Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం చేసే మహిళది ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవస్తుంటారు. ఉదయం లేచింది మొదలు నిద్రపోయ వరకు బిజీ బిజీగా గడుపుతారు. దీనివల్ల పిల్లలకు దూరమవుతున్నాననే బాధ.. ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీసుకొస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందేమో.. ఇంటికి బయల్దేరే సరికి ఆలస్యమవుతుంది. ఇంటికి వెళ్లే సరికి పిల్లలు నిద్రపోయే మూడ్లో ఉంటారు.. వాళ్లతో కలిసి గడపలేకపోతున్నానని, వాళ్ల చదువుల్లో సహాయం చేయలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటారు చాలామంది. అయితే మన ఆర్థిక స్థితి బాగుండాలంటే ఉద్యోగం తప్పనిసరి. అందుకే ఉద్యోగం చేయలేక, మానలేక ఇబ్బంది పడుతుంటారు కొందరు.
భార్యా, భర్త ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి ఓ వైపు... చదివిన చదువును సార్థ్యకం చేయాలనే తపన మరో వైపు.. జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం... ఇలా ఆడవాళ్లు ఇంటి పనులతో పాటు ఆఫీసు బాధ్యతలనూ మోస్తున్నారు. ఆర్థికంగా భర్తకు తోడ్పాటునందిస్తున్నారు. ఇక్కడ వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ పిల్లలతో గడపలేకపోతున్నామనే బాధ తల్లుల్లో ఎక్కువవుతోందని ఇటీవల పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం ఉద్యోగం చేసే తల్లులు తమ పిల్లలతో రోజుకు కేవలం గంట, గంటన్నర కంటే ఎక్కువ సమయం వెచ్చించలేక పోతున్నారట. అదే ఇంట్లో ఉండే అమ్మలైతే తమ పిల్లలతో దాదాపు రెండున్నర నుంచి మూడు గంటల పాటు సమయం గడుపుతున్నారట.
ఏదడికితే అది
'ఇంత కష్టపడుతోంది పిల్లల కోసమే.. కానీ వాళ్లతో గడిపే సమయమే దొరకట్లేదు..' ఎవర్ని కదిపినా ఇదే పరిస్థితి. ఈ ఫీలింగ్ వల్లే చాలామంది అమ్మలు పిల్లలు ఏదడిగితే అది ఇట్టే కొనిచ్చేస్తుంటారు. తమ ప్రేమను ఆ రకంగా చూపిస్తున్నామని వాళ్లనుకుంటారు. వాళ్లతో తాము గడపలేకపోయిన సమయానికి ఈ రకంగా పరిహారం చెల్లిస్తున్నామని భావిస్తుంటారు. కానీ ఈ రకమైన గిల్టీ ఫీలింగ్ తప్పంటున్నారు నిపుణులు. దీనివల్ల పిల్లలకు తామేదడిగితే అది వెంటనే దొరుకుతుందన్న భావన కలుగుతుంది. ఒకవేళ భవిష్యత్లో ఎప్పుడైనా అలా జరగకపోతే వాళ్లు చాలా బాధపడతారు. రెబెల్ మనస్తత్వాన్ని పెంచుకుంటారు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లిస్టు రాసుకోండి
'ఇలా అయితే పాపకు చదువు రాదు... నేను ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి చదివించాల్సిందే.. లేకపోతే మంచి మార్కులు అస్సలు రావు..' ఇలాంటి మాటలు చాలామంది తల్లుల నోటి నుంచి వింటుంటాం. అయితే పిల్లల చదువు కోసం పూర్తిగా ఉద్యోగం మానడమే సరైన పద్ధతి కాకపోవచ్చు. మీరిప్పుడున్న లైఫ్స్త్టెల్లోనే పిల్లల కోసం ఎక్కువ సమయం ఎలా కేటాయించగలరో ఆలోచించండి. పనులన్నీ ఓ లిస్టు రాసుకొని చేసుకోవడం వల్ల తొందరగా పూర్తవుతాయి. ఆఫీసు పనులను కూడా మరీ ఎక్కువ సేపు కాకుండా త్వరగా పూర్తి చేసుకొని వీలైనంత తొందరగా ఇంటికి బయల్దేరే విధంగా చూసుకోండి. అవసరమైతే దీని కోసం మీరు మీ యాజమాన్యంతో మాట్లాడండి. ఒకవేళ మీ పని వేళలు దానికి సహకరించకపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచించచ్చు. ఉద్యోగం మారిపోవడమో లేక మానేయడమో అప్పుడు తేల్చుకోవచ్చు.
ఎంత ఆనందంగా గడిపామో ముఖ్యం
మనం పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నామన్నది కాదు ప్రశ్న.. గడిపే కొద్ది సమయంలోనే ఎంత ఆనందంగా ఉంటున్నామన్నదే ముఖ్యం. సాయంత్రం మిగిలిన కొద్ది నిమిషాల్లోనే పిల్లలతో గేమ్స్ ఆడండి, వాళ్లతో కబుర్లు చెప్పండి, స్కూలు విషయాలు, బయట విషయాలు, ఫ్రెండ్స్ గురించి.. ఇలా చెప్పాలంటే పిల్లల దగ్గర లేని విషయాలంటూ ఉండవు.. ఒక్కసారి అడగడం ప్రారంభిస్తే చాలు.. వసపిట్టలా గడగడా మాట్లాడటం ప్రారంభించేస్తారు. తర్వాత దాన్ని ఆపడం మన చేతిలో ఉండదు. పిల్లల మాటల్ని కూడా వినీ విననట్టు ఉండకుండా పూర్తి శ్రద్ధతో వాళ్లతో సమయాన్ని గడపండి. కావాలంటే కాసేపు ఇంకే పనులూ పెట్టుకోకుండా కేవలం వాళ్లకే కేటాయించినా మంచిదే..
ఒక్కరే చేయవద్దు
ఇంట్లో లేదా ఆఫీసులో అన్ని పనులూ మీరొక్కరే చేసుకుంటూ పోతే సమయమంతా వాటికే సరిపోతోంది అని బాధ పడటం సరైంది కాదు. పనులను పంచడం అలవాటు చేసుకోండి. ఆఫీసులో మీ కింద ఉద్యోగులు చేయగలిగిన పనులను మీ చేతిలోకి తీసుకోవద్దు. దీనివల్ల మీ మీద పనిభారం పెరగడం తప్ప ఇంకెలాంటి ఉపయోగమూ లేదు. మీకు సపోర్టింగ్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోండి. మీరు లేని సమయాల్లో ఇంట్లో లేదా ఆఫీసులో పని పూర్తిగా ఆగిపోకుండా ఉంటే మంచిది. ఇక పిల్లలతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలంటే మీకు నచ్చిన పనిని మీకు నచ్చిన వేళల్లో చేసుకొనే అవకాశం కల్పించే ఉద్యోగం ఏదైనా ఉంటే దాన్ని వెతుక్కోవడం చాలా మంచి పద్ధతి. ఈరోజుల్లో చాలామంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఇలాంటి అసైన్మెంట్స్ వెతుక్కుంటున్నారు కూడా.. సో మీరూ వాళ్లను ఫాలో అయిపోండి. పిల్లలతో ఎక్కువ సమయం గడపండి.