Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అటుకుల్లో లాక్టోజ్, కొవ్వు పదార్థాలు ఉండవు. ఐరన్తోపాటు 11 రకలా మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి. రోజు పెరుగుతోపాటు తీసుకుంటే కాల్షియం, ప్రోటీన్లు సమృద్దిగా లభిస్తాయి. అటుకులు త్వరగా జీర్ణం అవుతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. ఇందులో ఉండే విటమిన్ బీ1 రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుతుంది. మధుమేహం, గుండె వ్యాధులతో బాధపడేవారికి ఇది ఉత్తమ ఆహారం. ఇన్ని ప్రయోజనాలున్న అటుకులతో కొన్ని రకాల స్నాక్స్ చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఆ వంటకాల గురించి మనమూ తెలుసుకుందామా!
ఊతప్పం
కావాల్సిన పదార్ధాలు: అటుకులు - ఒక కప్పు, మినపప్పు - ఒకటిన్నర కప్పు, బియ్యం - అరగ్లాసు, పెరుగు - మూడు కప్పులు, ఉప్పు - తగినంత, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు - కొంచం.
తయారు చేయు విధానం: పెరుగులో అన్ని పదార్ధాలు వేసి నాలుగు గంటలు నానా బెట్టి, ఆ తర్వాత గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఇంకో నాలుగు గంటలు నాన బెట్టాలి. ఆ తర్వాత ఒక మందపాటి బాండీలో కొంచం నూనె పోసి అది కొంచం వేడెక్కాక ఒక గరిటతో కొంచం మందంగా చిన్న దోసె లాగా పోసి, పైన ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మూటపెట్టి చిన్న మంట మీద కాలనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా తిప్పి గోధుమ రంగులోకి వచ్చేదాకా ఉంచి తీసేయాలి. ఇవి చాలా సాఫ్టుగా ఉంటాయి. ఇందులోకి ఆవకాయ, ఇడ్లి పచ్చడి ఏదైనా బావుంటుంది.
దోశ
కావాల్సిన పదార్ధాలు: అటుకులు - కప్పు, మరమరాలు - కప్పు, బియ్యం - కప్పు, మినపప్పు - అర కప్పు, ఉప్పు - తగినంత.
తయారు చేయు విధానం: పైన చెప్పిన అన్నిటినీ కలిపి మూడు గంటలు నానబెట్టి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మరో ఐదు గంటలు నాన నివ్వాలి. అంటే కొంచం పులవాలన్నమాట. తర్వాత పెనం పెట్టి అది వేడెక్కక దోసెలా పోసి మీడియం ఫ్లేమ్ మీద గోధుమరంగు వచ్చేవరకు కాల్చాలి. దీనిలోకి కొబ్బరి చట్నీ లేదా టమాటో చెట్నీ బావుంటుంది.
అటుకుల పాయసం
కావాల్సిన పదార్ధాలు: అటుకులు - కప్పు (కొంచం మందంగా ఉండాలి), పాలు - రెండు కప్పులు, బెల్లం తురుము - ఒకటిన్నర కప్పు, నెయ్యి - ఐదు చెంచాలు, జీడిపప్పు, కిస్మిస్ - పది, ఏలకుల పొడి - చిన్న చెంచా.
తయారు చేయువిధానం: ముందుగా ఒక మందపాటి గిన్నెలో ఒక చెంచా నెయ్యి పోసి అది వేడి ఎక్కాక అందులో అటుకులు వేసి కొంచం వేయించాలి. కమ్మని వాసన వస్తుంది. అందులో పాలు పోసి అటుకులు మెత్తగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి బెల్లం తురుము వేసి బాగా కరిగే వరకు కలియ బెట్టాలి. ఇంకో బాండీలో మిగిలిన నెయ్యి పోసి అందులో జీడీ పప్పు, కిస్మిస్ వేసి వేయించాలి. అవి వేగాక అటుకుల మిశ్రమంలో వేయాలి. అప్పుడే ఏలకుల పొడి కూడా వేసి ఒక సారి కలియ బెట్టి వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది.
అటుకుల లడ్డు
కావాల్సిన పదార్ధాలు: మందపాటి అటుకులు - రెండు కప్పులు. బెల్లం తురుము - రెండు కప్పులు, నెయ్యి - గ్లాసు, జీడిపప్పు, కిస్మిస్ - ఇరవై, ఏలకుల పొడి - రెండు చెంచాలు.
తయారు చేయు విధానం: ఒక మందపాటి బాండీలో నెయ్యి పోసి అటుకులు కొంచం పచ్చిదనం పోయేవరకు వేయించాలి. ఆ తర్వాత వాటిని చల్లారనిచ్చి మిక్సీలో అటుకులు, బెల్లం తురుము గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఒక వెడల్పు గిన్నెలోకి తీసుకుని అందులో కిస్మిస్, జీడిపప్పులు నెయ్యిలో వేయించి కలపాలి. ఏలకుల పొడి కూడా వేసి ఉండలు కట్టాలి. ఒక వేళ ఉండ రాకపోతే కొంచం కొంచం నెయ్యి వేసి ఉండ కట్టాలి. ఇది పిల్లలకు ఎంతో బలమైన ఆహారం. రోజుకు ఒక్కటి తిన్న చాలు. కాల్షియం, ఐరన్ బాగా లభిస్తుంది
- పాలపర్తి సంధ్యారాణి