్లు 'ఆక్సిడే' కుటుంబానికి చెందిన క్రూరమృగాలు. ఇవి ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ఇవి గుహల్లోనూ, పెద్ద గోతుల్లోనూ నివసిస్తాయి. ఇవి నీటిలో ఈదగలవు, చెట్లు ఎక్కగలవు, స్పీడుగా పరిగెత్తగలవు ఒంటరిగా జీవిస్తాయి. ప్రస్తుతం ఆరు జాతుల ఎలుగుబంట్లు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మొత్తం ఎనిమిది జాతులు మాత్రమే ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి. పుట్నాలపప్పు మంచి పౌష్టికాహారం. ప్రోటీనులు అధికంగా ఉండే పప్పు పుట్నాలపప్పు. పుట్నాల ఉత్పత్తిలో ప్రపంచం మొత్తంలో భారతదేశం అగ్రగామిగా ఉన్నది. దీని శాస్త్రీయనామం ''సైసర్ అరైటినమ్''. ఇది ఫ్యాబేసి కుటుంబానికి చెందినది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాలో పుట్నాలపంటను అధికంగా పండిస్తారు. పుట్నాల పంట వర్షాధార పంటగా పండిస్తారు. వందగ్రాముల పుట్నాల్లో 164 కి.కాలరీల కార్బోహైడ్రేట్స్ 4.8 గ్రా. ఫైబర్ ఉంటుంది.
గులాబీ రెక్కలతో...
మా ఇంట్లో ఎరుపు, తెలుపు, పింక్ గులాబీ చెట్లున్నాయి. ఎర్రగులాబీ ఒకేసారి గుత్తుగా ఆరు గులాబీలు పూస్తుంది. ఒకే గుత్తిలో ఆరేడు గులాబీలు రావడంతో వాటితో ఎలుగుబంటిని తయారు చేశాను. పిల్లలు ఆడుకునే టెడ్డీబేర్ ఆకారంలో తయారు చేశాను. యునైటెడ్ స్టేట్స్ జాతీయ పువ్వుగా గులాబీని పెట్టుకున్నారు. గులాడీ పువ్వు రోసా జాతికి చెందినది. వీటిలో మూడు వందలకు పైగా జాతులున్నాయి. గులాబీ పువ్వును పువ్వుల్లో రాణిగా గొప్పగా వర్ణిస్తారు. గులాబీ మొక్కలను చాలా జాగ్రత్తలతో పెంచుకోవాలి. పూర్తి ఎండలో కాకుండా కొద్దిగా నీడలో పెంచుకోవాలి. గులాడీ పూల నుంచి అత్తరును తయారు చేస్తారు. గులాబీ అత్తరును పరిమళ ద్రవ్వాలలో కొన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు. గులాబీ పూల నుండి ఆవిరి ద్వారా నూనెను తీస్తున్నారు. పూలరాణి గులాబీ రెక్కలతో ఎలుగుబంటి తయారయింది. సున్నితమైన గులాబీ రెక్కలతో బండగా ఉండే ఎలుగును చేయడం సరికొత్తగా ఉంది.
ప్లాస్టిక్ గుండీలతో...
వెంటిలేటర్లో ఎన్నో పైపులు ముక్కుకు, నోటికి అమర్చబడి ఉంటాయి. ఆ పైపుల్లో ఎన్నో ప్లాస్టిక్ పదార్థాలు మూతలుంటాయి. ఇలాంటి మూతల్ని సేకరించి నేను బొమ్మలు చేస్తున్నాను. ఈ ప్లాస్టిక్ గుండీల్లాంటివి తెల్లని తెలుపుతో ఉంటాయి. నల్లగా, అసహ్యంగా ఉండే ఎలుగుబంటిని నేను తెల్లని ప్లాస్టిక్ గుండీలతో చేసి అందంగా మార్చేశాను. చూడండి మీరూ ఇలా అందాల మొగ్గగా మార్చవచ్చు. రకరకాల ఎలుగుబంటుల్ని తయారు చేసి నేను ఎలుగెత్తి చాటుతున్నాను. ఈ ''ఎలుగెత్తి చాటటం'' అనే మాట ఎలుగుల నుంచే ఉత్పన్నమయిందట. పొడవు మూతితో ఉండి పొలాల్లో మనుష్యుల మీద దాడి చేస్తుంది. ఆసియాటిక నల్ల ఎలుగుబంట్లు, ధృవపు ఎలుగుబంట్లు, మంచు ప్రదేశాల్లో ఉండే ఎలుగుబంట్లు ఎన్నో రకాలున్నాయి. సన్బేక్, స్లాత్ బేర్, యూరోపియన్ కేవ్ బేక్, ఫార్మోసాన్ బ్లాక్ బేర్ వంటి జాతులు ప్రమాదంలో ఉన్నాయి.
పల్లీలతో...
పల్లీలు, వేరు శనగకాయలు పేరు ఏదైనా నూనె గింజల పంట. ఆంధ్రదేశంలో పండే ప్రదాన మెట్టపంట. నీరు తక్కువగా దొరికినా కూడా పోషకాల పల్లీలో నూనెను నింపి మన కందిస్తుంది. ఈ పల్లీలు మన దేశపు పంటకాదు. దక్షిణ అమెరికాలో పుట్టింది. అయినా మనం పండిచు కుంటున్నాం. వీటికేమీ పౌరసత్వాలు లేవుకదా! ఇది 'లెగూమినోసి' కుటుంబానికి చెందిన మొక్క. ఇది తన గింజల్ని, కాయల్ని ఎవరికీ కనబడకుండా నేల లోపల దాచుకుంటుంది. తన పిల్లలు ఎంత బలంగా పెరిగాయో, ఎంత వేగంగా పెరిగాయో ఎవరూ చూడకుండా చూసుకుంటుంది. ఉష్ణ మండల ప్రదేశాలలో, రాయలసీమలో ప్రధానంగా పండిస్తారు. గుల్లగా ఉండే వ్యవసాయ భూములు ఈ పంటకు అనుకూలంగా ఉంటాయి. బలవర్ధక ఆహారమైన పల్లీలతో బలమైన భారీ ఆకారపు ఎలుగుబంటి తయారయింది... బాగుందా..!
- డా|| కందేపి రాణిప్రసాద్