Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేస్తున్న ఉద్యోగం నుంచి మరో సంస్థకు మారాలనుకున్నప్పుడు ప్రత్యేక ప్రణాళిక ఉండాలంటున్నారు నిపుణులు. ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సానుకూల సమాధానాలిచ్చి విజయాన్ని దక్కించుకోవాలని సూచిస్తున్నారు..
- ఇంటర్వ్యూలో మీ బలం, బలహీనతలను వివరించమంటారు. ముందుగా మీ సామర్థ్యం గురించి చెప్పాలి. పాత సంస్థలో విజయవంతం చేసిన ప్రాజెక్టులు, వాటివల్ల సంస్థకు కలిగిన ప్రయోజనాలను అర్థమయ్యేలా వివరించగలగాలి. అలాగే అసలే బలహీనతలూ లేవనకుండా, ఏదైనా పనిలో ఓటమి ఎదురైనప్పుడు ముందుగా దాన్ని అంగీకరించలేకపోవడం మీ బలహీనతగా భావిస్తానని ధైర్యంగా చెప్పాలి. ఆ అనుభవంతో తిరిగి కృషి చేసి విజయాన్ని సొంతం చేసుకునే మీ పట్టుదలను వారికి తెలియజేయాలి.
- ఈ సంస్థనే ఎందుకు ఎంపిక చేసుకున్నారనే ప్రశ్నకు... ఇందులో స్థానాన్ని సంపాదించగలిగితే కెరియర్లో ఉన్నతస్థాయికి చేరుకుంటాననే మీ ఆశాభావాన్ని వివరించాలి. అభివృద్ధితోపాటు ఉద్యోగుల సాధికారత కోసం ఆ సంస్థ రూపొందిస్తున్న ప్రణాళికల ప్రత్యేకతను మీరు గుర్తించినట్టు చెప్పాలి. అలాగే సామాజిక ప్రయోజనాలతో పనిచేస్తున్న ఆ సంస్థ మీకు కెరియర్ పరంగానే కాకుండా, మానసిక తృప్తినీ ఇస్తుందని.. చెప్పాలి.
- పాత సంస్థ గురించి ప్రతికూలంగా మాట్లాడకూడదు. కెరియర్లో పైమెట్టుకు వెళ్లాలనే ఆలోచనతోనే కొత్త సంస్థకు మారడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పాలి. మీ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించి సంస్థ అభివృద్ధి కోసం కృషి చేసే అవకాశాన్ని అందించాలని కోరాలి.