Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2016లో పంఖురి రాజ్ కూతురికి ఒకటిన్నర సంవత్సరాలు. ఆమె తన బిడ్డతో ఎక్కువ సమయం గడపడానికి బ్యాంక్ ఉద్యోగం వదిలేశారు. ఇంట్లోనే ఉంటూ కెరీర్‌ను ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించారు. బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి 2017లో ఇ-కామర్స్ బ్రాండ్ మైష్కాను ప్రారంభించారు. మహిళల కోసం ఎత్నిక్ వేర్, ఫ్యూజన్ వేర్లను అందిస్తున్నారు. ప్రస్తుతం వంద మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కేవలం మూడు లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఆమె వ్యాపారం గతేడాది పది కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఆమె విజయం వెన దాగివున్న శ్రమను ఓ సారి తెలుసుకుందాం...
ఇండస్ఇండ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లలో పంఖురి 15 సంవత్సరాలకు పైగా పనిచేశారు. బిడ్డ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆమె ఉద్యోగం వదిలేయడానికి మరొక కారణం కూడా ఉంది. ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ముఖ్యంగా మహిళలకు ఉపాధిని కల్పించే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారు. డెహ్రా డన్, రాంచీ వంటి చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలు బట్టలు కొనుగోలు చేయడానికి ఢిల్లీ, కోల్‌కతాకు తరచుగా వెళ్తారని ఫ్యాషన్ పట్ల మక్కువ ఉన్న పంఖురి పోస్ట్ చేశారు. ''ఆ రోజుల్లో చిన్న పట్టణాలలో కొన్ని స్టైలిష్ ఎంపికలు అందుబాటులో ఉన్నా ఇకామర్స్ ఇంకా పెద్దగా ప్రారంభించబడలేదు'' అని ఆమె చెప్పింది.
ఇకామర్స్ రాజ్యమేలుతుంది
2008లో ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి షాపింగ్ చేయడం ప్రారంభించినప్పుడు దానివల్ల కలిగే సౌలభ్యాన్ని ఆమె అర్థం చేసుకున్నారు. ఇది మహిళల దుస్తులపై దృష్టి సారించే ఈకామర్స్ వ్యాపారాన్ని పరిశోధించడానికి కూడా ఆమెను ప్రేరేపించింది. అలా నెమ్మదిగా మొదలైన ఆలోచన ఓ స్థిరమైన వ్యాపారానికి నాంది పలికింది. దుస్తులను సోర్స్ చేయడానికి తయారీదారులను కలవడానికి తరచుగా ఢిల్లీ, జైపూర్, సూరత్‌లకు వెళ్లి ఢిల్లీలోని గిడ్డంగి నుండి పని చేసేది. 2017లో ఫ్లిప్‌కార్ట్‌లో చిన్నగా ప్రారంభించిన ఆమె బ్రాండ్ మైష్కా నెమ్మదిగా ప్రజాదరణ పొందడం ప్రారంభించింది. పూర్తి సమయం వ్యాపారం వైపు మళ్లేందుకు ఆమె తన ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.
కొన్ని అనుమానాలు ఉన్నా...
ఎలాంటి ఇబ్బంది లేని మంచి బ్యాంకు ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారం ఎందుకు చేస్తుందంటూ తన చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. మొదట్లో ఆమెకూ కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ తన ప్రయత్నాన్ని కొనసాగించారు. పంఖురి తన పరిశోధనలో స్థిరంగా ఉండేవారు. అనేక మాల్స్‌ను సందర్శించి వర్క్‌వేర్ విషయంలో మహిళలకు ఏమి కావాలని అడిగారు. స్వయంగా డిజైన్ చేస్తూ మహిళలకు సౌకర్యంతో పాటు అందుబాటు ధరలపై దృష్టి సారించారు. సుమారు రూ. 500 ధర కలిగిన కుర్తాలు, టాప్స్‌తో తన వ్యాపారాన్ని ప్రారంభించారు.
పది మందితో కలిసి...
''ప్రారంభంలో ప్రజలు ఆన్లైన్ బ్రాండ్లను ఎక్కువగా విశ్వసించలేదు. అంతేకాకుండా తక్కువ ధరల కోసం చూసేవారు'' అని ఆమె గుర్తుచేసుకున్నారు. 2019లో ఆమె మైంత్రా, జబాంగ్‌లకు 50 నమూనాలను అందించారు. అవి ఎంపికయ్యాయి. దాంతో తన కార్యకలాపాలను కూడా విస్తరింపజేశారు. నోయిడా ఇండిస్టియల్ ఏరియాలో పది మంది బృందంతో ఒక యూనిట్‌ను ప్రారంభించారు. ఇందులో టైలర్లు, ప్యాటర్న్మేకర్లు, ఎంబ్రాయిడరీ చేసేవారు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది మహిళే. కేవలం నాలుగు రోజుల్లోనే ఆమెకు 3,500కు పైగా ఆర్డర్లు వచ్చాయి.
ఇంటి గడప దాటి ఎరుగరు
ప్రస్తుతం ఆమె ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ''నా సిబ్బందిలో చాలా మంది సమీపంలోని గ్రామాలకు చెందినవారే. వారిలో కొందరు మిష్కాకు వచ్చే వరకు పని కోసం బయటకు వెళ్ళినవారు కాదు. అసలు ఇంటి గడపే దాటి ఎరుగరు. అలాంటి వారు ఇప్పుడు దాదాపు 10,000-12,000 ఆదాయాన్ని సంపాదిస్తారు. ప్యాకింగ్, థ్రెడ్ కట్టింగ్, టైలరింగ్ మొదలైన అన్ని రకాల పనులు చేసేందుకు వారు అందుబాటులో ఉంటారు'' అని ఆమె చెప్పారు.
సొంత దుకాణాలు పెట్టి
ఫ్లిప్‌కార్ట్‌లో 50 ఉత్పత్తులతో ప్రారంభించిన మిష్కా ఇప్పుడు మహిళల కోసం 700 రకాల దుస్తులను అందుబాటులో ఉంచారు. అలాగే అవి అమెజాన్, మైంత్రా, అజియో వంటి ప్రధాన ఈకామర్స్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల పంఖురి తమ సొంత దుకాణాలలో బ్రాండ్‌ను ప్రదర్శించడానికి షాపర్స్ స్టాప్‌తో టైఅప్ చేశారు. మహమ్మారి సమయంలో కంపెనీ రెండు నెలలు పూర్తిగా మూసివేయబడినప్పుడు పంఖురి సిబ్బందిని వదిలిపెట్టలేదు. పైగా వారి కుటుంబాలు గడవటం కోసం అవసరమరైన ఖర్చులను కూడా ఇచ్చారు.
లాక్డౌన్లో చేసిన సహాయమే
'నేను నా బ్యాంకింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు నా జీతం దాదాపు 90,000. మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన నేను ఇతరులకు ఉద్యోగాలను కల్పించగలనని నమ్మి ఈ వ్యాపారంలోకి వచ్చాను. కొందరికైనా ఉపాధి కల్పించడం చాలా సంతోషంగా ఉంది. లాక్డౌన్ సమయంలో నా సిబ్బందికి నేను చేసిన సహాయం వారు నాతో ఉండేలా చేసింది. పరిస్థితి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మా పని ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది'' అని ఆమె జతచేస్తుంది.
మార్పులు గమనించి
జూన్ 2021లో ఫ్యాక్టరీ తిరిగి తెరిచినప్పుడు ఆన్లైన్ షాపింగ్‌లో కొన్ని మార్పులు రావడాన్ని పంఖురి గ్రహించారు. కొంతమంది కొత్త కస్టమర్లు అత్యుత్తమ ధరతో అధునాతన స్టైల్స్, నాణ్యమైన ఉత్పత్తుల కోసం చూస్తున్నారు. మైష్కా బ్రాండ్ ధర రూ. 300 నుండి రూ. 3,000 మధ్య ఉంది. మహిళలు విలువలతో పాటు ఫ్యాషన్ దుస్తులను ఇష్టపడుతున్నారు. దుబారు, మలేషియాలోని బోటిక్‌లకు కూడా ఆమె సరఫరా చేస్తారు. ఆగస్ట్ 2021లో నోయిడాలో ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా రెండు మైష్కా షాపులు కూడా ప్రారంభించబడ్డాయి. పంఖురి త్వరలో పూర్తిగా మహిళల నేతృత్వంలోని కుట్టు యూనిట్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3 లక్షల ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించిన ఆమె బ్రాండ్ గత ఏడాది రూ. 10 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ ఏడాది ఆరు నెలల్లో ఇప్పటికే రూ. 10 కోట్లను దాటింది.
అంత సులభం కాదు
మహిళా వ్యాపారవేత్త కావడం అంత సులభం కాదు. ప్రజలు మమ్నల్ని అంత తేలికగా విశ్వసించరు. మహిళ వ్యాపారం చేస్తుందంటే అంగీకరించరు. కానీ కాలక్రమేణా వారి ఆలోచనల్లో మార్పు వస్తుంది. మహిళలు బహుళ పనులు చేసేందుకే జన్మించారని అందరూ అంటుంటారు. దాన్ని నేను నమ్ముతున్నాను. అదే మనకు అనుకూలంగా పని చేస్తుంది. అవకాశం వస్తే సెలబ్రెటీలతో భాగస్వామి కావాలని కూడా చూస్తున్నాను.
- పంఖురి
- సలీమ