Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాళ్ళు లేకున్నా గుండెల నిండా ఆత్మవిశ్వాసం వుంది. నడవలేకున్నా ఏదో సాధించాలనే తపన వుంది. ఇవే ఆమె విజయానికి బాటలు వేశాయి. సమానతలను అధిగమించింది. పారాఒలింపిక్లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆమె ఏక్తా భయాన్... పతకాన్ని కాస్తలో చేజార్చుకున్నప్పటికీ అంత వరకూ వెళ్ళడమంటే మామూలు విషయం కాదు. వైకల్యాన్ని జయించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆమె పరిచయం మానవి పాఠకులకు ప్రత్యేకం..
ఈ ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు సాధించింది. ఇది నిజంగా గొప్ప విజయం. మహమ్మారి దాని సవాళ్లు ఉన్నప్పటికీ పారా అథ్లెట్లు చారిత్రాత్మక విజయాలను నమోదు చేశారు. దేశం గర్వపడేలా చేశారు. భారత్ ఈ విజయం సాధించడంలో వికలాంగుల పాత్ర కూడా ఎంతో ఉంది. వారిలో ఒకరే ఏక్తా భయాన్. ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు లేకపోయినప్పటికీ వీరు ప్రపంచ పఠంలో దేశాన్ని గర్వంగా నిలబెట్టారు. ఇక సరైన సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని విజయాలు సాధించడం అంత కష్టమేమీ కాదని టోక్యో పారాలింపిక్స్ ఓ ఉదాహరణగా నిలిచాయి.
గుణపాఠాలు నేర్చుకుంటూ...
నాలుగేండ్ల పాటు కఠోర శిక్షణ తర్వాత పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించే అవకాశం ఏక్తా భరున్కు వచ్చింది. అయితే ఆమె పతకం సాధించలేకపోయింది. ''ఇది చాలా నిరుత్సాహపరిచింది. నా కష్టమంతా వృధా అయిపోయింది. కానీ మనం ఎప్పుడూ మన పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ విజయం కోసం ప్రయత్నించాలని నేను నమ్ముతున్నాను'' అని ఆమె చెప్పింది.
ప్రమాదం తర్వాత
టోక్యోలో భారతదేశం అద్భుతమైన ప్రదర్శన తర్వాత పారా-అథ్లెట్లకు ఇప్పుడు తగిన గుర్తింపు లభిస్తున్నందుకు ఏక్తా సంతోషంగా ఉంది. 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నెముక గాయం కారణంగా ఆమె నడుము నుండి కింది అవయవాలు పూర్తిగా పక్షవాతానికి గురయ్యాయి. పై అవయవాల పాక్షిక పక్షవాతం ఏర్పడింది. అప్పుడు ఆమెకు కేవలం 18 ఏండ్లు మాత్రమే. ''డాక్టర్ కావాలని కలలు కన్నాను. ప్రమాదం తర్వాత నా జీవితం తీవ్ర మార్పుకు గురైంది. నా జీవితమే మారిపోయింది. తొమ్మిది నెలలు ఆసుపత్రిలో గడిపాను. మూడు శస్త్రచికిత్సలు చేయించుకున్నాను'' అంటుంది ఏక్తా.
చదువే ఆత్మ విశ్వాసం
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తాను వేరే వ్యక్తి అని తెలుసుకున్నానని ఏక్తా అంటుంది. ఆమె, ఆమె వైకల్యం గురించి సమాజ అవగాహనలో మార్పు వచ్చింది. ఆమెను కుటుంబానికి భారంగా భావించారు. అయినప్పటికీ చదువుకోవడం ప్రారంభించింది. అదే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 2013లో ఏక్తా హర్యానా సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి హర్యానా ప్రభుత్వంలో హిసార్‌లో అసిస్టెంట్ ఎంప్లారుమెంట్ ఆఫీసర్‌గా చేరింది.
టోర్నమెంట్లలో పోటీకి దిగింది
ఆమె సాధించిన విజయాలకు సంబంధించిన మీడియా నివేదికలు పారాలింపియన్ అమిత్ కుమార్ సరోహాకు చేరాయి. అతను ఆమెను పారా-స్పోర్ట్‌లో ప్రయత్నించమని ప్రోత్సహించాడు. అంతేకాదు క్లబ్ త్రోకు పరిచయం చేశాడు. అతని ప్రోత్సాహంతో 2016లో ఏక్తా ప్రధాన టోర్నమెంట్లలో పోటీపడటం ప్రారంభించింది. బెర్లిన్‌లో జరిగిన అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో రజతం గెలుచుకుంది. అలాగే 2018లో ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణం సాధించింది. తాను ఎక్కడికి వెళ్ళాలన్నా ఇతరుల సహకారం అవరసం. ఆ కారణంగా పారా-స్పోర్ట్స్‌ను చేపట్టడానికి మొదట్లో వెనుకాడినప్పటికీ ప్రభుత్వం ఆమెకు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ పూర్తి మద్దతు ఇచ్చింది. ఆమె విజయాలకు బాటలు వేసింది. అయినప్పటికీ వికలాంగులకు ఇలాంటి అవకాశాలు కల్పించేందుకు ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి వుందని ఆమె అభిప్రాయపడ్డారు.
మాకు అవకాశాలే తక్కువ
''కృత్రిమ అవయవాలు, మంచి నాణ్యమైన వీల్ చైర్ వంటి సహాయక పరికరాలు ఎంతో ఖరీదైనవి. మన దగ్గరి లోపభూయిష్ట మౌలిక సదుపాయాల వల్ల వికలాంగులు తమకు ఇష్టమైన, అనుకూలమైన వృత్తిని కొనసాగించడానికి అవకాశం లేకుండా పోతుంది. మాలాంటి వారికి ఉపాధి దొరకడం కూడా చాలా కష్టమే. మాలో చాలా మంది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఇతరులపై ఆధారపడతారు'' అని ప్రభుత్వ లోపాలను ఆమె ఎత్తి చూపారు.
కష్టపడి పని చేయాలి
ఇలాంటి అంతర్జాతీయ గుర్తింపు మరింత మంది పారా అథ్లెట్లు తెరపైకి రావడానికి సహాయపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే మరిన్ని మౌలిక సదుపాయాలను సృష్టించి వికలాంగులకు అవగాహన పెంచడం కూడా చాలా అవసరం. ''వికలాంగుల చుట్టూ ఉన్న మానసిక అడ్డంకులను కూడా మనం విచ్ఛిన్నం చేయాలి. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వండి'' అని ఆమె అంటుంది. ఏక్తా తనకు ఇష్టమైన కోట్తో సంతకం చేసింది. ''జీవితం మన చేతుల్లో లేదు కానీ జీవించాలి. మీరు సిద్ధంగా ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవచ్చు. కానీ మన పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మనం చేయగలిగినది ఏమిటంటే కష్టపడి సరైన దృక్పథంతో పనిచేయడమే'' అంటుంది ఏక్తా.
సమగ్ర ప్రపంచాన్ని సృష్టించాలి
గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌తో దీప్తి అనుబంధం 2012లో ప్రారంభమైంది. ఈమె రాష్ట్ర, విశ్వవిద్యాలయ స్థాయిలో టెన్నిస్, బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌లో చేరడానికి ముందు దీప్తి బ్యాంకింగ్ రంగంలో పనిచేసింది. క్రీడల పట్ల ఆమెకున్న అభిరుచి భారతదేశ క్రీడా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్‌లోకి వచ్చింది. ఈమె ఒలంపిక్, పారాలింపిక్ విభాగాల్లో 200 మందికి పైగా భారతీయ అథ్లెట్లతో కలిసి పని చేసింది. అదే సమయంలో దాదాపు 50 మంది ఒలింపియన్లు, పారాలింపియన్ల ప్రయాణాలలో ఈమె భాగమయింది.
''ప్రతి అథ్లెట్ విజయవంతం కావడానికి ఈ వేదిక సాధ్యమైనంత సహకారం అందిస్తుంది. ప్రతిభకు అవకాశం కల్పించే వేదికగా ఇది ఉంది. అలాగే క్రీడా ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణలను తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తుంది'' అని ఆమె చెప్పింది. సంవత్సరాలుగా అథ్లెట్లకు వారి అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై మద్దతునిస్తోంది. ప్రతి అథ్లెట్‌కు వ్యక్తిగతంగా సహాయక నిర్మాణాన్ని రూపొందించడం ముఖ్యంగా వారి అవసరాలను అర్థం చేసుకోవడం ఫౌండేషన్ లక్ష్యం. వీటిలో ఇంపాక్ట్ స్పోర్ట్స్ ట్రైనింగ్, ఫిజికల్ అసెస్మెంట్స్, ఫిజియోథెరపీ, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, మెంటల్ కండిషనింగ్, న్యూట్రిషనల్ కౌన్సెలింగ్, గాయమైతే వైద్యం అందించడం, వారికి పునరావాసం కూడా ఉన్నాయి. ప్రయాణం, వసతి, బీమా, టోర్నమెంట్ ప్రవేశ రుసుములతో సహా పోటీ ఖర్చులు, క్రీడా దుస్తులు, పరికరాలు, అథ్లెట్ విద్య, అభివృద్ధి, కెరీర్ నిర్వహణ మార్గదర్శకత్వం, చట్టపరమైన మద్దతు ఇలా అన్ని విధాలుగా వానిరి సహకరిస్తుంది.
''సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు, చఔమష్ట్రవ15 వీశీఙవఎవఅ్ ఉద్యమం వంటి వివిధ అంతర్జాతీయ కార్యక్రమాలు, ఉద్యమాలకు సమలేఖనం చేయడం, సహకారం అందించడం గోస్పోర్ట్స్ ఫౌండేషన్ ముందున్న పెద్ద లక్ష్యం. ఎందుకంటే ఇవి మరింత సమగ్ర ప్రపంచాన్ని సృష్టించడం, వైకల్యాలున్న వ్యక్తుల కోసం మరిన్ని అవకాశాలను తెరపైకి తీసుకురావడం, ప్రజల దృక్పథాలు, అవగాహనలను మార్పు తీసుకురావల్సిన అవసరం వుంది' అని దీప్తి చెప్పింది.
- దీప్తి, గోస్పోర్ట్స్ ఫౌండేషన్
- సలీమ