Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ సంగీత పరిశ్రమలో తగినంత మంది మహిళలు లేరు. కళాకారులు, గీత రచయితలు, నిర్మాతలు, పోడ్కాస్టర్ల నుండి ఈ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న మహిళలను ఈ ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఆడియో స్ట్రీమింగ్‌లో తమ వంతు పాత్ర పోషిస్తున్న అలోకానంద దాస్‌గుప్తా, నిఖితా గాంధీ అనే మహిళలు అందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఈ రంగంలో వారి ప్రయాణ అనుభవాలు మానవి పాఠకుల కోసం...
స్పాటిఫై అనేది మహిళా కళాకారులపై దృష్టి సారించే ఒక రకమైన ప్లాట్‌ఫారమ్. ఇది యాంప్లిఫైహర్ అనే కార్యక్రమాన్ని మహిళల కోసం ఏడాది పొడవునా నిర్వహిస్తుంది.
అలోకానంద దాస్‌గుప్తా
సినిమాలు, సంగీతం అనేవి అసలు తన జీవితంలోకి వస్తాయని అలోకానంద ఎప్పుడూ ఊహించలేదు. ప్రముఖ కవి, చిత్రనిర్మాత బుద్ధదేబ్ దాస్‌గుప్తా కుమార్తె ఈమె. తన తల్లి ప్రేరణతో అలోకా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ''కోల్‌కతాలో సాహిత్యం చదువుతున్నప్పుడు నేను పియానో కూడా నేర్చుకుంటున్నాను. దీన్ని ఏదో ఒక విధంగా కొనసాగించడం అనుకోకుండా జరిగిపోయింది. అప్పటికి నేను ప్రొఫెషనల్ కాదని నాకు తెలుసు. కానీ సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నాను'' అని ఆమె గుర్తుచేసుకుంది.
భయం కాస్త తగ్గింది
అలోకా టొరంటోకు వెళ్లింది. అక్కడ ఆమె యార్క్ విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ ఫెర్పార్మెన్స్ అండ్ కంపోజింగ్లోలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. చాలా చిన్న వయసులోనే సంగీతాన్ని కంపోజ్ చేయడం ప్రారంభించినప్పటికీ, దానిని ఎవరికీ చూపించనని అలోక అనేది. కానీ టొరంటో వెళ్ళిన తర్వాత ఆమె భయం కాస్త తగ్గింది. ఎవరి ముందు ప్రదర్శన ఇవ్వకుండా తన సంగీతాన్ని వ్యక్తీకరించడానికి ఒక మార్గాన్ని కనుగొంది.
మొదటి ఫ్రొషెనల్ కంపోజిషన్
పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం, రవీంద్ర సంగీతం, పింక్ ఫ్లాయిడ్, ది బీటిల్స్, కార్పెంటర్స్ వంటి అనేక ప్రపంచ చలనచిత్రాల సంగీతం ఆమెను ప్రారంభంలోనే ప్రభావితం చేశాయి. మరాఠీ చలనచిత్రమైన 'షాలా' ఆమె మొదటి ప్రొఫెషనల్ కంపోజిషన్. ఈ చిత్రానికి ఆమె 2010లో జాతీయ అవార్డును గెలుచుకుంది. అప్పటి నుండి ఆమె బిఎ పాస్, ఫాండ్రీ, అన్వర్ కా అజబ్ కిస్సా, ఆషా జార్ మాజే, ట్రాప్డ్ వంటి వాటికి సంగీతం అందించింది. అలాగే బ్రీత్, సేక్రేడ్ గేమ్స్, లీలా వంటి వెబ్ సిరీస్ కోసం నేపథ్య స్కోర్లను కంపోజ్ చేసింది. సంగీతంలోని విభిన్న శైలులను అన్వేషించడం ద్వారానే తన అభివృద్ధి సాధ్యమైనదని ఆమె అంటుంది.
కొత్తగా ఆలోచిస్తేనే...
''సాధారణంగా నేను ఖాళీగా ఉండేందుకు ఇష్టపడను. కొన్నిసార్లు నా పనులు నాకు బోర్‌గా అనిపిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. మీరు సంగీత స్వరకర్త అయితే మీ పని ఇతర వ్యక్తుల సంగీతాన్ని వినడం, వినిపించడం, ఆమోదం పొందడం చాలా ముఖ్యం. మీరు కోరుకునేది, వారు కోరుకునే వాటి మధ్య బ్యాలెన్స్ చేయడం పెద్ద పోరాటం. కాబట్టి ఆ సమతుల్యతను సాధించడంలో మీరు వినడాన్ని ఆస్వాదించాలి. విభిన్నంగా ఏదైనా చేయాలనుకోవడం ద్వారా అభివృద్ధి చెందాలి'' అంటుంది అలోక.
అద్భుతమైన అనుభవం
మరాఠీ చిత్ర పరిశ్రమలో పనిచేయడం ఓ అద్భుతమైన అనుభవం అని అలోకా చెప్పింది. ''నాగరాజు మంజులే లాంటి సామాన్య దర్శకుడిని కలవడం నా అదృష్టం. ఇది చిన్న పరిశ్రమ అయినందున స్కోర్‌పై బహుశా తక్కువ ఆసక్తి ఉందని మీరు అనుకోవచ్చు. కానీ ఆలోచనల పరంగా సంగీతంపై నాగరాజు ఆసక్తి చాలా ఎక్కువ. నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే ఈ పరిశ్రమలో పనిచేయడం ఓ అద్భుతమైన అనుభవం. ఇక్కడ నేను ముంబైలో ఎదుర్కొన ఒత్తిడిని అనుభవించలేదు'' అని ఆమె జతచేస్తుంది.
వివక్షను పట్టించుకోలేదు
ఆర్టిస్టులందరికీ తగిన గుర్తింపు రావల్సిన అవసరం ఉందని అలోకా అభిప్రాయపడింది. ''మనం మన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు మొదటి నుండి ఎందుకు ప్రారంభించకూడదు. వాటిని అణచివేయకుండా ప్రయత్నించినపుడే విజయం సాధించగలము. భయపడకుండా ప్రవాహానికి వ్యతిరేకంగ ప్రయత్నించినపుడే మనం ఈత నేర్చుకుంటాం. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను'' అంటుంది ఆమె. అలాగే ఈ పురుషాధిక్య పరిశ్రమలో తాను మొదటి నుంచి లింగ వివక్షను పట్టించుకోలదని చెబుతుంది.
పోరాటానికి సహాయం చేస్తాయి
''స్పాటిఫై, యాంప్లిఫైహర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు కళాకారులకు తమను తాము వ్యక్తీకరించడానికి పెద్ద లైసెన్స్. మహిళలు తమ భావాలను వ్యక్తీకరించడానికి చేసే పోరాటంలో ఇవి సహాయపడతాయని ఆమె అంటున్నారు. ''మీరు మీ సంగీతాన్ని తయారు చేస్తారు. దానిని అక్కడ ఉంచుతారు. దీనికోసం మీకు మధ్యవర్తి అవసరం లేదు. అణచివేతకు గురికావల్సిన అవసరం లేదు. పరిశ్రమలో ఉండే అలాంటి సమస్యలన్నీ మీరు అనుభవించాల్సిన అవసరం లేదు'' అని అలోకా అంటుంది.
నిఖితా గాంధీ, నేపథ్య గాయని
కోల్‌కతాలో పుట్టిన పెరిగిన ఖితా గాంధీ నేపథ్య గాయనిగా ఇప్పటి వరకు నాలుగు భారతీయ భాషలలో పాడారు. ఆమె ఏ.ఆర్. రెహమాన్ 'ఓకె కన్మణి', రాబ్తా 'టైటిల్ ట్రాక్' పాటలను పాడింది. అలాగే బెంగాలీ పాట మిథే అలోలోని పాటలకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె హిందుస్తానీ సంగీతంతో పాటు ఒడిస్సీ కూడా నేర్చుకుంది. వృత్తిపరమైన గాయకురాలిగా ఉండటం ఆమె ప్రణాళికలో భాగం కాదు. పాఠశాలలో చదివేటపుడే ఆమె హార్మోనియం, గిటార్‌పై పాటలు కంపోజ్ చేసేది.
కెరీర్‌ను మార్చేసింది
మొదటి నుండి సంగీతం ఆమెలో ఓ భాగమైపోయింది. అయితే చెన్నైలోని డెంటల్ స్కూల్‌కి వెళ్లడం ఆమె కెరీర్‌ని మార్చేసింది. సంగీతం నేర్చుకుంటూ ఒత్తిడి నుండి బయటపడేందుకు ఏ.ఆర్.రెహమాన్ కెఎం మ్యూజిక్ కన్జర్వేటరీలో పార్ట్-టైమ్ కోర్సులో చేరింది. ''అక్కడ ఎవరో నా వాయిస్‌ని ఇష్టపడ్డారు. వారు నన్ను పాడటం కోసం పిలిచారు. ఈ హిల్టన్ లాంజ్ గిగ్‌లు, వస్తువులను నేను శుక్రవారం రాత్రులు చేయడం ప్రారంభించాను. ఇది కేవలం అనుభవం కోసమే. రెహమాన్ సర్ ఒక ఆడిషన్లో నా వాయిస్ విని తన ప్రాజెక్ట్ కోసం నన్ను పిలిచినప్పుడు కూడా సంగీతం నా మార్గం అని నేను అప్పటికీ నమ్మలేదు. ఇది ఒక క్రేజీ, కూల్ ఎక్స్‌పీరియన్స్‌గా భావించాను'' అని నిఖిత గుర్తు చేసుకున్నారు.
రెహమాన్ నుండి పిలుపు
ఓ సెషన్లో రెహమాన్ కాలేజీ తర్వాత ఏమి చేయాలనుకుంటున్నారని ఆమెను అడిగారు. మాస్టర్స్ కోసం దరఖాస్తు చేస్తున్నానని ఆమె సమాధానం ఇచ్చింది దానికి అతను, 'నువ్వు గాయకురాలివి, మీరు పాడబోతున్నారు' అని అన్నారు. అప్పుడే మొదటిసారిగా నిఖిత పూర్తి సమయం సంగీత విద్వాంసురాలుగా మారాలని భావించింది. ఎందుకంటే అది ఏ.ఆర్. రెహమాన్ నుండి వచ్చిన పిలుపు అని ఆమె చెప్పింది.
మంచు గడ్డను బద్దలు కొట్టి
''చెన్నైలో నివసించడం నాకెంతో సహాయపడిందని భావిస్తున్నాను. ఆ భాష మాట్లాడే వ్యక్తులు నన్ను చుట్టుముట్టారు. దక్షిణ భారత మాండలికాల గురించి తెలియని వారికి ఇది కఠినమైన భాష. వారు పదాలను ఉచ్చరించే ప్రకంపనలను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి అది నాకు సులభతరం చేసింది. నా మొదటి పాట ద్వారా మహిళ ఓ మంచు గడ్డను బద్దలు కొట్టిందని నేను అనుకుంటున్నాను, ఆ తర్వాత అది ఎంతో తేలికయింది'' అని ఆమె చెప్పింది.
అవకాశాలు అందుకుంది
లాక్డౌన్ సమయంలో ఆమె తన కంపోజిషన్లను, రిక్రియేషనల్ లవ్ అనే ఆంగ్ల పాటను విడుదల చేయడం ప్రారంభించింది. దాంతో ఆమె ప్రముఖ గాయకులు, స్వరకర్తలు, గాయకులు, నిర్మాతల నుండి అవకాశాలు అందుకుంది. గాయని-కంపోజర్ ఈ రెండు విషయాల్లో స్త్రీలను భిన్నంగా చూడాలని విశ్వసించనప్పటికీ సంగీత పరిశ్రమలో చాలా తక్కువ మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
మహిళలకు ఆసక్తి ఎక్కువ
''మహిళలు సంగీతం పట్ల మరింత ఆసక్తికరమైన రుచిని కలిగి ఉంటారని నేను భావిస్తున్నాను. పాడటం వృత్తిగా ప్రాధాన్యం ఇవ్వబడినప్పటికీ పాటల రచన ఉత్పత్తి చాలా తక్కువగా జరుగుతుంది. మమ్మల్ని మేము నిరూపించుకునే క్రమంలో మాలో రావాల్సిన మార్పుల విషయంలో యాంప్లిఫైహర్ వంటి మరిన్ని కార్యక్రమాలు అవసరం'' అని ఆమె చెప్పింది. భవిష్యత్తులో నిఖిత విభిన్నమైన ఆర్టిస్టులతో కలిసి తన ఆలోచనలను మిక్స్ చేసేందుకు ఎదురుచూస్తోంది.
మహిళలకు మంచి ఫ్లాట్‌ఫాం
ఈ ప్లాట్‌ఫాం మూడు కారణాల వల్ల రూపొందించబడింది. రాబోయే ప్రతిభకు ఇప్పటికే స్ఫూర్తిదాయకంగా ఉన్న మహిళలపై ఆడియోలో స్పాట్‌లైట్‌ని ఉంచడమే మా లక్ష్యం. సంగీతం, పాడ్‌క్యాస్ట్ పరిశ్రమలలో భాగం కావాలనుకునే ఎవరైనా నేర్చుకోవడానికి, వారు సాధించిన విజయాల గురించిన కథనాలను చెప్పగలిగే ప్లాట్‌ఫారమ్‌లను గుర్తించి అందించాలనుకుంటున్నాం. రెండవది మేము మహిళా ప్రతిభను వెలికి తీసేందుకు ఆడియో కంటెంట్‌ను సులభంగా కనుగొనడాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. గత ఆరు నెలల్లో స్పాటిఫై యాంప్లిఫైహెర్లో భాగంగా మైక్రోసైట్, ప్లాట్‌ఫారమ్‌లో 30 తాజా పాడ్‌క్యాస్ట్‌లను రూపొందించింది. ఆడియోలోని ఇరవై నాలుగు మంది మహిళలు సంగీతం, పాడ్‌క్యాస్ట్‌లలో ప్రొఫైల్ చేయబడ్డారు. ఈ సంభాషణలు ఆడియోలో మైక్ ముందు, సీన్ వెనుక ఉన్న మహిళల నిజ జీవిత కథల నుండి ప్రేరణ పొందడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
- వసుంధర ముద్గిల్,
కమ్యూనికేషన్ హెడ్, స్పాటిఫై
- సలీమ